రాష్ట్రపతి పాదాలను తాకేందుకు ప్రయత్నించి సస్పెండైంది

రాష్ట్రపతి పాదాలను తాకేందుకు ప్రయత్నించి సస్పెండైంది

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజస్థాన్ పర్యటనలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. రాష్ట్రపతి పాదాలను తాకేందుకు ప్రయత్నించిన ఓ ప్రభుత్వ ఇంజనీర్పై సస్పెన్షన్ వేటు పడింది. సదరు ఇంజనీర్  ప్రోటోకాల్ ఉల్లంఘించిందని రాజస్థాన్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ నెల 3, 4 తేదీల్లో రాజస్థాన్లో రాష్ట్రపతి ముర్ము పర్యటించారు. రోహెత్లో ఓ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఆ సమయంలో ప్రజారోగ్య విభాగంలో ఇంజినీర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తోన్న అంబా సియోల్‌.. సభా ప్రాంగణంలో నీళ్లను అందించే బాధ్యతలు చూస్తున్నారు. 

రాష్ట్రపతి చేరుకోగానే ప్రొటోకాల్‌ ఉల్లంఘించి రాష్ట్రపతి పాదాలకు నమస్కరించేందుకు అంబా సియోల్ ప్రయత్నించారు. అయితే రాష్ట్రపతి వ్యక్తిగత సిబ్బంది ఆమెను అడ్డుకున్నారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన కేంద్ర హోంశాఖ.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి నివేదికను కోరింది. ఈ వ్యవహారంపై చర్యలు చేపట్టిన రాజస్థాన్‌ ప్రభుత్వం.. రాజస్థాన్‌ సివిల్‌ సర్వీసెస్‌ నియమాల ప్రకారం సదరు ఇంజినీర్‌ను తక్షణమే సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇటీవలె ఓ వ్యక్తి భద్రతా వలయాలను ఛేదించుకొని ప్రధాని మోడీకి పూలమాల వేసేందుకు ప్రయత్నించి కలకలం సృష్టించాడు.