రూ.500 నోట్లను విత్తనాలుగా పొలంలో నాటిన రైతు.. చెట్లకు డబ్బులు కాస్తాయా ఇప్పుడు..?

రూ.500 నోట్లను విత్తనాలుగా పొలంలో నాటిన రైతు.. చెట్లకు డబ్బులు కాస్తాయా ఇప్పుడు..?

అమ్మో.. అమ్మో ఈ రైతు ఆలోచన మామూలుగా లేదు.. చెట్లకు డబ్బులు కాస్తాయా అనే సామెతను సీరియస్ గా తీసుకున్నట్లు ఉన్నాడు.. చెట్లకు డబ్బులు ఎలా కాస్తాయో చూపిస్తానంటూ.. తన పొలంలో ఏకంగా 500 రూపాయల నోట్లను విత్తనాలుగా నాటాడు.. కాకపోతే ఆ 500 రూపాయల విత్తన నోట్లకు నీళ్లు మాత్రం పోయలేదు కానీ.. ఎంచక్కా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు.. ఈ రైతు ఎందుకు ఇలా చేశాడు అనే తెలుసుకుందామా.. 

రాజస్థాన్ రాష్ట్రం.. దవరియా జతన్ గ్రామం. మల్లారం బవారీ అనే రైతు. పత్తి పంట పండిస్తుంటాడు. బ్యాంకులో లక్ష రూపాయల అప్పు తీసుకుని పత్తి పంట సాగుచేశాడు. పంట చేతికి వచ్చే సమయంలో భారీ వర్షాలు. పంట అంతా నాశనం అయ్యింది. మిగిలిన పంటను అమ్మితే.. జస్ట్.. కేవలం 4 అంటే నాలుగు వేల రూపాయలు మాత్రమే చేతికి వచ్చింది. బ్యాంక్ అప్పు కావటంతో క్రాప్ ఇన్సూరెన్స్ కు అప్లయ్ చేశాడు. ఇన్సూరెన్స్ రాలేదు. బీమా కంపెనీకి కంప్లయింట్ చేశాడు. అయినా ఇన్సూరెన్స్ రాలేదు. 

ఇక లాభం లేదు అనుకుని.. తన పొలంలో 500 రూపాయల నోట్లను విత్తనాలుగా నాటాడు. వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఎందుకు ఇలా చేశావ్ అని ఆ రైతును అడిగితే.. ప్రభుత్వం, బీమా కంపెనీ పట్టించుకోవటం లేదు.. అందుకే ఇలా చేశాను.. ఇప్పుడైనా స్పందిస్తుందో లేదో చూడాలి అంటూ చెప్పుకొచ్చాడు. ప్రభుత్వం, బీమా కంపెనీపై తన నిరసనను ఈ విధంగా వ్యక్తం చేయటం.. సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ రైతుకు న్యాయం చేయాలంటూ నెటిజన్లు దుమ్ముదుమ్ముగా రిప్లయ్స్ ఇస్తున్నారు. 

సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోపై ఫన్నీ కామెంట్స్ కూడా వస్తున్నాయి. 500 నోట్ల నాటితే 2 వేల రూపాయల నోట్లు కాస్తాయేమో.. అవి చెల్లని నోట్లు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చెట్లకు డబ్బులు కాయటం అంటే ఏంటో ఇప్పటి వరకు విన్నాం.. ఇప్పుడు చూస్తున్నాం అంటూ మరికొంత మంది నెటిజన్లు స్పందిస్తున్నారు.