పెళ్లికి ఒప్పుకోలేదని యువతిని, తల్లిని పొడిచిన ప్రియుడు

V6 Velugu Posted on Jul 26, 2021

జైపూర్: ప్రేమించిన యువతి పెండ్లికి ఒప్పుకోలేదని ఓ యువకుడు  తన ప్రియురాలితో పాటు ఆమె తల్లిని కత్తితో పొడిచి పారిపోయాడు. వారిద్దరికీ తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వారి పరిస్థితి సీరియస్‌గా ఉంది. రాజస్థాన్‌లోని టోంక్ జిల్లాలో సోమవారం ఈ ఘటన జరిగింది.
రాజస్థాన్‌లోని కొత్వాలి ప్రాంతంలో నివసించే ఆసిఫ్ అనే 22 ఏండ్ల యువకుడు కొన్నాళ్లుగా అదే ప్రాంతానికి చెందిన 21 ఏండ్ల యువతితో రిలేషన్‌లో ఉన్నాడు. ఆసిఫ్ ఆ యువతిని పెండ్లి చేసుకోవాలనుకున్నాడు. దీంతో ఆమె ముందు ఈ ప్రపోజల్‌ పెట్టాడు. కానీ ఆమె ఒప్పుకోలేదు. దీంతో ఆసిఫ్‌ ఈ రోజు (సోమవారం) ఉదయం  ఆ యువతి ఉంటున్న కిరాయి ఇంట్లోకి వెళ్లి కత్తితో పొడిచాడని కొత్వాలి పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌హెచ్‌వో జితేంద్ర సింగ్ తెలిపారు. అతడి నుంచి కూతురిని కాపాడుకునేందుకు ఆ యువతి తల్లి ప్రయత్నించగా.. ఆమెను కూడా పొడిచి పారిపోయాడని చెప్పారు. తల్లీకూతుళ్లిద్దరికీ తీవ్రమైన గాయాలు కావడంతో టోంక్ జిల్లా ఆస్పత్రికి తరలించామన్నారు. అయితే వారి కండిషన్ సీరియస్‌గా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం జైపూర్‌‌లోని ఎస్ఎంఎస్‌ హాస్పిటల్‌కు షిఫ్ట్ చేశామని జితేంద్ర సింగ్‌ చెప్పారు. నిందితుడిని అరెస్ట్ చేసేందుకు గాలింపు చేపడుతున్నట్టు తెలిపారు.

Tagged rajasthan, love, Marriage Proposal

Latest Videos

Subscribe Now

More News