నాలుగేళ్ల తర్వాత ప్లే ఆఫ్స్ కు రాజస్థాన్

నాలుగేళ్ల తర్వాత ప్లే ఆఫ్స్ కు రాజస్థాన్

ముంబై: టార్గెట్‌‌‌‌ ఛేజింగ్‌‌లో రాజస్తాన్‌‌ రాయల్స్‌‌ అదరగొట్టింది. ఓపెనర్‌‌ యశస్వి జైస్వాల్ (44 బాల్స్ లో 8 ఫోర్లు, 1 సిక్సర్ తో 59), రవి చంద్రన్ అశ్విన్ (23 బాల్స్ లో 2 ఫోర్లు, 3 సిక్స్ లతో 40 నాటౌట్) చెలరేగడంతో.. శుక్రవారం జరిగిన ఆఖరి లీగ్‌‌ మ్యాచ్‌‌లో 5 వికెట్ల తేడాతో చెన్నై సూపర్‌‌కింగ్స్‌‌పై గెలిచింది. దీంతో 9 విజయాలతో రెండో ప్లేస్‌‌తో ప్లే ఆఫ్స్‌‌కు చేరుకుంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో 150/6 స్కోరు చేసింది. మొయిన్ అలీ (57 బాల్స్ లో 13 ఫోర్లు, 3 సిక్సర్లతో 93) మెరిశాడు. రాయల్స్ బౌలర్లలో మెకే (2/20), చహల్ (2/26) రాణించారు.  లక్ష్య ఛేదనలో ఓవర్లన్నీ ఆడిన రాజస్తాన్‌‌ 151/5 రన్స్ చేసి గెలిచింది. అశ్విన్​తోపాటు రియాన్ పరాగ్ (10 నాటౌట్) చివరి ఓవర్లో జట్టుకు గెలుపు అందించాడు. బట్లర్‌‌ (2), శాంసన్‌‌ (15), పడిక్కల్‌‌ (3), హెట్‌‌మయర్‌‌ (6) విఫలమయ్యారు. అశ్విన్‌‌కు ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ అవార్డు లభించింది. క్వాలిఫయర్​–1లో రాజస్తాన్​.. గుజరాత్​తో తలపడుతుంది. 

చెన్నై పసలేని బ్యాటింగ్..

మొదట బ్యాటింగ్ లో తొలి ఓవర్లోనే రుతురాజ్ (2) వికెట్ కోల్పోయిన సీఎస్ కే.. మొయిన్ అలీ రాకతో ఏ దశలోనూ వెనక్కు తిరిగి చూసుకోలేదు. కాన్వే (16) సపోర్ట్ తో రెచ్చిపోయిన అలీ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. 4వ ఓవర్లో 4,4,6,4.... 5వ ఓవర్లో 4,4,6.. అలాగే బౌల్ట్ వేసిన 6వ ఓవర్లో 6,4,4,4,4,4తో విశ్వరూపం చూపించి 19 బాల్స్ లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో పవర్ ప్లేలోనే 75/1తో నిలిచిన చెన్నై భారీస్కోరు దిశగా సాగింది. కానీ వెంటవెంటనే కాన్వే, జగదీశన్ (1), రాయుడు (3) వికెట్లు కోల్పోయిన చెన్నై డిఫెన్స్ లో పడిపోయింది. ఆపై అలీ, ధోనీ (26)ని పూర్తిగా కట్ట-డి చేసిన రాయల్స్ బౌలర్లు అపోనెంట్ ను మోస్తారు స్కోరుకే పరిమితం చేశారు. చివరి పది ఓవర్లలో చెన్నై 56 రన్సే చేయడం గమనార్హం.