
- బెంగళూరుకు మళ్లీ నిరాశే
- బట్లర్ సెంచరీ షో
- ఐపీఎల్ ఫైనల్లో రాజస్తాన్
- ఆదివారం జీటీతోటైటిల్ ఫైట్
అహ్మదాబాద్: కెప్టెన్ మారినా.. ప్లేయర్లు మారినా.. బెంగళూరు రాత మాత్రం మారలేదు. లీగ్ దశలో మెరుగ్గా ఆడినా... ఎలిమినేటర్‌లో అద్భుతంగా ఆడినా.. కీలకమైన క్వాలిఫయర్ మ్యాచ్‌లో మళ్లీ తడబడింది. దీంతో మరోసారి ఐపీఎల్ టైటిల్‌కు రెండు అడుగుల దూరంలోనే నిలిచిపోయింది. ఇక ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన రాజస్తాన్ రాయల్స్.. రెండోసారి మెగా లీగ్ ఫైనల్లోకి ప్రవేశించింది. టార్గెట్ ఛేజింగ్‌లో జోస్ బట్లర్ (60 బాల్స్‌లో 10 ఫోర్లు, 6 సిక్సర్లతో 106 నాటౌట్) సెంచరీ షో చూపెట్టడంతో... శుక్రవారం జరిగిన క్వాలిఫయర్-–2లో రాయల్స్ 7 వికెట్ల తేడాతో ఆర్‌సీబీని ఓడించింది. టాస్ ఓడిన బెంగళూరు 20 ఓవర్లలో 157/8 స్కోరు చేసింది. రజత్ పటీదార్ (42 బాల్స్‌లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 58) , డుప్లెసిస్ (27 బాల్స్‌లో 3 ఫోర్లతో 25), మ్యాక్స్‌వెల్ (13 బాల్స్‌లో 1 ఫోర్, 2 సిక్సర్లతో 24) రాణించారు. తర్వాత రాజస్తాన్ 18.1 ఓవర్లలో 161/3 స్కోరు చేసి గెలిచింది. బట్లర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
బ్యాటింగ్‌లో ఢమాల్..
ఆర్సీబీ ఇన్నింగ్స్ ఆరో బాల్‌కే భారీ సిక్సర్‌తో జోష్ పెంచిన కోహ్లీ (7)ని ప్రసిధ్ (3/22).. రెండో ఓవర్‌లోనే ఔట్ చేసి షాకిచ్చాడు. డుప్లెసిస్, రజత్ పటీదార్ బౌండ్రీలపై దృష్టి పెట్టడంతో రన్‌రేట్ తగ్గలేదు. ఆరో ఓవర్‌లో పటీదార్ ఇచ్చిన క్యాచ్‌ను పరాగ్ వదిలేయడంతో పవర్‌ప్లేలో బెంగళూరు 46/1 స్కోరు చేసింది. చహల్ (9వ ఓవర్)కు సిక్సర్‌తో స్వాగతం పలికిన పటీదార్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగించాడు. 11వ ఓవర్‌లో మెకే (3/23).. డుప్లెసిస్‌ను ఔట్ చేసి రెండో వికెట్‌కు 70 రన్స్ పార్ట్‌నర్‌షిప్ బ్రేక్ చేశాడు. తర్వాత మ్యాక్స్‌వెల్.. రెండు సిక్సర్లు, ఓ ఫోర్‌తో వేగం పెంచినా, 14వ ఓవర్‌లో బౌల్ట్ (1/28) దెబ్బకు వెనుదిరిగాడు. 15వ ఓవర్ (చహల్)లో సిక్సర్‌తో పటీదార్ 40 బాల్స్‌లో ఫిఫ్టీ కంప్లీట్ చేశాడు. ఆ వెంటనే మరో సిక్సర్ కొట్టి.. 16వ ఓవర్‌లో అశ్విన్ (1/31) బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఇక్కడి నుంచి రాయల్స్ బౌలర్లు పట్టుబిగించారు. కార్తీక్ (6)ను కట్టడి చేయడంతో పాటు 18వ ఓవర్‌లో లోమ్రోర్ (8)ను ఔట్ చేశారు. 19వ ఓవర్ (ప్రసిధ్) వరుస బాల్స్‌లో కార్తీక్, హసరంగ (0) పెవిలియన్‌కు చేరారు. ఓవరాల్‌గా లాస్ట్ ఐదు ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 34 రన్సే చేసింది .
బట్లర్ బాదేసిండు..
ఛేజింగ్ తొలి ఓవర్‌నే జైస్వాల్ (21).. 6, 4, 6తో మొదలుపెడితే, తర్వాత బట్లర్ 4, 4, 4, 6తో జోరందుకున్నాడు. ఐదో ఓవర్‌లో 6, 6, 4తో మరో స్థాయికి తీసుకెళ్లాడు. అయితే నెక్స్ట్ ఓవర్‌లో జైస్వాల్ ఔట్‌కావడంతో తొలి వికెట్‌కు 61 రన్స్ భాగస్వామ్యం ముగిసింది. ఈ ఓవర్‌లో బట్లర్ ఫోర్‌తో పవర్‌ప్లేలో 67/1 స్కోరు చేసింది. శాంసన్ (23) ఉన్నంతసేపు అల్లాడించాడు. 9వ ఓవర్‌లో శాంసన్.. 6, 4, 4, ఆ వెంటనే 4తో రెచ్చిపోయాడు. దీంతో 10 ఓవర్లలోనే రాయల్స్ 103/1తో పటిష్ట స్థితికి చేరుకుంది. 11వ ఓవర్‌లో బట్లర్ ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను కార్తీక్ వదిలేయగా, శాంసన్ సిక్సర్ బాదాడు. అయితే 12వ ఓవర్‌లో.. శాంసన్ ఔట్‌కావడంతో రెండో వికెట్‌కు 52 రన్స్ భాగస్వామ్యం ముగిసింది. ఇక 48 బాల్స్‌లో 44 రన్స్ కావాల్సిన దశలో బట్లర్ 6, 6, 4 దంచితే, పడిక్కల్ (9) వెనుదిరిగాడు. చివరి 18 బాల్స్‌లో 10 రన్స్ అవసరం కాగా బట్లర్ సెంచరీ పూర్తి చేసుకోవడంతోపాటు సిక్స్‌తో మ్యాచ్ ముగించాడు.ఈ సీజన్‌లో బట్లర్ (824 రన్స్) చేసిన సెంచరీలు. ఒకే సీజన్‌లో ఎక్కువ సెంచరీలు చేసిన కోహ్లీ రికార్డును సమం చేశాడు.