IPL 2024: వార్నర్, స్టబ్స్ పోరాటం వృధా.. ఢిల్లీపై రాజస్థాన్ థ్రిల్లింగ్ విక్టరీ

IPL 2024: వార్నర్, స్టబ్స్ పోరాటం వృధా.. ఢిల్లీపై రాజస్థాన్ థ్రిల్లింగ్ విక్టరీ

ఐపీఎల్ లో మరో థ్రిల్లింగ్ మ్యాచ్ అభిమానులను అలరించింది. అత్యంత ఉత్కంఠ భరితంగా ముగిసిన ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ ఢిల్లీపై గెలిచి వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. పరాగ్ ఒంటరి పోరాటానికి తోడు.. రాజస్థాన్ బౌలర్లు సమిష్టిగా రాణించడంతో 12 పరుగుల తేడాతో విక్టరీ కొట్టింది. భారీ లక్ష్య ఛేదనలో వార్నర్, స్టబ్స్ పోరాడినా ఫలితం లేకుండా పోయింది. 

186 పరుగుల లక్ష్య ఛేదనలో వార్నర్, మార్ష్ ఢిల్లీ జట్టుకు అదిరిపోయే శుభారంభాన్ని ఇచ్చారు. తొలి వికెట్ కు మూడు ఓవర్లోనే 30 పరుగులు జోడించారు. అయితే ఈ దశలో బర్గర్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి ఢిల్లీని కష్టాల్లో నెట్టాడు. ఆ తర్వాత కెప్టెన్ పంత్ తో కలిసి వార్నర్ చెలరేగాడు. బౌండరీల వర్షం కురిపిస్తూ రాజస్థాన్ బౌలర్లపై ఒత్తిడి పెంచారు. 49 పరుగులు చేసిన వార్నర్ ఔట్ కావడంతో ఢిల్లీ ఛేజింగ్ లో వెనకపడింది. పంత్ (28), అభిషేక్ పోరెల్ (9) వెంటనే ఔట్ కావడంతో ఢిల్లీ మ్యాచ్ గెలుస్తుందని ఆశలు వదిలేసుకున్నారు.

అయితే చివర్ల స్టబ్స్ అద్భుత పోరాటంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. చివరి ఓవర్లో 17 పరుగులు చేయాల్సిన దశలో ఆవేశ ఖాన్ కేవలం 4 పరుగులే ఇవ్వడంతో ఢిల్లీ ఈ టోర్నీలో వరుసగా రెండో పరాజయాన్ని నమోదు చేసుకుంది. 23 బంతుల్లో 44 పరుగులు చేసి స్టబ్స్ నాటౌట్ గా నిలిచాడు. రాజస్థాన్ బౌలర్లలో బర్గర్, చాహల్ తలో రెండు వికెట్లు తీసుకున్నారు. ఆవేశ ఖాన్ కు ఒక వికెట్ దక్కింది.      

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. మొదట్లో 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినా.. రియాన్ పరాగ్(84) ఒంటరి పోరాటానికి తోడు అశ్విన్, జురెల్, హెట్ మేయర్ సహకరించడంతో భారీ స్కోర్ చేయగలిగింది.  
జురెల్, హెట్ మేయర్ తో కలిసి పరాగ్ వారియర్ లా పోరాడాడు. ఫోర్లు సిక్సర్లతో విధ్వంసం సృష్టించాడు. 45 బంతుల్లో 6 సిక్సులు, 7 ఫోర్లతో 84 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. పరాగ్ ధాటికి చివరి ఓవర్లో ఏకంగా 25 పరుగులు వచ్చాయి.