చైనాలోని వుహాన్ సిటీలో పుట్టిన కరోనా వైరస్ మానవాళి మొత్తాన్ని వణికిస్తోంది. ప్రపంచమంతా అల్లకల్లోలం సృష్టిస్తున్న ఈ మహమ్మారి బారినపడి అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం వేలాదిగా ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. కొత్త వైరస్ కావడంతో పరీక్షలు చేసి బాధితులను గుర్తించేందుకు కూడా చాలా దేశాలకు టెస్టు కిట్లు అందుబాటులో లేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో భారత్ సహా పలు దేశాలు చైనా, దక్షిణ కొరియా వంటి దేశాలపై అధారపడుతున్నాయి. టెస్టులు భారీగా చేసి వైరస్ సోకిన వారిని గుర్తించాలన్న లక్ష్యంతో చైనా నుంచి భారత మెడికల్ రీసెర్ట్ కౌన్సిల్ (ఐసీఎంఆర్) 6 లక్షల 50 వేల కరోనా రాపిడ్ టెస్టు కిట్లను దిగుమతి చేసుకుంది. వీటిలో రాజస్థాన్ కు 10 వేల కిట్స్ ను పంపింది కేంద్ర ప్రభుత్వం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా చైనా నుంచి మరో లక్ష కిట్లను ఆర్డర్ చేసి తెప్పించుకుంది. అయితే ఇప్పుడు ఆ టెస్టు కిట్లు సక్రమంగా పని చేయడం లేదు. దీంతో వాటిని రిటర్న్ పంపాలని ఆ రాష్ట్రం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
100లో 5.4 శాతమే..
చైనా నుంచి వచ్చిన రాపిడ్ టెస్టు కిట్లను ప్రయోగాత్మకంగా పరిశీలించేందుకు అప్పటికే పాజిటివ్ వచ్చిన వారిని పరీక్షితే.. నెగటివ్ రిపోర్ట్ చూపించాయని రాజస్థాన్ ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ రఘు శర్మ ఆందోళన వ్యక్తం చేశారు. ర్యాపిడ్ టెస్టు కిట్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం సూచించిన అన్ని గైడ్ లైన్స్ ను ఫాలో అవుతున్నామని అయినా అవి సరిగా పని చేయడం లేదన్నారు మంత్రి రఘు శర్మ. పాజిటివ్ పేషెంట్ల రిజల్ట్ కూడా నెగటివ్ గా చూపిస్తున్నాయని చెప్పారు. ఈ టెస్టు కిట్లను పరిశీలించేందుకు మైక్రోబయాలజీ, మెడిసిన్ డిపార్ట్ మెంట్ల చీఫ్ లతో కమిటీ వేశామని, వాస్తవానికి 90 శాతం కచ్చితత్వంతో పని చేయాల్సిన కిట్స్ కేవలం 5.4 శాతమే యాక్యరెసీని ఇవ్వగలుగుతున్నాయని తెలిపారు. ఈ విషయాన్ని ఐసీఎంఆర్ దృష్టికి తీసుకెళ్లేందుకు లేఖ రాశామన్నారు. స్టాండర్డ్స్ లేని ఈ కిట్ల వాడకం నిలిపేశామని, ఐసీఎంఆర్ స్పందన కోసం వేచి చూస్తున్నామని చెప్పారు. ఇప్పటికే పశ్చిమ బెంగాల్ కూడా టెస్టు కిట్లు సరిగా పని చేయడం లేదని కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది.
