గొంతులో చుక్క పడితే వైరస్ ఖతమైతది

గొంతులో చుక్క పడితే వైరస్ ఖతమైతది
  • కాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్ సింగ్
  • వైన్ షాపులు ఓపెన్ చేయాలని సీఎంకు వినతి

జైపూర్: కరోనావైరస్ వ్యాప్తిని నివారించడానికి ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్ సాయం చేసినప్పుడు మందు తాగడం వల్ల శరీరంలో వైరస్ తప్పకుండా చచ్చిపోతుందని రాజస్థాన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్ సింగ్ కుందన్‌పూర్ కామెంట్ చేశారు. ఈ మేరకు రాష్ట్రంలో వైన్ షాపులను ఓపెన్ చేయాలని భరత్ సింగ్ రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్‌ కు లేఖ రాశారు. మద్యం షాపులు తెరవడం గురించి ఆలోచించాలని, మద్యం ఆధారిత శానిటైజర్లు కరోనావైరస్ వ్యాప్తిని నివారించడంలో సహాయపడినప్పుడు, మద్యం తాగడం వల్ల గొంతులోని వైరస్​ను కూడా చంపేస్తుందని తన వాదనను లేఖలో వినిపించారు. వైరస్ ను చంపేందుకు ఆల్కహాల్ తో చేతులు శుభ్రం చేసుకుంటున్నప్పుడు.. గొంతులో ఉండే వైరస్ ను చంపాలంటే కూడా ఆల్కహాల్ వాడాల్సిందేనన్నారు. దేశవ్యాప్తం లాక్ డౌన్ నేపథ్యంలో మద్యం షాపులు మూతపడి మందు బాబులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని దుకాణాలు తెరవాలని లేఖలో విజ్ఞప్తి చేశారు.
వైన్ షాపుల మూసివేతతో అక్రమ మద్యం తయారీ పెరుగుతోందని, అది సేవించి జనాలు మృత్యువాత పడుతున్నారని పేర్కొన్నారు. వైన్ షాపుల బంద్​తో రాష్ట్ర ప్రభుత్వానికి భారీగా నష్టాలకు దారితీస్తోందన్నారు. భరత్‌పూర్‌లోని హలేనా ప్రాంతంలో కల్తీ మందు తాగి గురువారం ఇద్దరు చనిపోయారని గుర్తుచేశారు.