ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మరో వ్యక్తి అరెస్ట్ 

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మరో వ్యక్తి అరెస్ట్ 

ఢిల్లీ : ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో వ్యక్తి అరెస్ట్ అయ్యారు. వరుసగా రెండు రోజుల్లో ముగ్గురు అరెస్ట్ అయ్యారు. చారియట్ మీడియాకు చెందిన రాజేష్ జోషిని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు అరెస్ట్ చేశారు. సౌత్ గ్రూపునకు రూ.31 కోట్ల నగదును బదిలీ చేయడంలో రాజేష్ జోషి కీలకంగా వ్యవహరించినట్లు గుర్తించారు. గోవా ఎన్నికల్లో ఆప్ పార్టీ ఈ డబ్బును ఖర్చు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. రాజేష్ జోషిని సీబీఐ అధికారులు కాసేపట్లో రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరు పర్చనున్నారు.

ఢిల్లీకి చెందిన రాజేష్ జోషి నగదు బదిలీ చేయడంలో కీలకంగా వ్యవహరించారని ఈడీ అధికారులు గుర్తించారు. హైదరాబాద్ నుంచి నగదును ఢిల్లీకి తరలించారని గుర్తించారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఇప్పటి వరకు సీబీఐ, ఈడీ అధికారులు తొమ్మిది మందిని అరెస్టు చేశారు. 

హైదరాబాద్ కు చెందిన కొందరు వ్యాపారవేత్తలు ఒబెరాయ్ హోటల్ లో ఎంత మొత్తానికి మంతనాలు చేశారు..? ఆ డబ్బును పంజాబ్, గోవాలో ఖర్చు పెట్టినట్లు వస్తున్న వార్తల్లో నిజమేంత..? ఈ కేసులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కు చెందిన కొంతమంది రాజకీయ నాయకులకు సంబంధాలు ఏంటి..? అనే కీలక అంశాలపై ఈడీ, సీబీఐ అధికారులు విచారణను మరింత వేగవంతం చేశారు. 

ఈ కేసులో ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాలకు చెందిన ముగ్గురు అరెస్ట్ అయ్యారు. వారిలో శరత్ చంద్రారెడ్డి, అభిషేక్ బోయినపల్లి, ఎమ్మెల్సీ కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు ఉన్నారు. తాజాగా చారియట్ మీడియా అధినేత రాజేష్ జోషిని కూడా ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ముడుపులుగా అందిన డబ్బులను గోవా ఎన్నికలకు ఆప్ పార్టీ ఉపయోగించిందని ఇప్పటికే ఈడీ అభియోగాలు మోపిన విషయం తెలిసిందే. చారియట్ మీడియా సంస్థ ద్వారా పెద్ద ఎత్తున డబ్బును గోవా ఎన్నికల్లో ఆప్ తరఫున రాజేష్ జోషి ఖర్చు పెట్టారని ఈడీ వర్గాల ద్వారా తెలుస్తోంది.