యూట్యూబ్‌‌‌‌ సెన్సేషన్‌‌‌‌గా మారిన రాజేష్ కుమార్

యూట్యూబ్‌‌‌‌ సెన్సేషన్‌‌‌‌గా మారిన రాజేష్ కుమార్

ఎవరైనా ఒక కొత్త విషయం చెప్తుంటే.. శ్రద్ధగా వింటుంటాం. ఎందుకంటే.. కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్‌‌‌‌ ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. అందుకే అలాంటి కొత్త విషయాలను తెలుసుకుని, వాటిపై రీసెర్చ్‌‌‌‌ చేసి మరీ ఎక్స్‌‌‌‌ప్లెయిన్‌‌‌‌ చేస్తూ వీడియోలు చేస్తుంటాడు రాజేష్‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌. అందుకే ఆ వీడియోలను చూసేందుకు లక్షలమంది ఎదురుచూస్తుంటారు. దాంతో ఆ వీడియోలు చూసేవాళ్లకు నాలెడ్జ్‌‌‌‌.. చేసిన రాజేష్‌‌‌‌కి డబ్బులు వస్తున్నాయి. 

మన దేశంలోని సైన్స్ ఫిక్షన్ వీడియోలు చేసే టాప్‌‌‌‌ యూట్యూబర్లలో రాజేష్ కుమార్ ఒకడు. అంతేకాదు అతను ‘ఫ్యాక్ట్‌‌‌‌టెక్జ్‌‌‌‌’ ఛానెల్ పెట్టిన తక్కువ టైంలోనే యూట్యూబ్‌‌‌‌ సెన్సేషన్‌‌‌‌గా మారాడు. సైన్స్, టెక్నాలజీ అంశాలతో పాటు లేటెస్ట్‌‌‌‌ ట్రెండ్స్‌‌‌‌పై ఇన్ఫర్మేటివ్ వీడియోలు చేస్తుంటాడు. ఎడ్యుకేషనల్ వీడియోలు చూడాలనుకునే వాళ్లకు ఇతని ఛానెల్‌‌‌‌ బెస్ట్ ఛాయిస్‌‌‌‌ అని చెప్పొచ్చు. నాలెడ్జ్‌‌‌‌, స్కిల్స్‌‌‌‌ పెంచుకోవాలి అనుకునేవాళ్లు కూడా ఎక్కువగా ఫ్యాక్ట్‌‌‌‌టెక్జ్‌‌‌‌ ఛానెల్‌‌‌‌ని చూస్తుంటారు. 

మధ్యతరగతి కుటుంబం 

రాజేష్ కుమార్‌‌‌‌‌‌‌‌ 2000 ఏప్రిల్1న ఢిల్లీలో ఒక మధ్య తరగతి కుటుంబంలో పుట్టాడు. తండ్రి ప్రభుత్వోద్యోగి. అపార్ట్‌‌‌‌మెంట్​లో అద్దెకు ఉండేవాళ్లు. రాజేష్‌‌‌‌ ఢిల్లీలోనే చదువుకున్నాడు. చదువుకునే రోజుల్లో క్రికెట్‌‌‌‌ అంటే ఇష్టం. బాగా చదివేవాడు కూడా. స్కూల్లో ఉన్నప్పుడే ‘స్వార్డ్ ఆఫ్ ఆనర్’ అందుకున్నాడు. మొదట్లో ఇంజనీర్‌‌‌‌‌‌‌‌ కావాలనుకునేవాడు. కానీ.. యూట్యూబర్ అయ్యాడు. 

అలా వచ్చి... ఇలా ఎదిగాడు

రాజేష్‌‌‌‌కు చిన్నప్పటి నుంచి సైన్స్, టెక్నాలజీ అంటే బాగా ఇష్టం. వాటితోపాటు పారానార్మల్ అంశాల గురించి తెలుసుకోవడంపై ఆసక్తి చూపించేవాడు. దాంతో చిన్న వయసులోనే రీసెర్చ్‌‌‌‌ చేసి చాలా విషయాలు తెలుసుకున్నాడు. ఆ విషయాలను అందరితో పంచుకోవాలి అనుకున్నాడు. పదహారేండ్ల వయసులో జులై 24, 2016న యూట్యూబ్‌‌‌‌ ఛానెల్‌‌‌‌ మొదలు పెట్టాడు. అదే సంవత్సరం సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌లో మొదటి వీడియో అప్‌‌‌‌లోడ్ చేశాడు. ఆ వీడియోలో భూమి గురించి  ఐదు ఫ్యాక్ట్స్‌‌‌‌ చెప్పాడు. మొదట్లో ఎవరూ పెద్దగా చూడలేదు. కానీ.. కొన్నాళ్లకు చాలామంది ఆ వీడియో చూశారు. దాంతో వరుసగా సైన్స్, ఇన్ఫర్మేటివ్‌‌‌‌ వీడియోలు చేయడం మొదలుపెట్టాడు. తనకు తెలిసిన ప్రతి విషయాన్ని వీడియోల్లో చెప్పేవాడు. అంతే ఒక్కసారిగా పాపులర్‌‌‌‌‌‌‌‌ అయ్యాడు. ఛానెల్‌‌‌‌ పెట్టిన ఏడాదిలోపే పది లక్షల మంది  సబ్‌‌‌‌స్క్రయిబ్ చేసుకున్నారు. రెండేండ్ల11 నెలల 23 రోజుల్లో ఆ సంఖ్య కోటికి చేరింది. ప్రస్తుతం1.75 కోట్ల సబ్‌‌‌‌స్క్రయిబర్స్ ఉన్నారు. ఛానెల్‌‌‌‌ పెట్టిన 365 రోజుల్లో పది లక్షల మంది సబ్‌‌‌‌స్క్రయిబ్‌‌‌‌ చేసుకున్న మొదటి ఇండియన్ ఛానెల్‌‌‌‌ కూడా ఇదే. 

ఫేస్‌‌‌‌ రివీల్​

తక్కువ టైంలో క్రేజ్‌‌‌‌ తెచ్చుకున్నా అతని ఫేస్‌‌‌‌ మాత్రం చూపించేవాడు కాదు. కొన్ని లక్షల మంది అతన్ని అభిమానిస్తున్నా తను మాత్రం ముఖం చూపించలేదు. ఫేస్ రివీల్‌‌‌‌ చేయాలని రిక్వెస్ట్‌‌‌‌లు రావడంతో ‘‘కోటిమంది సబ్‌‌‌‌స్క్రయిబర్లు వచ్చాక రివీల్‌‌‌‌ చేస్తాన’’ని ప్రామిస్‌‌‌‌ చేశాడు. అన్నట్టుగానే ఆ మార్క్ రీచ్ కాగానే స్క్రీన్‌‌‌‌ ముందుకు వచ్చాడు. 

ఆదాయం 

రాజేష్‌‌‌‌ సంవత్సరానికి సుమారు యాభై లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు. ఆ ఆదాయం యూట్యూబ్‌‌‌‌ యాడ్స్‌‌‌‌, స్పాన్సర్‌‌‌‌‌‌‌‌షిప్స్‌‌‌‌, బ్రాండ్స్‌‌‌‌ ప్రమోషన్స్‌‌‌‌ ద్వారా వస్తోంది. ప్రస్తుతం ఆస్తి దాదాపు ఎనిమిదిన్నర కోట్లు ఉంటుందని అంచనా. రాజేష్‌‌‌‌ యూట్యూబ్‌‌‌‌తో పాటు బిజినెస్‌‌‌‌ కూడా చేస్తున్నాడు.