వెలుగు ఓపెన్ పేజీ.. రాజీవ్ పాలన స్ఫూర్తిదాయకం

వెలుగు ఓపెన్ పేజీ.. రాజీవ్ పాలన స్ఫూర్తిదాయకం

దేశ పౌరుల్లో  భరోసా నింపేలా  యువత  భవిష్యత్తును  దృష్టిలో పెట్టుకొని  సంస్కరణలు చేపట్టిన మాజీ  ప్రధానమంత్రి  రాజీవ్ గాంధీ  ప్రజలలో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నారు.  భారతదేశాన్ని ఆధునిక యుగంలో  ప్రపంచ దేశాలతో పోటీపడే స్థాయికి తీసుకెళ్లాలనే ఆలోచనలతో   రాజీవ్ గాంధీ  భారత రాజకీయ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు.  సాంకేతికత,  గ్రామీణాభివృద్ధి, విద్య,  ఆర్థిక సంస్కరణలు, ఆధునిక పరిపాలన వంటి అనేక రంగాల్లో ఆయన చూపిన విజన్  నేటికీ దేశ ప్రగతికి మార్గదర్శకంగా  నిలుస్తోంది. 

మే 21న ఆయన వర్ధంతి సందర్భంగా వారందించిన సేవలను స్మరించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది.  నాడు చేపట్టిన  సంస్కరణలు ప్రస్తుత కాలమాన పరిస్థితులకు స్ఫూర్తిదాయ‌కంగా,  మార్గదర్శకాలుగా నిలుస్తున్నాయి.  కేవలం ఐదేళ్ల పాలనలోనే దీర్ఘకాల దృష్టితో  భారత భవిష్యత్తు కోసం రాజీవ్ గాంధీ  తీసుకున్న నిర్ణయాలు నేడు దేశ అభివృద్ధికి బలమైన పునాదులుగా నిలిచాయి.

1984లో  కేవలం 40 ఏళ్ల వయసులో దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రాజీవ్ గాంధీ సంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా ఆధునిక ఆలోచనలతో దేశాన్ని ముందుకు నడిపించారు. రాజీవ్ గాంధీ  నాయకత్వంలో  కాంగ్రెస్ పార్టీ 1984 లోక్‌సభ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 414 స్థానాలు గెలుచుకుని చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. ఆ భారీ ప్రజాభిమానాన్ని అధికార ప్రదర్శనకు కాకుండా దేశ నిర్మాణానికి వినియోగించారు.

 ‘భారత్‌ను 21వ శతాబ్దిలోకి తీసుకెళ్లాలి’ అన్న ఆయన నినాదం అప్పట్లో ఒక కలలా కనిపించినా,  నేడు అది వాస్తవంగా మారింది.  దేశంలో ఐటీ, టెలికాం రంగాలకు బలమైన పునాదులు వేసిన నాయకుడిగా  రాజీవ్ గాంధీకి  ప్రత్యేక గుర్తింపు ఉంది. భవిష్యత్  ప్రపంచం సాంకేతికత చుట్టూనే  తిరుగుతుందని ఆయన ముందుగానే అర్థం చేసుకున్నారు. నేడు  ప్రతి ఇంటిలో కంప్యూటర్లు, సెల్‌ఫోన్లు, ఇంటర్నెట్,  ఏఐ  వినియోగం సాధారణమైపోవడానికి ఆయన చూపిన దూరదృష్టి ప్రధాన కారణంగా చెప్పవచ్చు.

టెలిఫోన్ విప్లవానికి శ్రీకారం

రాజీవ్ గాంధీ 1984లో  టెలికాం రంగాన్ని బలోపేతం చేస్తూ  సీ-డాట్ వ్యవస్థను  పటిష్టపరిచి  దేశంలో  టెలిఫోన్  విప్లవానికి శ్రీకారం చుట్టారు.  ఎస్టీడీ బూత్‌లు, పీసీవో  కేంద్రాలు సామాన్య  ప్రజలకు  కమ్యూనికేషన్‌ను చేరువ చేశాయి.  ఇన్ఫోసిస్,  విప్రో,  టీసీఎస్ వంటి  సంస్థలకు  రాజీవ్ గాంధీ  ప్రభుత్వం ప్రోత్సాహం అందించడంతో భారత ఐటీ రంగం ప్రపంచ స్థాయికి ఎదిగింది.  ఇండియన్  స్పేస్  రీసెర్చ్  ఆర్గనైజేషన్,  డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్  వంటి  సంస్థలను  బలోపేతం చేయడం ద్వారా దేశ సాంకేతిక స్వావలంబనకు పునాదులు వేశారు.  

యువతకు నాణ్యమైన విద్య అందించాలని రాజీవ్ గాంధీ  ప్రత్యేకంగా  కృషి చేశారు. 1985లో  ఇందిరాగాంధీ  నేషనల్ ఓపెన్  యూనివర్సిటీ స్థాపనతో  ఉన్నత విద్యను  సామాన్య  ప్రజలకు  చేరువ చేశారు. అదే స్ఫూర్తితో  దేశవ్యాప్తంగా అనేక ఓపెన్ యూనివర్సిటీలు ఏర్పడ్డాయి.  గ్రామీణ ప్రాంతాల ప్రతిభావంతులైన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో 1986లో జవహర్  నవోదయ  విద్యాలయాలను ప్రారంభించారు.  నేడు దేశవ్యాప్తంగా వేలాది మంది పేద, మధ్యతరగతి విద్యార్థులు ఆ విద్యాసంస్థల ద్వారా ఉన్నత స్థానాలకు చేరుకోవడం ఆయన విద్యా దూరదృష్టికి నిదర్శనం.

యువతకు రాజకీయ హక్కులు

యువత  రాజకీయాల్లో  భాగస్వామ్యం  పెరగాలనే ఉద్దేశంతో  రాజీవ్ గాంధీ చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. 61వ  రాజ్యాంగ సవరణ ద్వారా ఓటుహక్కు వయస్సును 21 నుంచి 18 సంవత్సరాలకు తగ్గించి దేశ యువతకు రాజకీయ  హక్కులను  విస్తరించారు.  యువ నాయకత్వాన్ని  ప్రోత్సహిస్తూ 1991 ఎన్నికల్లో  పెద్దసంఖ్యలో యువతకు అవకాశాలు  కల్పించారు.  ఎన్నికల వ్యవస్థలో  పారదర్శకత కోసం 52వ  రాజ్యాంగ సవరణ ద్వారా పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టాన్ని  బలోపేతం చేశారు.  

ప్రస్తుతం  మోదీ సారథ్యంలోని  కేంద్రం  ఎన్నికల సంఘంపై  అధికార ఒత్తిడి తెస్తూ  ప్రతిపక్షాలే లక్ష్యంగా నియమ నిబంధనలకు  తిలోదకాలిస్తూ  ఓట్ చోరీకి  పాల్పడుతూ  ఎన్నికలను  భ్రష్టుపట్టిస్తోంది.  ఎన్నికల వ్యవస్థలో సంస్కరణల కోసం  రాజీవ్ గాంధీ  పారదర్శకంగా చేపట్టిన బాటలో  నేటి  కేంద్ర ప్రభుత్వం నడిస్తే ఎలాంటి ఇబ్బందులుండవు.  మహాత్మా గాంధీ  కలల  గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేయాలనే లక్ష్యంతో రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి  కృషి చేశారు. 

అధికార  వికేంద్రీకరణ  ద్వారానే  గ్రామాల అభివృద్ధి సాధ్యమని నమ్మిన ఆయన,  స్థానిక సంస్థలకు అధిక అధికారాలు కల్పించే దిశగా  కీలకచర్యలు చేపట్టారు.  ఆ తరువాత  తెలంగాణ బిడ్డ పి.వి.నరసింహారావు  నేతృత్వంలో  కాంగ్రెస్ ప్రభుత్వం 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీలకు  రాజ్యాంగ హోదా కల్పించింది. 

మహిళా రిజర్వేషన్లకు పునాది

మహిళలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అమలులోకి రావడానికి  కాంగ్రెస్  ప్రభుత్వాలే పునాదులు వేశాయి.  అదే బాటలో  గ్రామీణాభివృద్ధి కోసం మన్మోహన్ సింగ్ చారిత్రాత్మకమైన ఉపాధి హామీ పథకం ప్రవేశపెడితే  నేడు మోదీ ప్రభుత్వం  ప్రజాద‌ర‌ణ పొందిన ఆ పథకాన్ని  రాజ‌కీయ దురుద్దేశంతో  నీరుగార్చడం  దురదృష్టకరం. ఆర్థికరంగంలోనూ రాజీవ్ గాంధీ సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. లైసెన్స్ రాజ్ విధానాన్ని క్రమంగా సరళతరం చేసి విదేశీ పెట్టుబడులకు మార్గం సుగమం చేశారు.  

విదేశాంగ విధానంలో అమెరికా, సోవియట్ యూనియన్ దేశాలతో సమతుల్య  సంబంధాలు కొనసాగించడమే  కాకుండా 1985లో  సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్  రీజినల్  కోఆపరేషన్ స్థాపనలో రాజీవ్ గాంధీ  కీలక పాత్ర పోషించారు. దీనికి భిన్నంగా నేడు నరేంద్ర మోదీ ప్రభుత్వం విదేశాంగ విధానంలో పూర్తిగా వైఫల్యం చెందింది. 

‘ఉగ్రవాద వ్యతిరేక దినం’

అమెరికా అధ్యక్షుడు  ట్రంప్ ఒత్తిడికి లొంగి దేశ ప్రయోజనాలను పణంగా పెడుతున్నారు.  శాంతి, స్వేచ్ఛ, సమానత్వం ద్వారానే మానవ అభివృద్ధి సాధ్యమని  విశ్వసించిన రాజీవ్ గాంధీ ప్రపంచ శాంతి కోసం అణు నిరాయుధీకరణ అవసరాన్ని 1988లో ఐక్యరాజ్య సమితి వేదికగా బలంగా వినిపించి అంతర్జాతీయంగా  దేశ ప్రతిష్టతను  పెంచారు.  దార్శనిక నాయకుడు 1991 మే 21న తమిళనాడులోని  శ్రీపెరంబదూరులో ఎన్నికల ప్రచార సభలో ఎల్టీటీఈ ఆత్మాహుతి దాడిలో మరణించడం దేశానికి తీరని లోటు. 

ఈ ఘటనకు ముందు ఆయన ఆంధ్రప్రదేశ్‌లోని  విశాఖపట్నంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార సమావేశంలో పాల్గొని  కాంగ్రెస్ సిద్ధాంతాలైన  దేశ ఐక్యత,  యువత భవిష్యత్,  అభివృద్ధి  రాజకీయాలపై  ప్రసంగించారు.  అక్కడి  కార్యక్రమం  పూర్తయ్యాక  ప్రత్యేక విమానంలో చెన్నైకి చేరుకుని, అనంతరం శ్రీపెరంబదూర్ ఎన్నికల సభకు వెళ్లిన సమయంలో ఆత్మాహుతి దాడి జరిగిందనే విషాదకర వార్తతో దేశ ప్రజలు షాక్‌కు గురయ్యారు.  ఆయన హత్య జరిగిన రోజును దేశం ‘ఉగ్రవాద వ్యతిరేక దినం’గా పాటిస్తోంది. 

భారత రత్న రాజీవ్​గాంధీ

రాజీవ్ గాంధీ  మరణానంతరం ఆయనకు  భారత అత్యున్నత  పురస్కారం భారత రత్న ప్రకటించడం ఆయన సేవలకు దేశం ఇచ్చిన  గొప్ప గౌరవం.   దేశాన్ని  ఆధునిక  భారత్‌గా  తీర్చిదిద్దాలనే లక్ష్యంతో  రాజకీయాల్లోకి  వచ్చిన రాజీవ్ గాంధీ  స్వల్పకాలంలోనే  భారత  భవిష్యత్తును  మలిచిన  నాయకుడిగా చరిత్రలో  నిలిచిపోయారు.  నేడు  భారత్  ఐటీ,  అంతరిక్షం,  టెలికాం, విద్య,  యువశక్తి రంగాల్లో  ప్రపంచంతో  పోటీ పడుతోందంటే దానికి మూల కారణం  రాజీవ్ గాంధీ  దూరదృష్టితో  ఎంతో  సాహసంతో చేపట్టిన చర్యలే.  

నాడు  రాజీవ్ గాంధీ  చేపట్టిన  చర్యలను  ప్రస్తుత నరేంద్ర మోదీ  ప్రభుత్వం స్ఫూర్తిగా  తీసుకుంటే  దేశ భవిష్యత్తుకు మార్గదర్శకంగా నిలుస్తాయి. ఆయన చేపట్టిన  సంస్కరణలు నేటికీ ఆచరణీయమే.  రాజీవ్​ పాలన నేటికీ స్ఫూర్తిదాయకమే.  రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకోవడమే కాకుండా, ఆధునిక భారత నిర్మాణంలో ఆయన చూపిన మార్గాన్ని కొనసాగించాలి.

- బి.మహేశ్ కుమార్ గౌడ్,ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షుడు

ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ

openpage@v6velugu.com

రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని 

హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.

రచన 700 పదాలకు మించరాదు.