అత్యాధునిక యుద్ధనౌకను నేవీకి అందజేసిన రక్షణ మంత్రి

అత్యాధునిక యుద్ధనౌకను నేవీకి అందజేసిన రక్షణ మంత్రి

రాడార్లకు దొరక్కుండా శత్రు విమానాలను ధ్వంసం చేస్తది..

ముంబై: ఇండియన్ నేవీ చేతికి మరో అత్యాధునిక యుద్ధనౌక అందింది. శత్రు దేశాల రాడార్ లకు చిక్కకుండా ప్రయాణిస్తూ గైడెడ్ మిసైల్స్ తో యుద్ధ విమానాలను ధ్వంసం చేయగల స్టెల్త్ వార్ షిప్ ‘ఐఎన్ఎస్ మోర్ముగావ్’ నేవీ అమ్ములపొదికి చేరింది. ఆదివారం ముంబైలోని నావల్ డాక్ యార్డులో జరిగిన కార్యక్రమంలో ఐఎన్ఎస్ మోర్ముగావ్ ను రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నేవీకి అందజేశారు. కార్యక్రమంలో గోవా గవర్నర్ పీఎస్ శ్రీధరన్ పిళ్లై, గోవా సీఎం ప్రమోద్ సావంత్, నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్. హరికుమార్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ.. మనదేశం సొంతంగా తయారు చేసుకున్న యుద్ధనౌకల్లో మోస్ట్ పవర్ ఫుల్ అయిన మోర్ముగావ్ తో మన సముద్ర ప్రాంత భద్రత మరింత పటిష్టం అవుతుందన్నారు. యుద్ధనౌకల డిజైన్, నిర్మాణంలో ఇండియా సత్తాకు ఈ యుద్ధనౌకే ఒక నిదర్శనమన్నారు. దీని నిర్మాణంలో 75 శాతం స్వదేశీ కంటెంట్​నే వినియోగించినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో ఇతర దేశాలకు కూడా యుద్ధ నౌకలను తయారుచేసే స్థాయికి ఎదుగుతామని ధీమా వ్యక్తం చేశారు. 

‘మోర్ముగావ్’ విశేషాలు ఇవే.. 

  • ప్రాజెక్ట్ 15బీ కింద ఇండియన్ నేవీకి 4 విశాఖపట్నం క్లాస్ యుద్ధనౌకలు అందనున్నాయి. వీటిలో ఐఎన్ఎస్ మోర్ముగావ్ రెండోది. 
  • దీనిని నేవీకి చెందిన వార్ షిప్ డిజైన్ బ్యూరో డిజైన్ చేయగా.. ముంబైలోని మాజగావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ నిర్మాణం పూర్తి చేసింది. 
  • ఐఎన్ఎస్ మోర్ముగావ్ పొడవు 163 మీటర్లు. వెడల్పు 17 మీటర్లు. బరువు 7,400 టన్నులు ఉంటుంది. గరిష్టంగా 30 నాట్స్ (గంటకు 55 కిలోమీటర్లు) స్పీడ్ తో ప్రయాణించగలదు. 
  • శత్రు దేశాల రాడార్​లు, సోనార్​లకు చిక్కకుండా ఇది స్టెల్త్ టెక్నాలజీతో తయారైంది. గైడెడ్ మిసైల్స్​తో శత్రు దేశాల ఎయిర్ క్రాఫ్ట్​లను పేల్చేసే సత్తా దీని సొంతం.
  • ఈ యుద్ధనౌకపై ఉండే అత్యాధునిక సెన్సర్లు, మోడ్రన్ సర్వీలెన్స్ రాడార్ టార్గెట్​కు సంబంధించిన డేటాను కచ్చితత్వంతో వెపన్ సిస్టమ్స్ కు అందజేస్తాయి. ఈ డేటాతో గురి తప్పకుండా టార్గెట్లను ధ్వంసం చేసే చాన్స్ ఉంటుంది. 
  • గోవాలోని పోర్ట్ సిటీ మోర్ముగావ్ పేరిట దీనికి పేరు పెట్టారు. పోర్చుగీస్ పాలన నుంచి గోవా కు విముక్తి లభించి నిరుడు డిసెంబర్ 19 నాటికి 60 ఏండ్లు అయిన సందర్భంగా ఈ నౌకను మొదటి సారి జలప్రవేశం చేయించారు.