శత్రువులపై బ్రహ్మాస్త్రం.. యూపీలో బ్రహ్మోస్ యూనిట్ ప్రారంభం..

శత్రువులపై బ్రహ్మాస్త్రం.. యూపీలో బ్రహ్మోస్ యూనిట్ ప్రారంభం..
  • యూపీలో బ్రహ్మోస్ మిసైల్​ ప్రొడక్షన్​ యూనిట్​ ప్రారంభించిన రాజ్​నాథ్​ సింగ్​
  • రావల్పిండిలోనూ మన సైన్యం​ గర్జించింది
  • పహల్గాం దాడికి ప్రతీకారం తీర్చుకున్నం
  • ఉగ్రవాదంపై పోరులో మన సత్తా చాటాం
  • ఇది నయా భారత్.. టెర్రరిజాన్ని సహించదు
  • ‘ఆపరేషన్​ సిందూర్’​ దేశ సంకల్ప శక్తికి చిహ్నమని వెల్లడి

న్యూఢిల్లీ: ఇండియా వద్ద ఉన్న ఆయుధాల్లో లాంగ్ రేంజ్ బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ ఒకటి. మన డీఆర్​డీవో, రష్యాకు చెందిన ఎన్​పీవో మషినోస్ట్రోయేనియా కలిసి దీన్ని డెవలప్ చేశాయి. దీని కోసం బ్రహ్మోస్ ఏరోస్పేస్ లిమిటెడ్ అనే సంస్థను రెండు దేశాలు సంయుక్తంగా స్థాపించాయి. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన, హైఅక్యూరెన్సీ క్రూయిజ్ మిసైల్ ఇది. ఇండియాలోని బ్రహ్మపుత్ర నది, రష్యాలోని మాస్కవా నదుల పేర్లను కలిపి మిసైల్​కు ‘బ్రహ్మోస్’ అని పేరు పెట్టారు. ఈ క్షిపణిని రష్యాకు చెందిన పీ800 -ఒనిక్స్ క్రూయిజ్ ఆధారంగా తయారు చేశారు.

టెక్నాలజీలో నంబర్ వన్

బ్రహ్మోస్ మిసైల్ ధ్వని వేగం కంటే 3 రెట్లు స్పీడ్‌‌తో ప్రయాణిస్తుంది. ఇది సాధారణ సబ్‌‌‌‌‌‌‌‌సోనిక్ క్షిపణుల కంటే 3 రెట్లు, ఫ్లైట్ రేంజ్ కంటే 2.5 నుంచి 3 రెట్లు, సీకర్ రేంజ్ కంటే 3 నుంచి 4 రెట్లు, కైనెటిక్ ఎనర్జీ కంటే 9 రెట్లు వేగవంతమైంది. దీని రేంజ్ 450 కిలో మీటర్లకు పైగా ఉంది. కొన్ని వెర్షన్​లలో 800 కిలో మీటర్ల వరకు టెస్ట్​లు చేశారు. ప్రస్తుతం 500 కిలో మీటర్ల పరిధి గల వెర్షన్ అభివృద్ధి దశలో ఉన్నది. బ్రహ్మోస్‌‌‌‌‌‌‌‌ను ‘ఆధునిక బ్రహ్మాస్త్రం’గా పిలుస్తారు. 

పేలోడ్, మిసైల్ బరువు

.బ్రహ్మోస్ మిసైల్ బరువు సుమారు 2,500 కిలోలు (గాలి నుంచి ప్రయోగించే వెర్షన్‌‌‌‌‌‌‌‌లో 2,000 కిలోలు). దీని వార్ హెడ్ 200 నుంచి 300 కిలోల బరువున్న సంప్రదాయ (కన్వెన్షనల్) లేదా పేలుడు వార్‌‌‌‌‌‌‌‌హెడ్‌‌‌‌‌‌‌‌ను మోసుకెళ్లగలదు. ర్యామ్‌‌‌‌‌‌‌‌జెట్ ఇంజన్‌‌‌‌‌‌‌‌తో పనిచేస్తుంది. 2001లో మొదటిసారి దీన్ని పరీక్షించారు. నేవీలో 8 యుద్ధ నౌకలపై వీటిని ఏర్పాటు చేశారు. ఎయిర్​ఫోర్స్​లో సుఖోయ్ 30 ఎంకేఐ విమానాల ద్వారా ఉపయోగిస్తున్నారు. ఆర్మీ వద్ద భూ ఆధారిత వెర్షన్​ను యూజ్ చేస్తున్నారు. 

ఎక్కడి నుంచి ప్రయోగించొచ్చు?

బ్రహ్మోస్ క్షిపణిని నేలపై ట్రాన్స్‌‌‌‌‌‌‌‌పోర్టర్ ఎరెక్టర్ లాంచర్ ద్వారా, సముద్రంలో యుద్ధ నౌకల పైనుంచి, గాల్లో యుద్ధ విమానాల నుంచి ప్రయోగించొచ్చు. ఇది సూపర్‌‌‌‌‌‌‌‌ సోనిక్ వేగంతో ప్రయాణిస్తూ ఒక్కసారిగా తన దిశను మార్చుకోగలదు. నిట్టనిలువుగా కూడా టార్గెట్​పై దాడి చేయగలదు. టార్గెట్​ గుంపులో ఉన్నప్పటికీ దాడి చేయగలదు. ఇది ప్రపంచంలో ఏ మిసైల్​కు లేని ప్రత్యేక సామర్థ్యం. షిప్​లు, భూమిపై ఉన్న టార్గెట్లు, విమాన వాహక నౌకలపై దాడి చేయగల మల్టీపర్పస్ మిసైల్.