కాలం చెల్లిన చట్టాల రద్దుకు పార్లమెంటు ఓకే

కాలం చెల్లిన చట్టాల రద్దుకు పార్లమెంటు ఓకే

న్యూఢిల్లీ: కాలం చెల్లిన, వాడుకలో లేని 76 అనవసరమైన చట్టాలను రద్దు చేసే బిల్లును పార్లమెంటు బుధవారం ఆమోదించింది. రద్దు, సవరణ బిల్లు 2023 రాజ్యసభలో మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. ఈ ఏడాది జులై 27న లోక్‌సభ ఈ బిల్లును ఆమోదించింది. గత ఏడాది డిసెంబర్‌లో 65 పాత చట్టాలను రద్దు చేసేందుకు ప్రభుత్వం రద్దు, సవరణ బిల్లును ప్రవేశపెట్టింది. అయితే తదుపరి సమావేశాల్లో ఈ బిల్లు చర్చకు రాలేదు. ఆ తర్వాత ప్రభుత్వం మరో 11 చట్టాలను ఈ జాబితాలో చేర్చింది.

భూసేకరణ (గనులు) చట్టం, 1885.. టెలిగ్రాఫ్ వైర్ల (చట్టవిరుద్ధమైన స్వాధీనం) చట్టం, 1950 వంటి కాలం చెల్లిన చట్టాలను రద్దు చేయాలని ఈ బిల్లులో ప్రతిపాదించారు. ఇటీవలి కాలంలో పార్లమెంటు ఆమోదించిన కొన్ని విభజన చట్టాలను కూడా రద్దు చేయాలని అందులో పేర్కొన్నారు. ఈ చర్చలో న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సమాధానమిస్తూ, 2014లో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జీవన సౌలభ్యాన్ని మెరుగుపరిచేందుకు 1,486 పనికిరాని చట్టాలను రద్దు చేసిందని చెప్పారు.