ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీఆర్ఎస్దే విజయం : వద్దిరాజు రవిచంద్ర

ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీఆర్ఎస్దే విజయం :  వద్దిరాజు రవిచంద్ర
  • రాజ్యసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్​ వద్దిరాజు రవిచంద్ర
  • ఖమ్మంలో బీఆర్ఎస్​ ఆధ్వర్యంలో ర్యాలీ 

ఖమ్మం, వెలుగు:  రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని, అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా బీఆర్ఎస్ 100 సీట్లలో ఘన విజయం సాధించడం ఖాయమని రాజ్యసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ధీమా వ్యక్తం చేశారు. బుధవారం ఖమ్మంలోని తెలంగాణ భవన్‌‌లో జరిగిన సర్పంచ్‌‌ల ఆత్మీయ సమ్మేళనంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు పువ్వాడ అజయ్, నామ నాగేశ్వరరావులతో కలిసి ఆయన పాల్గొన్నారు.  

అంతుకుముందు ఖమ్మం బైపాస్​ రోడ్ రోడ్​ లోని రాపర్తినగర్​ నుంచి బీఆర్ఎస్​ పార్టీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర మాట్లాడుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సహా 420 వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, అభివృద్ధిని విస్మరించి చిల్లర రాజకీయాలకు పాల్పడుతోందని మండిపడ్డారు. జిల్లా మంత్రులు కేవలం శంకుస్థాపనలకే పరిమితమయ్యారని, బీఆర్ఎస్ కార్పొరేటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారని విమర్శించారు.

మాజీ మంత్రి పువ్వాడ అజయ్ మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో కృష్ణా, గోదావరి జలాల్లో ఏపీ దోపిడీ మొదలైందని, సీతారామ ప్రాజెక్టు పనులు అంగుళం కూడా ముందుకు పడలేదని ఆరోపించారు. మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు మాట్లాడుతూ నేతలపై అక్రమ కేసులు పెడుతున్న మంత్రులను వదిలిపెట్టబోమని, అధికారం ఎవరికీ శాశ్వతం కాదని హెచ్చరించారు. ఈ సమ్మేళనానికి ముందు భారీ ర్యాలీ నిర్వహించగా, మాజీ ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, సండ్ర వెంకట వీరయ్య, కందాళ ఉపేందర్ రెడ్డి తదితర ముఖ్య నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.