పాజిటివిటీకి చిరునామా రాకేశ్ ఝున్‌ ఝున్‌వాలా

పాజిటివిటీకి చిరునామా రాకేశ్ ఝున్‌ ఝున్‌వాలా

స్టాక్ మార్కెట్ దిగ్గజం రాకేశ్  ఝున్‌ ఝున్‌వాలా లో సీరియస్ వ్యాపారవేత్త మాత్రమే కాదు.. సానుకూల ఆలోచనా దృక్పథాన్ని కలిగిన మహోన్నత వ్యక్తి కూడా ఉన్నాడు. రెండు కిడ్నీలు చెడిపోయి డయాలసిస్ పై ఉన్న సమయంలోనూ..  ఆయన జీవితంపై పాజిటివ్ ఆటిట్యూడ్ తోనే వ్యవహరించారు. ఇందుకు నిదర్శనంగా నిలిచే ఒక వీడియోను కాంగ్రెస్ నేత సంజయ్ నిరుపమ్ ఇవాళ ట్విటర్ లో పోస్ట్ చేశారు. అందులో రాకేశ్  ఝున్‌ ఝున్‌వాలా ఉత్సాహంగా డ్యాన్స్ వేయడాన్ని చూడొచ్చు. కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులతో సమావేశమైన సందర్భంగా వీల్ చైర్ లోనే కూర్చొని ఆయన అదిరిపోయే డ్యాన్సు చేశారు. వృద్ధాప్యం, ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టినప్పటికీ తనలోని సానుకూల దృక్పథం ఇంకా నవ చైతన్యంతోనే ఉందని రాకేశ్ నిరూపించారు. సంజయ్ నిరుపమ్ ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు పోస్ట్ చేసిన ఈ వీడియోకు కేవలం మూడు గంటల్లోనే 1.50 లక్షల వ్యూస్ వచ్చాయి. కాగా, ఇవాళ ఉదయం 6:45 నిమిషాలకు గుండె పోటుతో  రాకేశ్  ఝున్‌ ఝున్‌వాలా (62) కన్నుమూశారు.  

హైదరాబాద్ నుంచి మొదలైన ప్రస్థానం

రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా 1960 జులై 5న హైదరాబాద్ లోని ఓ మధ్యతరగతి కుటుంబంలో  జన్మించారు. ఆయనకు  చిన్నతనం నుంచే వ్యాపారం అంటే మక్కువ. అందుకే కాలేజీ విద్యార్ధిగా స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించారు.ఓ వైపు సీఏ(చార్టర్డ్ అకౌంటెంట్‌) చదువు కుంటూనే స్టాక్‌ మార్కెట్‌లో మెళుకువలు నేర్చుకున్నారు. అలా 1985లో రూ.5వేల పెట్టుబడితో స్టాక్‌ మార్కెటర్‌గా వ్యాపారాన్ని ప్రారంభించారు.  ఫోర్బ్స్ అంచనా ప్రకారం అతని నికర ఆస్థి విలువ రూ.5.5 బిలియన్లుగా ఉంది. 

ఆకాశ ఎయిర్ ఆయనదే.. 

వ్యాపార వేత్త  అయిన రేఖను ఝున్‌ఝున్‌వాలా వివాహం చేసుకున్నారు. రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా ఈనెల 7న ఆకాశ ఎయిర్‌తో  ఏవియేషన్ రంగంలోకి అడుగుపెట్టారు. ఆయన పెట్టుబడిదారుడిగానే కాదు.. ఆప్టెక్ లిమిటెడ్, హంగామా డిజిటల్ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ఛైర్మన్‌గా ఉన్నారు.

1986లో టాటా టీ షేర్లతో టర్నింగ్ పాయింట్.. 

రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా 1986లో టాటా టీ షేర్‌లను కొనుగోలు చేయడం ద్వారా తాను మొదటి సారి భారీ లాభాలను ఆర్జించారు. అతను టాటా టీ యొక్క 5,000 షేర్లను కేవలం 43 రూపాయలకు కొనుగోలు చేశారు. తరువాత మూడు నెలల్లో ఆ స్టాక్ 143 రూపాయలకు పెరిగింది. అతను మూడు రెట్లు ఎక్కువ లాభం పొందాడు. ఆ తర్వాత మూడేండ్లలో ఝున్‌జున్‌వాలా రూ.20 నుంచి 25 లక్షలు సంపాదించారు. ఆయన్ని అనుభవజ్ఞుడైన పెట్టుబడిదారునిగా బిగ్ బుల్ ఆఫ్ దలాల్ స్ట్రీట్ అని కూడా పిలుస్తారు. ప్రస్తుతం ఆయన ఆస్తి విలువ రూ. 45 వేల కోట్లుగా ఉంది.