కొండా మురళిపై వర్మ బయోపిక్

V6 Velugu Posted on Sep 24, 2021

డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సినిమా అంటేనే అందరిలో ఆసక్తి కలుగుతుంది. గతంలో రాయలసీమ ఫ్యాక్షనిజం బ్యాక్ గ్రౌండ్ లో రక్తచరిత్ర రెండు పార్టులుగా తెరకెక్కించిన వర్మ..లేటెస్ట్ గా తెలంగాణ రక్తచరిత్రను తెరకెక్కించే ప్లాన్‌ చేస్తున్నాడు. కొండా పేరుతో ఓ సినిమాను ఆయన త్వరలో పట్టాలెక్కించబోతున్నట్లు తెలుస్తుంది. కొండా మురళీ–సురేఖ, ఆర్‌కె అలియాస్‌ రామకృష్ణ పాత్రలు కీలకంగా ఆయన ఈ సినిమాను రూపొందించనున్నాడట. త్వరలో ఈ సినిమా షూటింగ్‌ వరంగల్‌ పరిసర ప్రాంతాల్లో ప్రారంభించనున్నట్లు సమాచారం. ఈ మేరకు కొండా సినిమాకి సంబంధించి వర్మ ఓ వాయిస్‌ విడుదల చేశారు. 

‘‘విజయవాడలో చదువుకోవడం వల్ల అక్కడి రౌడీయిజం గురించి తెలుసుకున్నా. రామానాయుడు స్టూడియో దగ్గర జరిగిన బాంబ్‌ బ్లాస్ట్‌ వల్ల రాయలసీమ ఫ్యాక్షనిజం గురించి తెలిసింది. కానీ తెలంగాణ  సాయుధ పోరాటం గురించి నాకు ఏమీ తెలీదు. ఈ మధ్య అనుకోకుండా నేను కలిసిన మాజీ నక్సలైట్లు, అప్పటి పోలీసులతో మాట్లాడటం వల్ల మొదటిసారి ఆ విషయంపై ఓ అవగాహన వచ్చింది. నేను విన్న విషయాల్లో ముఖ్యంగా నన్ను ప్రభావితం చేసినా అంశం.. ఎన్‌కౌంటర్‌లో చంపేయబడ్డ ఆర్‌కె అలియాస్‌ రామకృష్ణకి, కొండా మురళీకి ఉన్న ప్రత్యేక సంబంధం. ఆ బ్యాగ్రౌండ్‌, అప్పటి పరిస్థితులను సినిమాటిక్‌గా క్యాప్చర్‌ చేయడానికి కావలసిన సమచారం ఇవ్వమని మురళీని కోరాను.

ఈ సినిమా తీయడం వెనకున్న నా ఉద్దేశం విని ఆయన అంగీకరించారు. పెత్తందారుల పెత్తనం భరించలేక కొంతమంది బడుగు వర్గాలు తిరగబడి మొత్తం వ్యవస్థతోనే  పోరాడుతున్న రోజులవి. అలా తిరగబడిన వారిపై ఉక్కుపాదాలతో తొక్కిపారేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినా మురళీ, ఆర్‌కె నాయకత్వంలో తిరుగుబాటు జరుగుతూనే ఉండేది. విపరీత పరిస్థితుల నుంచే విపరీత వ్యక్తులు ఉద్భవిస్తారని కారల్‌మార్క్‌ 180 ఏళ్ల క్రితమే చెప్పాడు. అలాంటి విపరీత పరిస్థితుల మధ్య పుట్టినవారే కొండా మురళీ–సురేఖ. ఇప్పుడు నేను తీస్తుంది సినిమా కాదు. నమ్మశక్యం కానీ నిజజీవితాల ఆధారంగా తెలంగాణాలో జరిగిన ఒక రక్త చరిత్ర. 1995లో జరిగిన ఆ చరిత్ర కోరలు ఇప్పటి రాజకీయాలనూ కరుస్తూనే ఉన్నాయి. ఎందుకంటే విప్లవం అనేది ఎప్పటికీ ఆగదు. దాని రూపు మార్చుకుంటుంది అంతే. కొండా సినిమా షూటింగ్‌ పూర్తిగా వరంగల్‌, ఆ పరిసర ప్రాంతాల్లోని అడవుల్లో జరగనుంది. అతి త్వరలో ఈ విప్లవం మొదలుకానుంది’’ అని ఆర్‌జీవీ వాయిస్‌లో తెలిపాడు. 

Tagged biopic, Ram gopal varma, , Konda Murali

Latest Videos

Subscribe Now

More News