RGV: ‘పోలీస్ స్టేషన్ మే బూత్’తో క్రైమ్ థ్రిల్లర్.. ఆర్జీవీ భయపెట్టేస్తున్నాడుగా!

RGV:  ‘పోలీస్ స్టేషన్ మే బూత్’తో క్రైమ్ థ్రిల్లర్.. ఆర్జీవీ భయపెట్టేస్తున్నాడుగా!

నటుడు మనోజ్ బాజ్ పాయ్, సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్ లో మూవీ అంటే చాలు అభిమానులకి ప్రత్యేక అనుభూతి.  వీరిద్దరి కాంబోలో 'సత్య', 'శూల్', 'కౌన్', 'దౌడ్', 'సర్కార్ 3' వంటి ఎన్నో చిత్రాలు వచ్చాయి. ప్రేక్షకులను మెప్పించాయి. ఈ ఇద్దరు దిగ్గజాలు చాలా కాలం తర్వాత  ఇప్పుడు మళ్ళీ కలిసి పనిచేస్తున్నారు. ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ కోసం జతకట్టారు. ‘పోలీస్ స్టేషన్ మే బూత్’ సినిమాతో ప్రేక్షకుల మందుకు వస్తున్నారు. లేటెస్ట్ గా ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ ను ఆర్జీవీ సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. 

కథాంశం.. 
‘యూ కెనాట్ అరెస్ట్ ది డెడ్’ అనే ట్యాగ్‌లైన్‌తో వస్తున్న కొత్త చిత్రం ‘పోలీస్ స్టేషన్ మే బూత్’. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీతో ఈసారి బాక్సీఫీస్ వద్ద  సంచలనం సృష్టించడానికి సిద్ధంగా ఉన్నారు డైరెక్టర్ ఆర్జీవి.  ఈ చిత్రంలో పేరుమోసిన గ్యాంగ్‌స్టర్‌గా మనోజ్ బాజ్ పాయ్ కనిపించనున్నారు. కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్ కథానాయకుడిగా ఉండటం ఒక విశేషమైతే, ఆ పాత్రను ఒక ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ అయిన పోలీసు అధికారి చంపేయడం, ఆ తరువాత ఆ గ్యాంగ్‌స్టర్ దెయ్యంగా మారి పోలీసు స్టేషన్‌ను పట్టిపీడించడం ఈ కథలోని ప్రధానాంశాలు.

పోలీసు అధికారిపై  ప్రతీకారం ఎలా?
ఈ చిత్రంలో ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ పాత్రలో కూడా మనోజ్ బాజ్ పాయ్ కనిపించబోతున్నారని ప్రచారం జరుగుతోంది. అంటే, ఈ సినిమాలో ఆయనది ద్వంద్వ పాత్ర అని తెలుస్తోంది. ఆత్మగా మారిన గ్యాంగ్‌స్టర్ తనను చంపిన పోలీసు అధికారిపై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు, అతన్ని భయపెట్టడానికి ఎలాంటి భయానక కామెడీ సన్నివేశాలను సృష్టించాడు అనేదే సినిమా ప్రధాన కథాంశం. ఈ చిత్రం హారర్-కామెడీ జానర్‌లో రూపొందుతోంది. సినిమా టైటిల్, పోస్టర్ చూస్తేనే ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగిపోయింది.

ALSO READ : ‘చదువు రానోళ్ళు’ టీచర్స్ డే నాడు వస్తోన్నారు..

జెనీలియా డిసౌజా కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించనున్నారు.  జెనీలియా హాస్యభరితమైన పాత్రలకు పెట్టింది పేరు, కాబట్టి ఈ చిత్రంలో ఆమె పాత్ర ప్రేక్షకులను ఎంతగానో నవ్వించగలదని భావిస్తున్నారు. ఈ చిత్రం ‘కార్మా మీడియా ఎంటర్‌టైన్‌మెంట్’ , ‘వావ్ ఎమిరేట్స్’ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

‘పోలీస్ స్టేషన్ మే బూత్’ అనే టైటిల్ సినిమాపై మరింత ఆసక్తి పెంచుతోంది. ఒక దెయ్యం పోలీసు స్టేషన్‌లోకి ప్రవేశించడం, దానివల్ల జరిగే గందరగోళం, భయంతో కూడిన హాస్యం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుందని మేకర్స్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ఇప్పటికే ప్రారంభమైంది. ఈ సినిమాతో వర్మ తన పాత ఫామ్‌ను తిరిగి అందుకుని, హారర్ థ్రిల్లర్ జానర్‌లో మరో విజయాన్ని సాధిస్తారని సినీ విశ్లేషకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సినిమా ఏ స్థాయిలో ప్రేక్షకులను భయపెడుతూ, నవ్విస్తుందో చూడాలి.