కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేయడమే తమ ‘ఆర్జీవీ యువర్ ఫిల్మ్ కాంటెస్ట్’ లక్ష్యమని చెప్పాడు రామ్ గోపాల్ వర్మ. కాంటెస్ట్ వివరాలను తెలియజేసేందుకు శుక్రవారం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ ‘‘శివ’ సినిమా సమయంలో నా గురించి ఎవరికీ తెలియదు. ఆ సినిమా ప్రేక్షకాదరణ పొందింది కాబట్టి రామ్ గోపాల్ వర్మ అంటే ఎవరో అందరికీ తెలిసింది. కానీ ప్రతిభ ఉండి నాలా ఇంకా ప్రపంచానికి తెలియాల్సిన వారు ఎంతోమంది ఉన్నారు.
అలాంటి వారికి అవకాశం ఇచ్చేందుకు ఈ కాంటెస్ట్ నిర్వహిస్తున్నాం. కాంటెస్ట్ అనౌన్స్ చేసిన తర్వాత వివిధ రాష్ట్రాల నుంచి దాదాపు 400 ఎంట్రీలు వచ్చాయి. వీటిలో 11 షార్ట్ ఫిలింస్ లిస్ట్ చేసి ఎంపికచేశాం. షార్ట్ లిస్ట్ అయిన వాటిని సోషల్ మీడియాలో పోల్ పెట్టి బెస్ట్ డైరెక్టర్‌గా ఓటు వేసిన వారికి మా సంస్థలో అవకాశం ఇస్తాం’ అని చెప్పాడు. ఈ కార్యక్రమంలో పోటీకి ఎంపికైన షార్ట్ ఫిలింస్ మేకర్స్, ఆర్జీవీ డెన్ ప్రొడ్యూసర్ రవి పాల్గొన్నారు.