RGV : మరోసారి వివాదంలో రామ్ గోపాల్ వర్మ.. దావూద్ ఇబ్రహీం నాకు గురువు అంటూ ట్వీట్!

 RGV :  మరోసారి వివాదంలో రామ్ గోపాల్ వర్మ.. దావూద్ ఇబ్రహీం నాకు గురువు అంటూ  ట్వీట్!

డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మరోసారి సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. సినిమాల కంటే వివాదలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తి ఆర్టీజీ . ఈసారి ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా చేసిన ఆయన ట్వీట్ సామాజిక మాధ్యమాలలో పెను దుమారం రేపుతోంది. సెప్టెంబర్ 5, గురువారం టీచర్స్ డే సందర్భంగా తనకు స్ఫూర్తినిచ్చిన గురువులను ప్రస్తావిస్తూ వర్మ ఒక ట్వీట్ చేశారు. ఈ జాబితాలో అమితాబ్ బచ్చన్, శ్రీదేవి,  స్టీవెన్ స్పీల్‌బర్గ్ వంటి దిగ్గజాలతో పాటు గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం పేరును చేర్చడం తీవ్ర విమర్శలకు దారితీసింది.

గురువుల జాబితాలో దావూద్!
 "నేను ఎలా మారాలన్నా,  ఎలాంటి సినిమాలు తీయాలన్న నాకు స్పూర్తినిచ్చిన అందరికి,  గొప్ప వ్యక్తులకు ఒక బిగ్ సెల్యూట్. వారిలో అమితాబ్ బచ్చన్, స్టీవెన్ స్పీల్‌బర్గ్, ఐన్ ర్యాండ్, బ్రూస్ లీ, శ్రీదేవి , దావూద్ ఇబ్రహీం ఉన్నారు. హ్యాపీ టీచర్స్ డే." అంటూ తన X ఖాతాలో  రామ్ గోపాల్ వర్మ పోస్ట్ చేశారు.  అంతే కాకుండా  నా జీవితంలో చాలా మంది నాకు చాలా విషయాలు నేర్పించారు, అందులో పోలీసులు, గ్యాంగ్‌స్టర్లు, రాజకీయ నాయకులు, దయ్యాలు , ChatGPT కూడా ఉన్నాయి..  నాకు ఏమీ నేర్పించని వారు నా స్కూల్ , కాలేజీ టీచర్స్  ..  హ్యాపీ టీచర్స్ డే మాత్రమే. అంటూ మరో ట్వీట్ కూడా చేశారు. 

 

నెటిజన్లు షాక్.. 
ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు షాకయ్యారు. ఆర్జీవీపై తీవ్రంగా మండిపడ్డారు. దేశంలో ఉగ్రవాదిగా పేరుపొందిన దావూద్ ఇబ్రహీంను ఒక గురువుగా పేర్కొనడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఉపాధ్యాయ దినోత్సవం రోజున నిజమైన గురువులను గౌరవించే బదులు ఒక నేరస్థుడిని ప్రస్తావించడం అభ్యంతరకరమని చాలామంది అభిప్రాయపడ్డారు.  ఒకవైపు అమితాబ్ బచ్చన్, స్టీవెన్ స్పీల్‌బర్గ్ వంటి దిగ్గజాలు, మరోవైపు దేశంలోనే అత్యంత ప్రమాదకరమైన ఉగ్రవాదిగా పేరొందిన దావూద్ ఇబ్రహీం. ఈ రెండింటికీ పొంతన లేకుండా పోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రత్యేకించి గురువులను గౌరవించే పవిత్రమైన రోజున ఇలాంటి నేరస్థుడిని ప్రస్తావించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

►ALSO READ | Onam Celebrations: ఓనం వేడుకల్లో తారల మెరుపులు.. "మీ దత్తపుత్రుడు" అల్లు అర్జున్ బెస్ట్ విష్!

ఒక నెటిజన్ "దావూద్ గురువు కూడా నిజంగా గర్వపడాలి, ఎందుకంటే ఒక గురువు ఎలా ప్రపంచంలో ఉన్నత స్థానంలో ఉండాలో మాత్రమే కాదు, కొన్నిసార్లు అండర్ వరల్డ్‌లో కూడా ఎలా ఉండాలో నేర్పిస్తాడు అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు. మరొకరు దావూద్ ఇబ్రహీం నుంచి మీరు ఏమి నేర్చుకున్నారు? అని సూటిగా ప్రశ్నించారు. మూడవ యూజర్ ఒసామా బిన్ లాడెన్‌ను కూడా చేర్చండి అని ఎద్దేవా చేశారు.

 

దావూద్ గురించి ఆర్జీవీ గతంలో ఏమన్నారంటే..
రామ్ గోపాల్ వర్మకు గ్యాంగ్‌స్టర్ల ప్రపంచంపై ఉన్న ఆసక్తి కొత్తేమీ కాదు. ఆయన దర్శకత్వం వహించిన అనేక సినిమాలు ఈ అంశం చుట్టూనే తిరిగాయి. 2021లో, భారతదేశంలోని అతిపెద్ద అండర్‌వరల్డ్ గ్యాంగ్, ముంబై ఆధారిత దావూద్ ఇబ్రహీం గ్యాంగ్‌పై 'డి కంపెనీ' అనే చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రంలో అజయ్ దేవగణ్, మోహన్‌లాల్, వివేక్ ఒబెరాయ్, మనీషా కోయిరాలా, అంతరా మాలి, సీమా బిస్వాస్ వంటి నటులు నటించారు. ఒక పాత ఇంటర్వ్యూలో వర్మ, తన కెరీర్ దావూద్‌కు రుణపడి ఉందని చెప్పారు. 2002లో నేను తీసిన 'కంపెనీ' సినిమా కూడా దావూద్ ఇబ్రహీం, ఛోటా రాజన్ మధ్య జరిగిన విభేదాలపై ఆధారపడి ఉంది  అని ఆయన అన్నారు.

అయితే, ఈసారి ఉపాధ్యాయ దినోత్సవం లాంటి పవిత్రమైన రోజున దావూద్ పేరును గురువుల జాబితాలో చేర్చడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఆర్జీవీ ఉద్దేశం ఏదేమైనా, అది సమాజంలో ఒక వర్గాన్ని కించపరిచేలా ఉందని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై రామ్ గోపాల్ వర్మ ఎలా స్పందిస్తారో చూడాలి మరి.