రాములోరి వేడుక ఎప్పటికీ గుర్తుండిపోతుంది : వీడియో షేర్ చేసిన ప్రధాని మోదీ

రాములోరి వేడుక ఎప్పటికీ గుర్తుండిపోతుంది : వీడియో షేర్ చేసిన ప్రధాని మోదీ

అయోధ్యలో శ్రీరాముని ప్రతిష్ఠాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగిన విధానంపై ప్రధాని మోదీ ఎక్స్ లో పోస్ట్ చేశారు. జనవరి 22న అయోధ్యలో జరిపిన శ్రీరామ్‌లల్లా 'ప్రాణ్ ప్రతిష్ఠ' వేడుక ఏళ్ల తరబడి గుర్తుండిపోతుందన్నారు. 'ప్రాణ ప్రతిష్ఠ' వేడుక నుండి అద్భుతమైన క్షణాలను కూడా ఆయన ఓ వీడియోను రూపేణా పంచుకున్నారు. ఈ ఫుటేజీలో వేలాది మంది ప్రజలు రాముడి నామాన్ని జపిస్తున్నట్లు చూడవచ్చు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు అందర్నీ ఆకట్టుకుంటోంది.

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఈ క్లిప్ లో ప్రధాని మోదీ పట్టు వస్త్రాలు తీసుకువచ్చే సమయంలో కొందరు భావోద్వేగం కావడం, సంబరాలు చేసుకోవడం కనిపిస్తోంది. ఆ తర్వాత రాముడి తేజస్సు, మోదీ ఆరతి, భక్తుల భజనలు లాంటి అద్భుతమైన సన్నివేశాలు ఈ వీడియోలో ఉన్నాయి. చివరగా రామ్ లల్లాకు మోదీ సాష్టాంగ నమస్కారం చేయడం అందర్నీ విశేషంగా ఆకట్టుకుంది. ఆ తర్వాత పవిత్రోత్సవంలో పాల్గొన్న వారిపై మోదీ పూలు చల్లడం, అందరికీ నమస్కారం చేయడంతో ఈ వీడియో ముగుస్తుంది. దీంతో పాటు జనవరి 22న అయోధ్యలో చోటుచేసుకున్న, చూసిన క్షణాల్లో రాబోయే సంవత్సరాల్లో ఎప్పటికీ మంచి జ్ఞాపకాలుగా నిలిచిపోతాయని ప్రధాని మోదీ రాసుకొచ్చారు.

రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ

సోమవారం అయోధ్యలో రామమందిరంలోని రామ్ లల్లా విగ్రహం 'ప్రాణ ప్రతిష్ఠ'ను ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించారు. దీంతో రామ మందిరాన్ని చూడాలని 500 ఏళ్లుగా సాగుతున్న పోరాటం ఎట్టకేలకు ఫలించడం దేశానికి చారిత్రాత్మక ఘట్టంగా నిలిచింది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా దీపావళి తరహా వేడుకలు జరిగాయి. ఈ వేడుకలను పురస్కరించుకుని వేలాది దేవాలయాలు, ప్రభుత్వ భవనాలు, రైల్వే స్టేషన్లు, సంస్థలు, దుకాణాలను అలంకరించారు. అయోధ్యలో సాయంత్రం బాణసంచా కాల్చడం, లైట్ అండ్ సౌండ్ షోతో ఆనందంగా సాగింది. దేశంలోని అనేక ఘాట్‌లు కూడా శ్రీరాముడికి స్వాగతం పలికేందుకు ప్రత్యేక లైట్లతో అలంకరించారు. వివిధ నగరాల్లో మతపరమైన ఊరేగింపులు, కమ్యూనిటీ లంగర్లు కూడా నిర్వహించారు. మొత్తంమీద రామమందిర ప్రారంభోత్సవం రోజున దేశం మొత్తం పండుగ వాతావరణం నెలకొంది.