
వన్ నేషన్, వన్ ఎలక్షన్ నిర్వహణపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 2023 సెప్టెంబర్ 1 న కమిటీని ఏర్పాటు చేసింది. ఎన్నికల సాధ్యాసాధ్యాలను ఈ కమిటీ పరిశీలించి కేంద్రానికి నివేదికను సమర్పించనుంది. 2023 సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు జరగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం వన్ నేషన్, వన్ ఎలక్షన్ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ క్రమంలో కమిటీ ఏర్పాటు చర్చనీయాంశంగా మారింది.
వన్ నేషన్, వన్ ఎలక్షన్ అనేది దేశవ్యాప్తంగా లోక్‌సభ , రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించడాన్ని సూచిస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనేక సందర్భాల్లో ఈ అంశంపై మాట్లాడారు. 2014 లోక్‌సభ ఎన్నికల కోసం బీజేపీ తమ మేనిఫెస్టోలో దీనిని పొందుపరిచింది.
కేంద్రంలో ప్రధాని మోదీ రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత జమిలి ఎన్నికల దిశగా కొన్ని రోజులు ప్రయత్నాలు చేశారు. దేశమంతా ఒకేసారి ఎన్నికలకు మొదట్లో మొగ్గు చూపారు. కానీ, ఇది కేవలం ప్రతిపాదనగానే మిగిలిపోయింది. అయితే, మరో ఏడెనిమిది నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. అదేవిధంగా, డిసెంబర్లో ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు ఉన్నాయి. ఈ క్రమంలో ముందస్తు ఎన్నికల అంశం తెరపైకి వచ్చింది.
ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే ఎన్డీఏ కూటమి బంపర్ మెజార్టీతో గెలుస్తుందని పలు జాతీయ, అంతర్జాతీయ సర్వే సంస్థలు కూడా రిపోర్ట్ ఇచ్చాయి.