- ఆలయాన్ని ఆధీనంలోకి తీసుకున్న ఎండోమెంట్ అధికారులు
- వ్యతిరేకిస్తున్న బీఆర్ఎస్, బీజేపీ నాయకులు
- జీవో ఉపసంహరించుకోవాలని ఆందోళన
మెదక్, వెలుగు: దాదాపు 50 ఏళ్ల కింద మెదక్ పట్టణంలోని వెలసిన కోదండ రామాలయ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. ఈ ఆలయాన్ని ఎండోమెంట్ పరిధిలోకి తీసుకురావడాన్ని కాంగ్రెస్ నాయకులు సమర్థిస్తుండగా, ఆలయ కమిటీతో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ నాయకులు వ్యతిరేకిస్తున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మెయిన్ రోడ్డు వైపు షాపింగ్ కాంప్లెక్స్, పైన కమర్షియల్ పర్పస్ బిల్డింగ్, పక్కన ఉన్న స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్, ప్రాంగణంలో ఫంక్షన్ హాల్ నిర్మించారు.
వీటి అద్దెల ద్వారా ఆలయానికి పెద్ద మొత్తంలో ఆదాయం సమకూరుతుంది. కొంత కాలంగా ఆదాయ, వ్యయాలకు సంబంధించిన లెక్కలు సరిగ్గా లేవని ఆరోపణలు రావడంతో పాటు అనేక ఏళ్లుగా ఒకే కమిటీ కొనసాగుతుండడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో కోదండ రామాలయాన్ని ఎండోమెంట్ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ మొదలైంది. ఈ విషయాన్ని స్థానికులు ఎండోమెంట్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో వివిధ పద్దుల ద్వారా ఆలయానికి సమకూరుతున్న ఆదాయంపై ఎండో మెంట్అధికారులు ఆరా తీశారు.
రామాలయాన్ని ఎండోమెంట్ పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించారు. ఈ మేరకు హవేలీ ఘనపూర్ మండలం కూచన్ పల్లిలోని వేంకటేశ్వర ఆలయ ఈవో శ్రీనివాస్ కు కోదండ రామాలయ బాధ్యతలు అప్పగిస్తూ ఎండోమెంట్ అడిషనల్ కమిషనర్ కృష్ణ వేణి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలో ఉమ్మడి మెదక్ జిల్లా ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ రంగారావు, అధికారులతో కలిసి ఆలయాన్ని అధీనంలోకి తీసుకునేందుకు శుక్రవారం ఆలయానికి రాగా ఆలయ కమిటీ బాధ్యులు, బీజేపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వెనుదిరిగిన అధికారులు శనివారం ఉదయం వచ్చి రామాలయాన్ని స్వాధీనం చేసుకుని, హుండీలకు తాళాలు వేశారు.
ఎండోమెంట్ పరిధిలోకి మార్చొద్దు..బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి
మెదక్ పట్టణంలోని కోదండ రామాలయాన్ని ఎండోమెంట్ పరిధిలోకి తీసుకోవడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి భక్తులతో కలిసి రాస్తారోకో నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ రామాలయాన్ని దేవాదాయ శాఖలో విలీనం చేయడం దుర్మార్గమైన చర్య అన్నారు. దేవాదాయ శాఖ అధికారులు జారీ చేసిన జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఎన్నో ఏండ్ల చరిత్ర ఉన్న దేవాలయాలను పరిరక్షించేందుకు అఖిల పక్షం ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామన్నారు. అధికార పార్టీ కేవలం కక్ష సాధింపు చర్యతోనే రామాలయాన్ని దేవాదాయ శాఖలో విలీనం చేస్తోందని ఆరోపించారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా భక్తుల మనోభావాలను దెబ్బతీయొద్దన్నారు. ఆమె వెంట మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, మాజీ జడ్పీ వైస్ చైర్పర్సన్ లావణ్య, పార్టీ నాయకులు ఉన్నారు.
నిర్ణయాన్ని ఉపసంహరించు కోవాలి : ఎంపీ రఘునందన్ రావు
ఆలయాల పరిరక్షణకు బీజేపీ కృషి చేస్తోందని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. శనివారం ఆయన మెదక్ పట్టణంలోని కోదండ రామాలయాన్ని సందర్శించి మీడియాతో మాట్లాడారు. మెదక్ రామలయాన్ని ఎండోమెంట్ పరిధిలోకి ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. హిందువుల్లో ఐక్యత తక్కువగా ఉంటుందనే అధికారంలో ఉండే పార్టీలు ఇలా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. ఇలాంటి తరుణంలో హిందువులు చైతన్యం కావాల్సిన అవసరం ఉందన్నారు. రామాలయం కోసం మెదక్ఎంపీగా ఎక్కడికైనా వెళ్తామన్నారు.
దేవాలయ కమిటి తప్పులు చేస్తే విచారణ చేయండి కానీ ఆలయానికి తాళాలు వేస్తే సహించమన్నారు. తెలంగాణలో దూప దీప నైవేద్యాలకు నోచుకోని గుళ్లు చాలా ఉన్నాయని వాటి గురించి ప్రభుత్వం ఆలోచించాలన్నారు. యూపీఏ ప్రభుత్వం అప్పట్లో హిందువులను టెర్రరిస్టులుగా చూపించిందని ఆరోపించారు. యూపీఏ నాయకులు పాకిస్తాన్ ఏజెంట్ గా మారారని ధ్వజమెత్తారు. బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, టౌన్ ప్రెసిడెంట్ నాయిని ప్రసాద్ ఉన్నారు.
