సైనికులను కించపరిచేలా మాట్లాడడం తగదు : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌‌రావు

సైనికులను కించపరిచేలా మాట్లాడడం తగదు : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌‌రావు
  • ప్రజలకు ఇచ్చిన హమీలను నెరవేర్చడంలో కాంగ్రెస్‌‌ విఫలం
  • స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటాలి

మహబూబాబాద్, వెలుగు : సైనికుల త్యాగాలను కించపరిచేలా కాంగ్రెస్‌‌ నేతలు పార్లమెంట్‌‌లో మాట్లాడడం తగదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌‌రావు అన్నారు. బుధవారం మహబూబాబాద్‌‌ జిల్లాలోని కురవి వీరభద్రస్వామి ఆలయాన్ని దర్శించుకొని ప్రత్యకే పూజలు చేశారు. అనంతరం జిల్లా కేంద్రంలో ఇల్లంద రోడ్‌‌ నుంచి వీఆర్ఎన్‌‌ గార్డెన్‌‌ వరకు ర్యాలీ నిర్వహించి, అంబేద్కర్‌‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. పహల్గాం దుర్ఘటన తర్వాత ఉగ్రవాదుల ఏరివేతకు కేంద్రం ఆపరేషన్‌‌ సింధూర్‌‌ చేపట్టిందని, కాంగ్రెస్‌‌ మాత్రం సైనికుల త్యాగాలను కించపరిచేలా మాట్లాడుతోందని అన్నారు.

గతంలో కూడా అసలు సర్జికల్‌‌ స్ట్రైక్స్‌‌ జరగలేదని అన్నారని, ఇలాంటి మాటల వల్ల సైనికుల ఆత్మస్థైర్యం దెబ్బతింటుందన్నారు. తెలంగాణలో సీఎం రేవంత్‌‌రెడ్డి మాయమాటలతో కాలం వెళ్లదీస్తున్నారన్నారు. గతంలో సోనియాగాంధీని తీవ్ర పదజాలంతో విమర్శించిన ఆయన ఇప్పుడు పొగడ్తల్లో ముంచేస్తున్నారన్నారు. అబద్ధాలు చెప్పడం, నటించడంలో ఆయనకు ఆస్కార్‌‌ అవార్డు ఇవ్వొచ్చని ఎద్దేవా చేశారు. 42 శాతం రిజర్వేషన్లు అంటూ మరోసారి బీసీలను మోసగిస్తున్నారన్నారు. ముస్లింలకు మేలు చేయడానికే బీసీ బిల్లు రూపొందించారని మండిపడ్డారు. రాష్ట్రానికి సరిపడా యూరియాను కేంద్రం సరఫరా చేస్తోందని, యూరియా అక్రమ రవాణాను నిరోధించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్‌‌ఎస్‌‌ విధానాలతో ప్రజలు విసిగిపోయారని, ప్రజలంతా బీజేపీని ఆదరిస్తున్నారని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటాలని పిలుపునిచ్చారు. ప్రతి గడపకు వెళ్లి కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న పథకాలను వివరించాలని సూచించారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వల్లభు వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీ సీతారాంనాయక్, మాజీఎమ్మెల్యే ఎం.ధర్మారావు, గుజ్జుల ప్రేమేందర్‌‌రెడ్డి, ఎడ్ల అశోక్‌‌రెడ్డి, యాప సీతయ్య, లింగాల సుధీర్‌‌రెడ్డి, వద్దిరాజు రాంచందర్‌‌రావు, శ్యాంసుందర్‌‌, చీకటి మహేశ్‌‌గౌడ్‌‌ పాల్గొన్నారు.