వరాల మాసం రంజాన్

వరాల మాసం రంజాన్

జీవితాన్ని, జీవిత గమనాన్ని పవిత్రంగా మార్చి మనసుకు ప్రశాంతతను ఇచ్చేదే రంజాన్ మాసం​. మనసులోనే స్వర్గం అనుభూతిని కలిగించేది ఈ నెల. అందుకే ఈ నెలలో అల్లాహ్‌‌‌‌‌‌‌‌ ఆశించినట్లు.. మంచి పనులు చేయాలి. మానవత్వం, పవిత్రతతో బతకాలి. కఠినమైన ఉపవాస దీక్షలు పాటించాలి అంటారు పెద్దలు. అంతేకాదు.. ప్రార్థనలు, దాన ధర్మాలు చేస్తూ ఆధ్యాత్మికతతో జీవించాలి అని చెప్తుంటారు. 


రంజాన్‌‌‌‌‌‌‌‌ నెలలో ముస్లింలు ముఖ్యంగా రోజా, సహెర్, ఇఫ్తార్, తరవీహ్, ఏతేకాఫ్, షబ్–ఏ–ఖదర్, లైలతుల్ ఖద్ర్, ఫిత్రా, జకాత్ లాంటివి పాటిస్తారు. నెల రోజులపాటు తమ లైఫ్​ స్టైల్​ని పూర్తిగా మార్చుకుంటారు. 30 రోజుల ఉపవాసదీక్ష తర్వాత రంజాన్ పండుగ చేసుకుంటారు. ఉపవాసంతో పాటు దైవారాధన, దానధర్మాలు చేస్తారు. ఉపవాస దీక్ష మనిషిలో త్యాగం, కరుణ, సానుభూతి, ప్రేమను పెంచుతుంది. ఉపవాసం చేసేటప్పుడు అబద్ధం చెప్పకూడదు. అన్యాయం చేయకూడదు. 


లైలతుల్ ఖద్ర్


రంజాన్ మాసం చివర్లో తేదీల చివరన బేసి సంఖ్యలు ఉన్న ఐదు చివరి రాత్రుల్లో ఏదో ఒక రోజు రాత్రి ఇస్లామియా ప్రకారం ‘లైలతుల్ ఖద్ర్’ అని అంటారు. ఈ  నెలలో 27వ రోజు రాత్రి షబ్‌‌‌‌‌‌‌‌–ఏ-–ఖదర్‌‌‌‌‌‌‌‌ చేస్తారు. ఈ రోజే ఖురాన్‌‌‌‌‌‌‌‌ అవతరించిందని చెప్తుంటారు. అందుకే ఆ రోజు రాత్రి జాగరణ, ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. ఈ ఒక్క రాత్రి భక్తితో కఠోర దీక్షతో ప్రార్థనలు చేసేవాళ్లకు 83 ఏండ్ల పాటు ప్రార్థనలు చేసిన ఫలితం దక్కుతుందని నమ్మకం. అంతేకాదు ఈ ప్రార్థనల వల్ల సర్వపాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. 


ఏతేకాఫ్‌‌‌‌‌‌‌‌


రంజాన్ మాసంలో అత్యంత నియమనిష్టలతో ఉపవాస దీక్షలతో గడిపే ముస్లింలు రాత్రింబవళ్లూ నమాజ్‌‌‌‌‌‌‌‌లో లీనమై ఉంటారు. సాధారణంగా ముస్లింలు రోజూ ఐదుసార్లు నమాజ్‌‌‌‌‌‌‌‌ చేస్తుంటారు. వీటికి తోడు రంజాన్‌‌‌‌‌‌‌‌ నెలలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. రాత్రి (ఇషా) ఫర్జ్‌‌‌‌‌‌‌‌ నమాజ్‌‌‌‌‌‌‌‌ తర్వాత అదనంగా 20 రకాతుల తరావీహ్ నమాజ్‌‌‌‌‌‌‌‌ చేస్తారు. ముప్పై రోజుల దీక్షలను మూడు భాగాలుగా విభజించారు. మొదటి10 రోజుల్లో దీక్షలు పాటిస్తే అల్లా కరుణ వర్షాన్ని కురిపిస్తాడని,11 నుంచి 20 రోజులు దీక్షలు పాటిస్తే పాపాలను హరిస్తాడని, 21వ రోజు నుంచి దీక్షలను పూర్తి చేస్తే నరకం నుంచి విముక్తి లభిస్తుందని ముస్లింలు నమ్ముతారు. 21వ రోజు నుంచి చివరి రోజు వరకు ఒక ప్రత్యేకత ఉంది. దీన్ని ఎతేకాఫ్‌‌‌‌‌‌‌‌ అంటారు. ఇది ఒక రకమైన తపోనిష్ట. దీనిని పాటించాలి అనుకునేవాళ్లు మసీదులోనే ఒక పక్క తెర కట్టుకుని అక్కడే దైవ ధ్యానం, ప్రార్థనలు, ఖురాన్‌‌‌‌‌‌‌‌ పారాయణం చేస్తారు. ఎతేకాఫ్‌‌‌‌‌‌‌‌లో ఉన్నవాళ్లు బలమైన కారణం ఉంటే తప్ప మసీదు వదిలి బయటకు వెళ్లకూడదు.


జకాత్, ఫిత్రా


రంజాన్ మాసంలో పేద ముస్లింలకు ‘జకాత్’ ఒక వరం లాంటిది. రంజాన్ పండుగను పేద ముస్లింలు కూడా ఆనందంగా చేసుకోవాలనే ఉద్దేశంతో ‘జకాత్’ చేయాలని ఖురాన్​లో చెప్పారు.  అంటే.. ఏడాది పాటు సంపాదించిన డబ్బు, వెండి, బంగారం నుంచి రెండున్నర శాతం విలువైన వస్తువులు లేదా డబ్బుని పేదలకు దానం చేయాలి. వ్యవసాయ భూములు, పశువులు, గొర్రెలు, మేకలు.. ఇలా దేని మీద ఆదాయం వచ్చినా జకాత్ రూపంలో దానం చేయాలి. 


జికర్ 


అల్లాహ్ నామస్మరణ చేయడం మంచిదని ముఫ్తీ, మౌల్వీలు చెప్తుంటారు. ఎంత పెద్ద సమస్యలు అయినా సింపుల్​గా పరిష్కరించే శక్తి అల్లా నామస్మరణకు ఉంటుంది. నామస్మరణ చేసేందుకు తస్బీ (జపమాల) చదువుతారు. అల్లాహ్​కు సంబంధించిన 99 పేర్లను ఒకసారి స్మరిస్తే.. ఒక ‘జికర్’ (ఆధ్మాత్మిక చింతన) అవుతుంది. 


నమాజ్ కూడా యోగానే


ముస్లింలు రోజుకు ఐదుసార్లు నమాజ్‌‌‌‌‌‌‌‌ చేస్తుంటారు. అయితే.. ఇందులోనూ శాస్త్రీయత ఉందంటున్నారు మతపెద్దలు. నమాజ్‌‌‌‌‌‌‌‌ చేసే భంగిమలు యోగాలో కొన్ని ఆసనాలు వేసినట్టు ఉంటాయి. నమాజ్‌‌‌‌‌‌‌‌ ప్రార్థనల్లో భాగంగా నిలబడి (ఖియామ్‌‌‌‌‌‌‌‌), వంగి(రుకూ), కూర్చొని తల నేలకు ఆన్చి (సజ్దా), ఖిరాత్‌‌‌‌‌‌‌‌(యోగాలో వజ్రాసనంలా కూర్చోవడం) చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి. రక్తప్రసరణ బాగా జరుగుతుంది. నడుము నొప్పి దూరం అవుతుంది. తల నేలకు ఆన్చడం వల్ల తలలో కూడా రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. 

  • మొహమ్మద్ షౌకత్ అలీ 
  • మెట్​పల్లి, వెలుగు