
- సాంకేతిక సమస్యలతో నిలిచిపోతున్న యూరియా ఉత్పత్తి
- ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు రెండు సార్లు అమోనియా లీకేజీ.. ప్లాంట్ షట్‌డౌన్
- తాజాగా హెచ్‌టీఆర్ మెషీన్‌లో సాంకేతిక సమస్య
- ఇప్పటికి 13 రోజులుగా నిలిచిన ఉత్పత్తి.. రిపేర్‌కు మరో 10 రోజులు పట్టే చాన్స్
- ఆగస్టులో 65 వేల టన్నులు టార్గెట్ కాగా.. 24 వేల టన్నులే ఉత్పత్తి
గోదావరిఖని, వెలుగు: రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్‌ఎఫ్‌సీఎల్) ప్లాంట్‌ను నిత్యం సాంకేతిక సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. 2021 మార్చి 22న యూరియా ఉత్పత్తి ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు 20 సార్లు టెక్నికల్ సమస్యలతో ప్లాంట్‌లో ఉత్పత్తి నిలిచిపోయింది. 2025– 26 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు రెండు సార్లు ప్లాంట్ షట్‌డౌన్ కాగా.. తాజాగా హెచ్‌టీఆర్ మెషినరీలో సాంకేతిక లోపం కారణంగా ఉత్పత్తి మళ్లీ నిలిచిపోయింది. దీని ప్రభావం యూరియా ప్రొడక్షన్, ట్రాన్స్‌పోర్ట్‌పై చూపుతోంది.
అమోనియా లీక్.. 59 రోజులు షట్ డౌన్
రామగుండం యూరియా ప్లాంట్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తిన సందర్భంలో పైప్‌లైన్లలో అమోనియా లీక్ అవుతోంది. దీంతో ప్లాంట్ మొత్తాన్ని రోజుల తరబడి షట్ డౌన్ చేయాల్సి వస్తోంది. మే 8న ప్లాంట్‌లో ఏర్పడిన లీకేజీ సమస్య కారణంగా జూన్ 15 వరకు 39 రోజులు ప్లాంట్‌ను షట్‌డౌన్ చేశారు. మళ్లీ జులై 16న సమస్య ఏర్పడడంతో ఆ రోజు నుంచి ఆగస్ట్ 4 వరకు 20 రోజులు ప్లాంట్ షట్‌డౌన్ అయింది.
ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం
ఆర్‌ఎఫ్‌సీఎల్ ప్లాంట్‌లో రోజుకు 2,200 టన్నుల అమోనియా, 3,850 టన్నుల నీమ్ (వేప) నూనె కోటెడ్ యూరియా ఉత్పత్తి చేసేలా డిజైన్ చేశారు. ఈ ప్లాంట్‌లో ప్రతి ఏటా 12.75 లక్షల టన్నుల యూరియా ఉత్పత్తి చేసి వివిధ ప్రాంతాలకు రవాణా చేయాలి. అయితే ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతుండడంతో టార్గెట్ మేరకు ఉత్పత్తి జరగడం లేదు. 2022– 23 ఆర్థిక సంవత్సరంలో 8.40 లక్షల టన్నుల యూరియా ఉత్పత్తి కాగా, 2023– 24లో 11.14 లక్షల టన్నులు, 2024– 25 సంవత్సరంలో 11.95 లక్షల టన్నుల యూరియా ఉత్పత్తి చేశారు.
ప్రస్తుత 2025– 26 సంవత్సరంలో ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు 4 లక్షల టన్నుల యూరియా ఉత్పత్తిని టార్గెట్‌గా పెట్టుకోగా.. 2.71 లక్షల టన్నుల ఉత్పత్తి మాత్రమే చేయగలిగారు. ఆగస్ట్‌లో 65 వేల టన్నుల యూరియా ఉత్పత్తి చేసి రవాణా చేస్తానని గతంలో చెప్పిన ఆర్‌ఎఫ్‌సీఎల్ మేనేజ్‌మెంట్.. కేవలం 24 వేల టన్నుల యూరియాను మాత్రమే సప్లై చేసింది.
హెచ్‌టీఆర్‌లో సాంకేతిక లోపం
ఆర్‌ఎఫ్‌సీఎల్ ప్లాంట్‌లో యూరియా ఉత్పత్తి ప్రక్రియ కోసం సింథసిస్ గ్యాస్ ప్రొడ్యూస్ చేసేందుకు ఏర్పాటు చేసిన హీట్ ట్రాన్స్‌ఫార్మింగ్ రీఫార్మర్ (హెచ్‌టీఆర్)లో ఆగస్ట్ 14న టెక్నికల్ ఇష్యూతో లీకేజీ ఏర్పడడంతో ప్లాంట్ మరోసారి షట్ డౌన్ అయింది. ఈ మెషీన్‌లో సాంకేతిక లోపం ఏర్పడితే దానికదే ఆటోమేటిక్‌గా ట్రిప్ అవుతుంది. ఈ సమస్య ప్లాంట్‌లో నిత్యకృత్యంగా మారింది. ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో 11.70 శాతం వాటా ఉన్న డెన్మార్క్‌కు చెందిన హల్దర్ టాప్స్ అనే కంపెనీ ప్రతినిధులు వచ్చి ఎల్‌అండ్‌టీ సంస్థ సహకారంతో రిపేర్లు చేపట్టారు.
ప్లాంట్ షట్‌డౌన్ అయి సోమవారం నాటికి 12 రోజులు కాగా.. ఉత్పత్తి ప్రారంభం అయ్యేందుకు మరో 10 రోజులు పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆర్‌ఎఫ్‌సీఎల్ సీఎండీ సర్వనన్ ఇటీవల నోయిడా నుంచి వచ్చి ప్లాంట్‌ను పరిశీలించారు. అయితే నాణ్యత లేని పైప్‌లైన్ల కారణంగానే హెచ్‌టీఆర్ మెషీన్‌లో సాంకేతిక ఇబ్బందులు ఏర్పడుతున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.