రామారావు.. డ్యూటీ సరిగ్గా చేయలె!

రామారావు.. డ్యూటీ సరిగ్గా చేయలె!

నటీనటులు: రవితేజ, దివ్యాంశ కౌశిక్, రాజీషా విజయన్, వేణు తొట్టెంపూడి, నాజర్, నరేష్ తదితరులు
సంగీతం:  సామ్ సీఎస్‌
నిర్మాణం:  సుధాకర్ చెరుకూరి
స్టోరీ, స్క్రీన్‌ ప్లే, డైరెక్షన్: శరత్ మండవ

‘క్రాక్’ సినిమాతో తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కినా.. ఆ తర్వాత వచ్చిన ‘ఖిలాడీ’ రిజల్ట్ రవితేజ ఫ్యాన్స్ని డిసప్పాయింట్ చేసింది. దాంతో ‘రామారావు ఆన్ డ్యూటీ’ మూవీపై అందరూ ఆశలు పెట్టుకున్నారు. శరత మండవ డైరెక్షన్‌లో సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రం ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి మూవీ ఎలా ఉంది? అభిమానులు ఆనందపడేలా ఉందా? రవితేజ అకౌంట్లో మరో విజయాన్ని జమ చేసిందా? ఓసారి చూద్దాం.

కథ
రామారావు (రవితేజ) స్టోరీ 1995లో మొదలవుతుంది. అతనో డిప్యూటీ కలెక్టర్. నిజాయతీపరుడు. చట్టానికి లోబడి విధులు నిర్వర్తిస్తుంటాడు. అయితే కొన్ని కారణాల వల్ల తన పోస్ట్ ను కోల్పోతాడు. ఆ తర్వాత తన సొంత ఊరికే తహశిల్దార్‌‌గా వెళ్లాల్సి వస్తుంది. అయితే అతను వెళ్లేసరికి ఆ ఊరిలో కొందరు మిస్సవుతారు. వారిలో అతని మాజీ ప్రేయసి (రాజీషా), ఆమె భర్త కూడా ఉంటారు. వాళ్లంతా ఏమయ్యారో తెలుసుకోడానికి రామారావు ప్రయత్నిస్తాడు. ఆ క్రమంలో అతనికి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి, వాటిని ఎలా ఎదుర్కొన్నాడు, తనవాళ్లని కనిపెట్టాడా లేదా, అసలు వాళ్ల విషయంలో ఏం జరిగింది అనేది మిగతా కథ.

ఎలా ఉందంటే..
కొన్ని కథలు వినడానికి బానే ఉంటాయి. కానీ వెండితెర పైకి చేరాక వెలవెలబోతుంటాయి. దానికి కారణం స్క్రీన్‌ ప్లేలో చేసే తప్పులు. రామారావు విషయంలో అదే జరిగింది. కథలో బలం ఉంది. కానీ దాన్ని ప్రెజెంట్ చేయడంలో మాత్రం లోపం ఉంది. ఎప్పుడూ ఊరమాస్ క్యారెక్టర్స్ లో కనిపించే రవితేజకి ఈ క్లాస్ క్యారెక్టర్‌‌ కొత్త ప్రయత్నమే. పోలీస్ ఆఫీసర్ పాత్రల్లో సైతం మాస్‌గానే మెప్పించిన అతను.. ఇంత క్లాస్‌గా కనిపించడం కొత్తగా అనిపిస్తుంది. అయితే అందులోనూ అతను సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. తన రోల్ ను చాలా పవర్‌‌ఫుల్‌గా డిజైన్ చేశాడు దర్శకుడు. ఇంట్రడక్షన్ చాలా బాగా ఇచ్చాడు. అక్కడి నుంచి స్టోరీలోకి ప్రేక్షకుల్ని తీసుకెళ్లే ప్రయత్నం మొదలవుతుంది. ఊరి జనం కనిపించకపోవడం అనే పాయింట్ ఇంటరెస్టింగ్‌గా అనిపిస్తుంది. అయితే ఆ ఆసక్తిని చివరి వరకు క్యారీ చేయడంలో మాత్రం తడబాటు కనిపిస్తుంది. ఉండటానికి ట్విస్టులు చాలానే ఉన్నా అవన్నీ రొటీన్‌గా అనిపిస్తుంటాయి. ఇంటర్వెల్ వరకు ఎలాగో లాక్కొచ్చినా.. సెకెండాఫ్‌లో ల్యాగ్ ఎక్కువగా ఉండటంతో చూసేవారిలో ఉత్సాహం కొద్దికొద్దిగా తగ్గిపోతుంది. ఎప్పుడో చూసినట్టు అనిపించే సీన్లు, లాజిక్‌ లేని వివరణలు, కృతకంగా అనిపించే ఎమోషన్లు కలిసి రామారావు కష్టం మీద, ప్రేక్షకుల ఆసక్తి మీద కూడా నీళ్లు చల్లేస్తుంటాయి. మధ్య మధ్యలో వచ్చే ఫ్యామిలీ సీన్లు మరింత విసుగు తెప్పిస్తాయి. మొదట్లో ఉన్న ఆసక్తిని హోల్డ్ చేయలేని కథ.. సినిమా ఇంత సేపు ఉందేంటి అనే ఫీలింగును కూడా కలిగిస్తుంది. నిజానికి ఈ సినిమాలో హీరోకి తన ఊరిలో ఏం జరిగిందో తెలీదు. ఎందుకు జరిగిందో తెలీదు. ఎవరు చేశారో కూడా తెలీదు. జీరో స్టేట్ నుంచి వర్క్ స్టార్ట్ చేస్తాడు. అలాంటప్పడు ఒక్కో విషయాన్నీ ఆసక్తికరంగా రివీల్ చేసుకుంటూ వెళ్తే సరిపోయేది. కానీ ఆ ప్రయత్నమూ సరిగ్గా ఫలించలేదు. హీరో ఆ సమస్యని సాల్వ్ చేసే క్రమంలో అతని ఇంటెలిజెన్స్ ను కూడా సరిగ్గా చూపించలేదు. ఎప్పుడైనా కానీ మంచి విలన్, సరైన కాన్‌ఫ్లిక్ట్ లేనప్పుడు హీరో పోరాటం అర్థం లేనిదిగా మిగిలిపోతుంది. రామారావు పోరాటమూ అలాగే మిగిలింది. 

ప్లస్సులూ మైనస్సులూ..
ఈ సినిమాకి కచ్చితంగా రవితేజ ప్లస్ అనే చెప్పాలి. కామెడీ, ఎమోషన్, రొమాన్స్.. ఏదైనా పండించగల నటుడు తను. అందుకే ఈ క్యారెక్టర్ ను కూడా చాలా ఈజ్‌తో చేసుకుంటూ పోయాడు. అక్కడక్కడా కాస్త ఏజ్ కనిపించింది. కానీ తనలోని ఎనర్జీ దాన్ని పెద్దగా పట్టించుకోనివ్వదు. యాక్షన్ సీన్స్ అదరగొట్టేశాడు. డైలాగ్ డెలివరీలో తనదైన మార్క్ తో ఇంప్రెస్ చేశాడు. ప్రీ క్లైమాక్స్ తో ఎమోషనల్ సీన్ చాలా బాగా పండించాడు. చాలా గ్యాప్ తర్వాత వచ్చిన వేణు కూడా పోలీసాఫీసర్ పాత్రకి పూర్తి న్యాయం చేశాడు. ఒకప్పుడు ఎంటర్‌‌టైనింగ్ క్యారెక్టర్స్ లో చూసిన అతన్ని ఇప్పుడిలా ఖాకీ యూనిఫామ్‌లో చూడటం కొత్త అనుభూతినిస్తుంది. అయితే అతని పాత్రను ఇంకా బాగా తీర్చిదిద్దవచ్చనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో మంచి మంచి డైలాగ్స్ పడ్డాయి. పాటలు అంతంతమాత్రంగా ఉన్నా బ్యాగ్రౌండ్ స్కోర్‌‌ బాగుంది. ముఖ్యంగా యాక్షన్ సీన్లను ఎలివేట్ చేయడంలో సామ్ సీఎస్ సక్సెస్ అయ్యాడు. 
    
అయితే రొటీన్ మెలో డ్రామా, అంత కొత్తగా అనిపించని ఫార్మాట్ ఈ సినిమాని దెబ్బేశాయి. హీరోయిన్ల పాత్రలు అంతంత మాత్రంగా ఉన్నాయి. రాజీషా పాత్ర నిడివి తక్కువే అయినా ఆమె పర్‌‌ఫార్మెన్స్ ఆకట్టుకుంటుంది. దివ్యాంశ చూడటానికి బాగున్నా తన నటన గురించి చెప్పుకోడానికేమీ లేదు. మిగతా పాత్రలూ అంతగా పండలేదు. యాక్షన్ సీన్స్ డిఫరెంట్‌ ఫీల్‌ని ఇచ్చినా.. మరీ అంత అవసరం లేదేమో అనిపిస్తుంది. అసలే సినిమా ఆసక్తికరంగా సాగడం లేదని ఫీలవుతుంటే.. మధ్య మధ్యలో పాటలు కథకి అడ్డు తగులుతుంటాయి. ఈ సినిమా భారాన్ని రవితేజ చివరి వరకు ఎలా మోస్తాడా అని చూస్తున్నవారికి ఓ సమయం వచ్చేసరికి ఆ ఓపిక కూడా నశించిపోతుంది. విషయం వీక్‌గా ఉన్నప్పుడు అతని పర్‌‌ఫార్మెన్స్‌ పీక్స్ లో ఉండి మాత్రం ఏం లాభం అనుకుంటాడు ప్రేక్షకుడు. అలా కాకుండా ఈ కథకి చక్కని ట్రీట్‌మెంట్ ఇచ్చి ఉంటే శరత్‌ మండవకి మంచి సినిమా తీసిన పేరు కచ్చితంగా వచ్చి ఉండేది. కానీ రొటీన్ ఫార్మాట్‌తో పండని సీన్లతో తన కథకి న్యాయం చేయలేకపోవడం పెద్ద మైనస్ అయ్యింది.

కొసమెరుపు: రామారావు.. డ్యూటీ సరిగ్గా చేయలె!