తల్లిలాంటి బీజేపీకి ద్రోహం చేయొద్దు : రాంచందర్ రావు

తల్లిలాంటి బీజేపీకి ద్రోహం చేయొద్దు : రాంచందర్ రావు
  • మనస్పర్థలు పక్కనపెట్టి కలిసి పని చేయండి: రాంచందర్ రావు
  • బీసీలకు 42% రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: తల్లిలాంటి బీజేపీకి ద్రోహం చేయొద్దని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అన్నారు. మనస్పర్థలు పక్కనపెట్టి, పాత.. కొత్త అనే తేడా లేకుండా లీడర్లు, కార్యకర్తలు కలిసి పనిచేయాలని సూచించారు. బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ స్టేట్ ఆఫీసులో మక్తల్ ప్రాంతానికి చెందిన వివిధ పార్టీల నేతలు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా వారికి కండువా కప్పి పార్టీలోకి రాంచందర్ రావు ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడారు. 

‘‘కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు బీజేపీ డిమాండ్ చేస్తున్నది. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని బీజేపీపై కాంగ్రెస్ లీడర్లు విమర్శలు చేయడం సిగ్గుచేటు. బీజేపీపై తప్పుడు ప్రచారం చేయడమే కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకున్నది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి లీడర్లు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలి’’అని రాంచందర్ రావు అన్నారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని రాష్ట్రాలకు సరిపడా యూరియా పంపిణీ చేస్తున్నదని తెలిపారు. రాష్ట్రంలో రబీ సీజన్ కోసం 9.5 లక్షల టన్నుల యూరియా అవసరం కాగా, కేంద్రం 12.02 లక్షల టన్నులు సరఫరా చేసిందని గుర్తుచేశారు. కొంత మంది ఎరువులను బ్లాక్ మార్కెట్​లో అమ్ముకున్నారని ఆరోపించారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమని మండిపడ్డారు.

జాబ్ సీకర్ కాదు, జాబ్ గివర్ అవ్వాలి

యువత ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తూ ఉండకుండా, సొంతంగా పరిశ్రమలు స్థాపించాలన్న ఆలోచనలో ఉండాలని రాంచందర్ రావు అన్నారు. ‘జాబ్ సీకర్’కాకుండా ‘జాబ్ గివర్’గా మారాలని ప్రధాని మోదీ ఇచ్చిన సందేశాన్ని గుర్తుచేశారు. హైదరాబాద్ లో ఎఫ్టీసీసీఐ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ‘తెలంగాణలో సమగ్ర పారిశ్రామిక అభివృద్ధికి రోడ్ మ్యాప్’అనే అంశంపై ఆయన మాట్లాడారు. స్టార్టప్‌‌‌‌‌‌‌‌లు, ఏఐ, సెమీ కండక్టర్లు వంటి రంగాల్లో మెరుగైన అవకాశాలున్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన 12 నేషనల్ హైవేలు, ఎక్స్‌‌‌‌‌‌‌‌ప్రెస్‌‌‌‌‌‌‌‌వేలతో ల్యాండ్ విలువలు పెరుగుతున్నాయని, హైదరాబాద్ ఫార్మసీ, హెల్త్ క్యాపిటల్‌‌‌‌‌‌‌‌గా మారిందని తెలిపారు.