
- పార్కింగ్, సెట్ బ్యాక్ లేకుండానే భారీ కట్టడాలు
- హౌస్ పర్మిషన్ తో నిర్మించిన ఫంక్షన్ హాల్ ను సీజ్ చేసిన మున్సిపల్ అధికారులు
మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయి. తెలంగాణ మున్సిపల్ యాక్ట్ 2019 రూల్స్ కు అగైనెస్ట్ గా బిల్డింగులు కడుతూ మున్సిపల్ ఆదాయానికి గండి కొడుతున్నారు. కొంతమంది రెసిడెన్షియల్ పర్మిషన్లు తీసుకుని భారీ హంగులతో కమర్షియల్ బిల్డింగులు కడుతున్నారు. వాటిలో రూల్స్ కు విరుద్ధంగా ఫంక్షన్ హాల్స్, బాంకెట్ హాల్స్ నిర్వహిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. కనీసం పార్కింగ్ ఏరియా, సెట్ బ్యాక్ కూడా వదలడం లేదు.
వాగుల పక్కన బఫర్ జోన్ కబ్జా చేసి మల్టీ ప్లోర్ బిల్డింగ్స్, అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నారు. రెండు మూడు ఫ్లోర్లకు పర్మిషన్లు తీసుకుని నాలుగైదు అంతస్తులు కడుతున్నారు. సమాజంలో ప్రముఖులుగా చలామణి అవుతున్న కొంతమంది బడా వ్యక్తులు, పొలిటికల్ లీడర్లు, ఇతర పలుకుబడి కలిగిన వారు ఈ తరహా అక్రమాలకు పాల్పడుతున్నారు.
మున్సిపల్ రూల్స్ బ్రేక్....
తెలంగాణ మున్సిపల్ యాక్ట్ 2019 ప్రకారం... కమర్షియల్ బిల్డింగులు, పెద్ద అపార్ట్మెంట్ల నిర్మాణానికి కఠినమైన రూల్స్ అమలులో ఉన్నాయి. కమర్షియల్ బిల్డింగ్ పర్మిషన్ తీసుకుంటే స్టిల్ట్ ను తప్పనిసరిగా పార్కింగ్ కోసం కేటాయించాలి. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ తీసుకోవాలి. రోడ్ల వెడల్పు, బిల్డింగ్ హైట్ ను బట్టి సెట్ బ్యాక్ వదిలేయాలి. 45 అడుగుల రోడ్డు కైతే 10 ఫీట్లు, 40 నుంచి 60 అడుగుల రోడ్డుకు 13.5 ఫీట్లు, 60 నుంచి 80 అడుగుల రోడ్డుకు 18 ఫీట్లు, 80 అడుగులు దాటిన రోడ్డుకు 20 ఫీట్ల చొప్పున నాలుగు వైపులా సెట్ బ్యాక్ ఉండాలి.
ఫంక్షన్ హాల్స్, షాపింగ్ మాల్స్ ఏర్పాటు చేస్తే ప్లాన్ లో సూచించిన విధంగా పార్కింగ్ ప్లేస్ వదలడంతో పాటు బిల్డింగ్ చుట్టూ ఫైర్ ఇంజన్ తిరిగేలా సెట్ బ్యాక్ ఉండాలి. కానీ ఈ రూల్స్ పాటించకుండానే ఇష్టారీతిన కమర్షియల్ బిల్డింగులు, అపార్ట్మెంట్లు నిర్మిస్తున్నారు.
ఫంక్షన్ హాల్ సీజ్....
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గ్రీన్ సిటీలో రాళ్లవాగు పక్కనే రూల్స్ కు విరుద్ధంగా నిర్మించిన ఓ బిల్డింగును మున్సిపల్ అధికారులు సీజ్ చేశారు. విద్యాసంస్థల నిర్వాహకులు, రియల్టర్లు అయిన ఉదారి కుమారస్వామి, ఉదారి చంద్రమోహన్ గౌడ్ అనే వ్యక్తులు రెసిడెన్షియల్ పర్మిషన్ తో నాలుగు ఫ్లోర్ల బిల్డింగ్ నిర్మించారు. ఎలాంటి అనుమతులు లేకుండానే అందులో ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేశారు.
దీనికి సెట్ బాక్స్ కూడా లేకపోవడంతో అగ్ని ప్రమాదం జరిగితే ఫైర్ ఇంజన్ తిరిగే పరిస్థితి లేదు. రాళ్లవాగు పక్కన నిర్మించిన బిల్డింగ్ కు బఫర్ జోన్ సైతం లేదు. ఆ జాగను కబ్జా చేసి పార్కింగ్ కోసం కేటాయించారు. దీనిపై ఫిర్యాదులు రావడంతో ఎట్టకేలకు టాస్క్ ఫోర్స్ ఆఫీసర్ల సహకారంతో మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు బిల్డింగ్ ను సీజ్ చేశారు. తెలంగాణ మున్సిపల్ యాక్ట్ 2019 సెక్షన్ 181 ప్రకారం దీనిని సీట్ చేసినట్టు నోటీసులు అంటించారు.
అక్రమ కట్టడాలు మరెన్నో....
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇలాంటివి చాలా ఉన్నాయి. గ్రీన్ సిటీ సెకండ్ వెంచర్ లో జీ+2 పర్మిషన్ తీసుకుని ఓ పెద్ద అపార్ట్మెంట్ నిర్మించారు. దానిపై అక్రమంగా మరో రెండు ఫ్లోర్లు వేశారు. అదే ఏరియాలో ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ రెసిడెన్షియల్ పర్మిషన్ తీసుకుని అపార్ట్మెంట్ కట్టి ప్లాట్లు అమ్ముకున్నాడు. నస్పూర్ లోని కలెక్టరేట్ రోడ్ ఎదురుగా ఉన్న ఒక కమర్షియల్ బిల్డింగ్ సైతం రెసిడెన్షియల్ పర్మిషన్ తోనే నిర్మించారు.
బస్టాండ్ సమీపంలో ఉన్న భారీ కమర్షియల్ కాంప్లెక్స్ లో రెండు ఫ్లోర్లు అక్రమంగా నిర్మించారు. మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు అవినీతికి పాల్పడుతూ అక్రమ నిర్మాణాలను ఎంకరేజ్ చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. టాస్క్ ఫోర్స్ కమిటీకి అక్రమ నిర్మాణాలను కూల్చివేసే అధికారం ఉన్నప్పటికీ బడా వ్యక్తుల జోలికి వెళ్లడం లేదని పలువురు విమర్శిస్తున్నారు