నల్గొండ అర్బన్, సూర్యాపేట, వెలుగు: నల్గొండ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పోలింగ్ సిబ్బంది మొదటి ర్యాండమైజేషన్ ప్రక్రియను సవ్యంగా నిర్వహించినట్లు కలెక్టర్ బి. చంద్రశేఖర్ తెలిపారు. జిల్లాలోని 6 మున్సిపాలిటీలకు, 1 కార్పొరేషన్‌కు 162 వార్డుల్లో 475 పోలింగ్ స్టేషన్లకు సిబ్బందిని కంప్యూటర్ ఆధారిత విధానంలో ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు.
ప్రతి పోలింగ్ స్టేషన్‌కు పీఓ, ఏపీఓ, ఓపీఓలతో పాటు 20 శాతం రిజర్వ్ సిబ్బందిని కేటాయించారు. ఎన్నికలు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటూ త్వరలో రెండోదశ ర్యాండమైజేషన్ చేపడతామని కలెక్టర్ తెలిపారు. సూర్యాపేట జిల్లాలో మున్సిపల్ ఎన్నికలను సవ్యంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు.
రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ నెల 28 నుంచి నామినేషన్ల స్వీకరణ, ఫిబ్రవరి 11న పోలింగ్, 13న ఓట్ల లెక్కింపు జరుగుతుందని వెల్లడించారు. జిల్లాలో 2,26,586 మంది ఓటర్లు ఉండగా, 5 మున్సిపాలిటీలలో 141 వార్డులకు గాను 372 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళి, ఎన్నికల వ్యయం, బ్యాలెట్ ఓటింగ్ విధానంపై రాజకీయ పార్టీలు, అభ్యర్థులకు అవగాహన కల్పించినట్లు తెలిపారు. పోలింగ్ ప్రక్రియ పర్యవేక్షణకు ఎఫ్‌ఎస్‌టీ, ఎస్‌ఎస్‌టీ, నోడల్ టీమ్స్, మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా, శాంతియుతంగా జరిగేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్ కోరారు.
