రంగారెడ్డి జిల్లా కేజీబీవీల్లో మెస్​లకు టెండర్లు పిలవట్లే!

రంగారెడ్డి జిల్లా కేజీబీవీల్లో మెస్​లకు టెండర్లు పిలవట్లే!
  • దశాబ్ది ఉత్సవాల కారణంగా ఆలస్యం
  • స్పెషల్ ​ఆఫీసర్లు తీసుకొచ్చే కూరగాయలతోనే 
  • స్టూడెంట్లకు ఫుడ్ చాలీచాలని భోజనంతో 
  • ఇబ్బంది పడుతున్న విద్యార్థినులు

రంగారెడ్డి, వెలుగు: వసతి గృహాల్లో చదివే స్టూడెంట్లకు సరైన  భోజనంతో పాటు అన్ని సౌకర్యాలు కల్పించాల్సిన పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే.  అకడమిక్​ఇయర్ ప్రారంభానికి ముందే అన్ని రకాల వసతి గృహాల్లో చదివే స్టూడెంట్ల అవసరాల కోసం కూరగాయలు, పండ్లు, పాలు, మాంసం, నిత్యవసరాలను సప్లయ్ చేసేందుకు టెండర్లను పిలవాల్సి ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు, గురుకులాల్లో క్లాసులు మొదలై పదిరోజులు కావొస్తోంది. అయితే, రంగారెడ్డి జిల్లాలోని కేజీబీవీల టెండర్ల ప్రక్రియ ఇంకా మొదలే కాలేదు. దీంతో ఆ విద్యాలయాల స్టూడెంట్లు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. మెనూ ప్రకారం అందని భోజనం రంగారెడ్డి జిల్లాలో మొత్తం 20 కేజీబీవీలు ఉన్నాయి. వీటిలో 10 విద్యాలయాల్లో ఇంటర్ విద్యను  కూడా అందిస్తున్నారు. 2023–24 విద్యా సంవత్సరానికి ఈ 20 కేజీబీవీల్లో మొత్తం 5,970 మంది విద్యార్థినులు చదువుతున్నారు.

కొత్తగా చేరేవారి కోసం అడ్మిషన్ల ప్రక్రియ కూడా కొనసాగుతోంది. ప్రతి ఏటా స్టూడెంట్ల సంఖ్య పెరుగుతున్నా.. కేజీబీవీలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే నిత్యావసరాలు సప్లయ్ చేసే టెండర్లను పిలవాల్సి ఉండగా.. ప్రారంభమై పది రోజులైనప్పటికీ ఇంకా టెండర్లను ఆహ్వానించలేదు. దీంతో సప్లయ్ లేకపోవడంతో స్కూల్​ స్పెషల్​ ఆఫీసర్లే కొన్ని కూరగాయలు తీసుకొస్తున్నారు. వాటినే వండుతున్న సిబ్బంది చాలీచాలని భోజనాన్ని విద్యార్థినులకు అందిస్తున్నారు. వసతి గృహాల నిర్వహణలో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని టీచర్లు సహా పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టెండర్ల ప్రక్రియ పూర్తయితేనే విద్యార్థినులకు మెనూ ప్రకారం భోజనం అందే వీలుంటుంది. ప్రస్తుతం నామమాత్రపు మెనూ సాగుతుండటంతో స్టూడెంట్లకు ఇబ్బందులు తప్పడంలేదు.

ఉత్సవాలు ముగిస్తేనే..!

టెండరు ప్రక్రియలో కూరగాయలు, నిత్యావసర సరుకులు, పాలు, గుడ్లు, మాంసం లాంటి వాటికి జిల్లా అధికారులు ఒక రేటును ఫిక్స్​చేస్తారు. ఆ రేట్లలో తక్కువ ధరకు ఏ టెండరు దారుడు సప్లయ్ చేయడానికి కోట్​చేస్తారో వారికి ఆ టెండర్​ను అప్పగిస్తారు. జిల్లా కలెక్టర్​ఆమోదం తెలిపిన తర్వాత టెండర్ దారులు ఆయా స్కూళ్లకు సరుకులను సప్లయ్ చేయడం మొదలుపెడతారు.  కానీ రంగారెడ్డి జిల్లాలోని కేజీబీవీలకు సంబంధించి  ఇప్పటివరకు ఎలాంటి ప్రక్రియను ప్రారంభించ లేదు. అసలు ఎప్పుడు మొదలు పెడతారో కూడా తెలియని పరిస్థితి. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల పనుల కారణంగా టెండర్ ప్రక్రియ ఆలస్యమైందని, ప్రస్తుతం అవి  ముగియడంతో టెండర్​ను ఫైనల్ చేసే అవకాశం ఉందని కిందిస్థాయి అధికారులు చెబుతున్నారు.

ప్రత్యేక అధికారులపై భారం..

జిల్లాలో ఏప్రిల్​ నుంచి హస్టల్ నిర్వహణ బిల్లులు, కరెంటు బిల్లులను ప్రత్యేక అధికారులకు ప్రతినెలా చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఇందుకు సంబంధించిన బిల్లులను ప్రభుత్వం ఇంకా ఇవ్వకపోవడంతో ఆ భారమంతా ప్రత్యేక అధికారులపైనే పడుతోంది. ప్రస్తుతం కేజీబీవీల్లో టెండర్ల ప్రక్రియ పూర్తికాకపోవడంతో సరుకులు, కూరగాయలు, పండ్లు, మాంసం, గుడ్ల ఖర్చంతా ప్రత్యేక అధికారులే చెల్లించాల్సి వస్తోంది.

టైమ్ కేటాయించలేకపోయాం

కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలకు ప్రతి ఏటా టెండర్లను పిలుస్తాం. ఈసారి కొంచెం లేట్ అయ్యింది. రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాలు ఉండటంతో సమయం కేటాయించలేకపోయాం. త్వరలోనే టెండర్ల ప్రాసెస్​ను పూర్తిచేస్తాం. ప్రస్తుతం విద్యాలయాలు ప్రారంభమైనప్పటికీ ఎక్కడా ఇబ్బంది లేకుండా సరుకులు అందేలా చూస్తున్నాం. 
– సుజాత, కేజీబీవీ, రంగారెడ్డి జిల్లా అధికారి