‘రంగనాయక–మల్లన్న’ కాల్వ మట్టిని అక్రమంగా తరలిస్తున్న వ్యాపారులు

‘రంగనాయక–మల్లన్న’ కాల్వ మట్టిని అక్రమంగా తరలిస్తున్న వ్యాపారులు

సిద్దిపేట, వెలుగు : సిద్దిపేట జిల్లాలోని రంగనాయక సాగర్ రిజర్వాయర్  నుంచి మల్లన్న సాగర్ రిజర్వాయర్  కు నీటిని మళ్లించేందుకు గతంలో దాదాపు నాలుగు కిలో మీటర్ల మేర కాల్వ తీశారు. తవ్వకాలతో  వచ్చిన మట్టిని, రాళ్లను పక్కనే భారీ కుప్పలుగా పోశారు. దాదాపు 40 ఫీట్ల ఎత్తులో ఉన్న ఈ మట్టిని, అందులోని రాళ్లను కొందరు వ్యక్తులు కాజేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అడ్డూ అదుపూలేకపోవడంతో పరిశ్రమలు, రియల్ ఎస్టేట్ వెంచర్లలోకి దర్జాగా తరలిస్తున్నారు.  

అధికారుల్లో అలసత్వం!

కాల్వ పక్కన గుట్టలుగా ఉన్న మట్టిని, రాళ్లను ప్రైవేటు వ్యక్తులు  తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. నిబంధనల ప్రకారం మట్టిని, రాళ్లను తరలించాలంటే మైనింగ్ శాఖ అధికారుల అనుమతి తప్పనిసరి. అయితే ఇది నీటి కాల్వకు సంబంధించిన మట్టి అయినందున ఇరిగేషన్ శాఖ ఆధీనంలో ఉంది. కానీ దాన్ని సంరక్షించే ఏర్పాట్లు లేకపోవడంతో అక్రమార్కులకు అందివచ్చిన అవకాశంగా మారింది. కొన్ని సందర్భాల్లో  మట్టి అక్రమ తరలింపుపై పలువురు ప్రశ్నిస్తే  సిద్దిపేట మున్సిపాల్టీ లో ప్రజల అసవరాల కోసం అని, నేషనల్ హైవే పనుల కోసం అని,  అధికారుల మౌఖిక అనుమతి ఉందని చెబుతూ వ్యాపారులు  దాటవేశారు. ఏదేమైనా టిప్పర్ల కొద్దీ మట్టిని పక్కదారి పట్టిస్తున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. 

ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి

కాల్వ తవ్వకాలతో వచ్చిన మట్టిని, రాళ్ల ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం వచ్చే అవకాశం ఉన్నా అక్రమార్కుల మూలంగా గండి పడుతోంది. కాల్వ చుట్టూ ఎత్తైన గుట్టలుగా ఉన్న మట్టి ఇప్పుడు సగానికిపైగా మాయమైంది. ఇటీవలే  సిరిసిల్ల నేషనల్ హైవే పనుల కోసం మట్టి తరలింపునకు అనుమతించినప్పటికీ చాలా వరకు ప్రైవేటు వ్యక్తులే తరలించుకుపోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మట్టి అక్రమ తరలింపును ఆపాలని పలువురు కోరుతున్నారు. 

పర్మిషన్​ లేకుండా మట్టి తరలిస్తే చర్యలు 

గాడిచర్లపల్లి వద్ద కాల్వ మట్టిని సిరిసిల్ల నేషనల్ హైవే పనులకు వినియోగించేందుకు మాత్రమే అనుమతించాం. నిబంధనల ప్రకారం సంబంధిత శాఖ నుంచి సీనరేజీ చార్జీలు వసూలు చేస్తున్నాం. ప్రైవేటు వ్యక్తులు పర్మిషన్​ లేకుండా మట్టిని తరలిస్తే పోలీసులకు ఫిర్యాదు చేసి తగిన చర్యలు తీసుకుంటాం.  సాయిబాబ, ఈఈ ఇరిగేషన్