రోడ్డుపై కారు పెట్టినందుకు మద్యం మత్తులో కుటుంబంపై యువకుడి దాడి

రోడ్డుపై కారు పెట్టినందుకు మద్యం మత్తులో కుటుంబంపై యువకుడి దాడి

రంగారెడ్డి జిల్లాలో ఓ యువకుడు మద్యం మత్తులో వీరంగం సృష్టించాడు. రోడ్డుపై కారు పెట్టారంటూ ఓ కుటుంబంపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన బండ్లగూడ జాగిర్ కార్పొరేషన్  పరిధిలోని హైదర్షాకోట్ లో జరిగింది.

పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. 

నర్సారెడ్డి కాలనీలో శ్రీకాంత్ రెడ్డి అనే యువకుడు... ఓ కుటుంబంపై దాడికి పాల్పడ్డాడు. మద్యం మత్తులో దంపతుల ముఖంపై కొట్టాడు. అడ్డువచ్చిన వారి కూతురుపైనా బూతులు తిడుతూ విచక్షణా రహితంగా దాడి చేశాడు. అంతేకాదు.. రోడ్డుపై ఈడ్చుకుంటూ వారిపై చేయి చేసుకున్నాడు. రోడ్డుపై ఉన్న కారు అద్దాలను కూడా ధ్వంసం చేశాడు.

అసలేం జరిగింది..?

కారును రోడ్డు బయట పార్క్ చేసినందుకు ఆగ్రహంతో ఊగిపోయిన శ్రీకాంత్ రెడ్డి ఒక మహిళ కుటుంబంపై దాడికి దిగాడు. కారును మీ ఇంటి ముందు పెట్టుకో.. రోడ్డు మీద ఎందుకు పెట్టావంటూ  అర్ధరాత్రి సమయంలో గొడవకు దిగాడు. శ్రీకాంత్ రెడ్డితో తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధితులు.

శ్రీకాంత్ తీరుపై బాధిత కుటుంబం నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కులం పేరుతో దూషించి.. తమపై శ్రీకాంత్ రెడ్డి దాడి చేశారంటూ ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లోనూ విచారిస్తున్నారు.