జనాలకు దూరంగా రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్

జనాలకు దూరంగా రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్
  • పెద్దాఫీసర్లకు సమస్యలు చెప్పుకోవాలంటే కుదరని పరిస్థితి

ఎల్​బీనగర్, వెలుగు: మొన్నటి దాకా సిటీ​లో కొనసాగిన రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్.. ఇబ్రహీంపట్నంలోని కొంగరకలాన్​కు మారినప్పటి నుంచి జనాలకు ఇబ్బందులు తప్పడం లేదు. జనం కలెక్టరేట్ ​దాకా వచ్చేందుకు సరైన ట్రాన్స్​పోర్టు సౌకర్యం లేదు. ఉన్నతాధికారులకు సమస్యలు చెప్పుకునే వీలు లేకుండా పోయింది. గతంలో మాదిరిగా కాకుండా అన్ని శాఖల పెద్దాఫీసర్లు ఒకేచోట ఉంటున్నారని ఆనంద పడాలో.. ఆఫీసర్ల దాకా వెళ్లలేకపోతున్నామని బాధపడాలో అర్థం కావట్లేదని జిల్లా ప్రజలు వాపోతున్నారు. ఔటర్​రింగ్​రోడ్డు(ఓఆర్ఆర్)కు సమీపంలోని ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కొంగరకలాన్​ గ్రామ శివారులో నిర్మించిన రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్​కొత్త బిల్డింగ్( ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్)ను గతేడాది ఆగస్టు 25న అందుబాటులోకి వచ్చింది. సీఎస్ సోమేశ్ కుమార్, మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, జిల్లా లోని ఎమ్మెల్యేలతో కలిసి సీఎం కేసీఆర్ అట్టహాసంగా ప్రారంభించారు. అప్పటిదాకా లక్డీకపూల్​తో పాటు సిటీలోని వేర్వేరు ప్రాంతాల్లో కొనసాగిన జిల్లాకు సంబంధించిన 36 శాఖల ఆఫీసులు ఒక్కచోటికి చేరాయి. దీంతో జిల్లా ప్రజలు సమస్యలు చెప్పుకునేందుకు, ఇతర పనుల మీద సిటీ దాకా పోవాల్సిన బాధ తప్పిందని ఆనందపడ్డారు. అయితే అది ఎక్కువ రోజులు లేదు. ఓఆర్ఆర్​ను ఆనుకొని ఉన్న మండలాల్లోని జనం కూడా కలెక్టరేట్ ​దాకా వెళ్లే పరిస్థితి లేదు. ఎలాంటి బస్సు సౌకర్యం లేకపోవడమే ఇందుకు కారణం. 

పడతా.. లేస్తూనే ప్రజావాణికి..

షాద్​నగర్, చేవెళ్ల, ఆమన్​గల్, కడ్తాల్, హయత్​నగర్, అబ్దుల్లాపూర్​మెట్, సరూర్ నగర్, ఎల్​బీనగర్, మంచాల, యాచారం, ఇబ్రహీంపట్నం ఇలా ఏ ఏరియా నుంచి చూసినా కలెక్టరేట్​కు ట్రాన్స్​పోర్టు లేదు. ఏదైనా పని ఉంటే జనం బైక్​లు, కార్లలో వెళ్తున్నారు. సొంత వెహికల్స్​ లేకుంటే ఆటో లేదా కారును కిరాయికి తీసుకుని వెళ్తున్నారు. సామాన్యులు కలెక్టరేట్​ దాకా వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణికి దాదాపుగా 100 వరకు ఫిర్యాదులు వస్తున్నాయి. ఫిర్యాదుదారుల్లో దాదాపుగా మధ్యతరగతి వారే ఉంటున్నారు. వీరంతా కిరాయికి వెహికల్స్ ​మాట్లాడుకుని వస్తున్నారు. కలెక్టరేట్​దాకా వచ్చాక ఏదైనా డాక్యుమెంట్​ జిరాక్స్ తీయించాలంటే సమీపంలో ఒక్క సెంటర్ ​కూడా లేదు. వాటి కోసం మళ్లీ చుట్టుపక్కల గ్రామాలకు పరుగులు పెట్టాల్సి వస్తోంది. లక్డీకపూల్​లో కలెక్టర్ ఆఫీస్ ఉన్నప్పుడు దూరమైనా జనం ఈజీగా వెళ్లేవారు. పొద్దున నుంచి సాయంత్రం వరకు బస్సులు అందుబాటులో ఉండేవి. కొంగరకలాన్​కు మార్చాక కలెక్టరేట్​కు వెళ్లి రావడానికే ఒక రోజు పడుతోందని జనం వాపోతున్నారు. 

ఉద్యోగులకూ తిప్పలే

కొంగరకలాన్​లోని రంగారెడ్డి కలెక్టరేట్​ ఆఫీసుకు అధికారులు వెళ్లేందుకు డైలీ పొద్దున జేబీఎస్ ​నుంచి 2 బస్సులు, సికింద్రాబాద్ నుంచి 2 బస్సులు, ఉప్పల్ నుంచి ఒక బస్సు అందుబాటులో ఉంది. సాయంత్రం తిరిగి ఇండ్లకు చేరేందుకు కూడా అవే సర్వీసులు ఉన్నాయి. ఒకవేళ ఎవరైనా బస్​ మిస్ ​అయితే ఇక అంతే. ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్​లోని 36 శాఖల్లో దాదాపుగా 400 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. సొంత వెహికల్స్ ​లేని అధికారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీసం కలెక్టరేట్​కు తుక్కుగూడ, బొంగుళూరు నుంచి బస్సులు తిప్పాలని జిల్లా వాసులు కోరుతున్నారు. 

ఒక్క బస్సు కూడా ఉండట్లే

కొంగరకలాన్ లోని కలెక్టరేట్​కు వెళ్లాలంటే ఒక్క బస్సు కూడా ఉండడం లేదు. చాలా ఇబ్బందిగా ఉంటోంది. సిటీలో ఉన్నప్పుడే నయం. చాలా ఈజీగా వెళ్లి వచ్చేవాళ్లం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎలా వెళ్లాలో అర్థం కావడం లేదు. క్యాబ్​లో వెళ్లాలంటే రూ.1500 నుంచి రూ. 2 వేలు ఖర్చు చేయాల్సి వస్తోంది.

– వెంకటేశ్, అన్నారం, 
ఫరూఖ్ నగర్ మండలం, షాద్​నగర్

ఓఆర్ఆర్ నుంచి ఎలా పోవాలి

కలెక్టర్ ఆఫీసుకు పోయేందుకు బస్సులు మారుతూ ఔటర్ రింగు రోడ్డు వరకు వెళ్తున్నాం. అక్కడి నుంచి ఎట్ల పోవాలో అర్థం కావట్లేదు. ప్రజల కోసం పెట్టిన ఆఫీసుకు జనాలే వెళ్లే పరిస్థితి లేదు.   రంగారెడ్డి కలెక్టరేట్​ను జిల్లా పరిధిలో ఏర్పాటు చేసినందుకు ఆనందిం చాలా? లేక అక్కడి దాకా వెళ్లలేక పోతున్నందుకు బాధపడాలా?

– ఏర్పుల నర్సింహ, హయత్​నగర్