- రంగారెడ్డిలో 526 జీపీలు, 4,668 వార్డులు
- వికారాబాద్‌లో 594 గ్రామాలు, 5,058 వార్డులు
- మొత్తం మూడు విడతల్లో ఎన్నికలు
చేవెళ్ల/వికారాబాద్, వెలుగు: పల్లె పోరుకు నగారా మోగింది. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలను మొత్తం మూడు విడతల్లో నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. అందుకు అనుగుణంగా రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లోనూ మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మూడు దశలకు సంబంధించిన గ్రామ పంచాయతీలు, వార్డులు, పోలింగ్ స్టేషన్ల సంఖ్యను ఖరారు చేశారు. షెడ్యూల్ ప్రకటనతో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని అధికారులు తెలిపారు.
తొలుత షాద్‌నగర్, రాజేంద్రనగర్ డివిజన్లలో..
రంగారెడ్డి జిల్లాలో మొత్తం 526 గ్రామాలు, 4,668 వార్డులు ఉండగా, మొదటి దశలో షాద్‌నగర్, రాజేంద్ర నగర్ డివిజన్ల పరిధిలోని కొత్తూరు, నందిగామ, కేశంపేట, కొండుర్, చౌడేరగూడ, ఫరూక్నగర్, శంషాబాద్ మండలాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు.
ఇందులో 174 గ్రామ పంచాయతీలు , 1,530 వార్డులు ఉండగా, 1,530 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. రెండో దశలో చేవెళ్ల డివిజన్ పరిధిలోని శంకర్‌పల్లి, మొయినాబాద్, చేవెళ్ల, షాబాద్ , కందుకూరు డివిజన్ పరిధిలోని అమన్ గల్, కడ్తాల్, తలకొండ పల్లి మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో 178 గ్రామ పంచాయతీలు , 1,540 వార్డులు ఉండగా, 1,540 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు.
మూడో విడతలో ఇబ్రహీంపట్నం డివిజన్ లోని అబ్దుల్లా పూర్ మెట్, ఇబ్రహీంపట్నం, యాచారం, మంచాల్, మాడ్గుల్, కందుకూరు డివిజన్లో మహేశ్వరం , కందుకూరు మండలాలు ఉన్నాయి.174 గ్రామ పంచాయతీలు, 1,598 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. 1,612 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. జిల్లాలో 7,52,259 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 3,76,824 మంది పురుషులు, 3,75,408 మంది మహిళలు, 28 మంది ఇతరులు ఉన్నారు
వికారాబాద్ జిల్లాలో ఫస్ట్ తాండూర్.. లాస్ట్ పరిగి
వికారాబాద్‌జిల్లాలో మొత్తం 594 గ్రామ పంచాయతీలు 5,058 వార్డులు ఉండగా, మొదటి విడతలో తాండూర్ నియోజకవర్గంలోని తాండూర్, బషీరాబాద్, యాలాల, పెద్దేముల్, కొడంగల్నియోజకవర్గంలోని కొడంగల్, దౌల్తాబాద్, బొంరాస్‌పేట, దుద్యాల మండలాల పరిధిలోని మొత్తం 262 గ్రామ పంచాయతీలు, 2,198 వార్డులకు ఎన్నికలు నిర్వహించున్నారు.
రెండో విడతలో వికారాబాద్నియోజకవర్గంలోని వికారాబాద్, ధారూర్, మోమిన్‌పేట, బంట్వారం, కోట్‌పల్లి, నవాబుపేట మండలాల్లోని 175 గ్రామ పంచాయతీలు, 1,520 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు.
మూడో విడతలో పరిగి నియోజకవర్గంలోని పరిగి, పూడూరు, దోమ, కులకచర్ల, చౌడాపూర్ మండలాలలోని 157 గ్రామ పంచాయతీలు, 1,340 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా అధికారులు తెలిపారు.
జిల్లాలో 7,52,259 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 3,76,824 మంది పురుషులు, 3,75,408 మంది మహిళలు, 28 మంది ఇతరులు ఉన్నారు. వికారాబాద్ జిల్లాలో 6,98,469 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 3,43,687 మంది పురుషులు, 3,54,766 మంది మహిళలు, 16 మంది ఇతరులు ఉన్నారు.
