Bhuvneshwar Kumar: భువీ ఈజ్ బ్యాక్.. 8 వికెట్లతో చెలరేగిన భారత వెటరన్ పేసర్

Bhuvneshwar Kumar: భువీ ఈజ్ బ్యాక్.. 8 వికెట్లతో చెలరేగిన భారత వెటరన్ పేసర్

ఆరేళ్ల తర్వాత ఫస్ట్ క్లాస్ క్రికెట్‍లోకి రీఎంట్రీ ఇచ్చిన భారత సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్.. తొలి మ్యాచ్ లోనే అదరగొట్టాడు. దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీలో ఉత్తరప్రదేశ్ కు ఆడుతున్న భువీ బెంగాల్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 8 వికెట్లతో సత్తా చాటాడు. అతని ధాటికి బెంగాల్ జట్టు 188 పరుగులకే కుప్పకూలింది. ఫస్ట్ క్లాస్ కెరీర్లో భువీ 8 వికెట్లు తీయడం ఇదే తొలిసారి.

ఒకప్పుడు భువనేశ్వర్ కుమార్‌ అంటే ప్రత్యర్థి జట్టు బ్యాటర్లకు వణుకుపుట్టేది. పేస్ 135 కి.మీ మించకపోయినా ఇన్‌స్వింగర్, అవుట్ స్వింగర్లతో బ్యాటర్లకు చెమటలు పట్టించేవాడు. అలాంటి ఆటగాడికి ప్రస్తుతం భారత జట్టులో చోటు లేదు. భారత్ తరఫున 2022 నవంబర్‌లో చివరి వన్డే ఆడిన భువీ.. 2018 జనవరిలో చివరి టెస్ట్ ఆడారు. ఆ తర్వాత క్రమం తప్పకుండా ఐపీఎల్ లో ఆడుతున్నప్పటికీ.. జాతీయ జట్టులో మాత్రం చోటు దక్కించుకోలేకపోతున్నాడు. ఈ క్రమంలో బెంగాల్‌తో జరుగుతున్న మ్యాచ్‌తో భువీ తన సంచలన ప్రదర్శనతో మరోసారి సెలెక్టర్ల దృష్టిలో పడ్డారు.

ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్‌

జనవరి 25 నుంచి స్వదేశంలో భారత్, ఇంగ్లాండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టుల సిరీస్‌ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌ మొదటి రెండు టెస్టుల కోసం బీసీసీఐ ఇప్పటికే జట్టును ప్రకటించగా.. చివరి మూడు టెస్టులకు తరువాత ఎంపిక చేయనుంది. భువీ మరోసారి ఇలాంటి ప్రదర్శన కనపరిస్తే.. చివరి మూడు టెస్టులకు సెలక్టర్లు అతణ్ని పరిగణనలోకి తీసుకునే అవకాశం లేకపోలేదు. కెరీర్‌లో ఇప్పటి వరకూ 21 టెస్టులు ఆడిన భువీ 63 వికెట్లు పడగొట్టాడు.

60 పరుగులకే ఆలౌట్

అంతకుముందు భారత స్టార్ పేసర్ మహ్మద్ షమీ తమ్ముడు మహ్మద్ కైఫ్(4 వికెట్లు) దెబ్బకు యూపీ 60 పరుగులకే కుప్పకూలింది. అనంతరం బ్యాటింగ్ మొదలుపెట్టిన బెంగాల్ జట్టును భువీ వణికించాడు. తన స్వింగ్ అనుభవంతో ఒకరి వెంట మరొకరిని పెవిలియన్ చేరుస్తూనే వచ్చాడు. మొదటిరోజు ఐదు వికెట్లు తీసిన భువీ.. రెండో రోజు మార్నింగ్ సెషన్‌లో మరో 3 వికెట్లు పడగొట్టాడు. బెంగాల్ తొలి ఇన్నింగ్స్‌లో 128 పరుగుల ఆధిక్యం  సాధించింది.