మహిళా కానిస్టేబుల్‌‌పై మామ అత్యాచారం

మహిళా కానిస్టేబుల్‌‌పై మామ అత్యాచారం

ఉత్తర‌ప్రదేశ్‌లో దారుణం జరిగింది. కొడుకు భార్యను కూతురులా చూసుకోవాల్సిన మామ.. కోడలిపై కన్నేశాడు. ఆమె భర్త లేని సమయం చూసి అత్యాచారానికి పాల్పడ్డాడు. మీరట్ స్థానిక పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా ఒక మహిళ పనిచేస్తుంది. ఆమె భర్త అబిద్ కూడా మీరట్ పోలీస్ లైన్స్‌లో పోలీసుగా విధులు నిర్వర్తిస్తున్నాడు. బాధితురాలి మామ నజీర్.. ఘజియాబాద్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. కాగా.. బుధవారం రాత్రి బాధితురాలి భర్త డ్యూటీలో ఉండగా.. ఆమె ఇంట్లో ఒంటరిగా ఉంది. అది గమనించిన నజీర్.. కోడలిపై అత్యాచారం చేశాడు. పైగా ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. మరుసటి ఇంటికొచ్చిన భర్తకు జరిగిన విషయాన్ని బాధితురాలు చెప్పింది. అయితే భార్యకు అండగా ఉండాల్సిన అబిద్.. భారత్‌లో నిషేధించబడిన ట్రిపుల్ తలాక్ ద్వారా విడాకులిచ్చాడు.

దాంతో మనస్థాపానికి గురైన బాధితురాలు.. కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో భర్త, మామపై ఫిర్యాదు చేసింది. తనపై మామ అత్యాచారం చేయడమే కాకుండా.. పెళ్లైనప్పటి నుంచి అదనపు కట్నం కోసం అత్తతో కలిసి వేధిస్తున్నాడని తన ఫిర్యాదులో పేర్కొంది. దాంతో బాధితురాలి భర్త, అత్తామామలపై కేసు నమోదు చేసినట్లు ఎస్పీ వినీత్ భట్నాగర్ తెలిపారు.