- అరుదైన ఆపరేషన్ చేసిన నిర్మల్ కు చెందిన డాక్టర్లు
నిర్మల్, వెలుగు: డెంగ్యూతో ట్రీట్ మెంట్ తీసుకుంటున్న గర్భిణికి డాక్టర్లు సురక్షితంగా కాన్పు చేయగా కవలలకు (పాప, బాబు) జన్మనిచ్చింది. ఇది అరుదైన ఘటనని డాక్టర్లు పేర్కొన్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం సోంపల్లికి చెందిన నిండు గర్భిణి ఉష డెంగ్యూతో బాధపడుతూ ఈనెల 6న నిర్మల్ లోని రోషిణి ఆస్పత్రిలో చేరింది. ఆమెకు ప్లేట్ లెట్స్ తగ్గిపోవడం, బీపీ డౌన్, ఊపిరితిత్తుల్లో నీరు చేరడంతో పాటు ఉమ్మ నీరు లేకపోవడం వంటి లక్షణాలతో కండీషన్ సీరియస్ గా మారింది. అప్పటికే పలు ఆస్పత్రుల్లో ట్రీట్ మెంట్ చేయించుకున్నా నయం కాకపోగా కుటుంబ సభ్యులు రోషిణి ఆస్పత్రికి తీసుకెళ్లారు.
అక్కడ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ డాక్టర్ల టీమ్ భరోసా కల్పించి గర్భిణికి ట్రీట్ మెంట్ చేసేందుకు ముందుకు వచ్చింది. ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ సుమలత టీమ్ పర్యవేక్షనలో ఐసీయూలో ఉంచి గర్భిణికి ఈనెల 15న ఆపరేషన్ ద్వారా కాన్పు చేయగా కవలలు పుట్టారు. బాలింతతో పాటు పిల్లలు పూర్తి ఆరోగ్యంగా ఉండడంతో మంగళవారం డిశ్చార్జ్ చేసినట్టు డాక్టర్ల టీమ్ తెలిపింది. సురక్షితంగా డెలివరీ చేసిన డాక్టర్ల టీమ్ ను ఉష కుటుంబసభ్యులు, బంధువులు అభినందించారు.
