
- మట్టుబెట్టిన అమెరికా బలగాలు
- నెలరోజుల కిందట జరిగిన
- బాంబు దాడుల్లో మృతి
- ‘టెలిగ్రామ్’ ద్వారా వెల్లడించిన ఓ ఐసిస్ లీడర్
ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్).. ప్రపంచమంతా ఖలీఫా సామ్రాజ్యాన్ని స్థాపించాలన్న లక్ష్యంతో ఏర్పాటైన సంస్థ. ప్రపంచవ్యాప్తంగా కొన్నాళ్లు బీభత్సం సృష్టించింది. ఇరాక్, సిరియాల్లో పలు ప్రాంతాలను ఆక్రమించింది. కానీ అమెరికా, ఇతర దేశాల భద్రతా దళాల దెబ్బకు ఐసిస్ రాజ్యం క్రమంగా కూలిపోయింది. అయితే ఇటీవల ఇండియాలో ఈ సంస్థ అలికిడి వినిపిస్తోంది. తమ ప్రావిన్స్ ను ఇండియాలో ఏర్పాటు చేశామని ప్రకటించి అలజడి రేపింది. ఈ క్రమంలో ఐసిస్ కేరళ మాడ్యూల్ లీడర్ రషీద్ అబ్దుల్లా ఉనికి భయాందోళనకు గురిచేసింది. అయితే అతడు హతమైనట్లు తెలిసింది. నెలరోజుల కిందట అమెరికా బలగాలు అఫ్ఘనిస్థాన్‌లో మట్టుబెట్టినట్లు రిపోర్టులు వెలువడ్డాయి.
అనుకోకుండా బాంబులేస్తే..
అఫ్ఘాన్‌లోని ఖోరసన్ ప్రావిన్స్‌లో పని చేస్తున్న ఓ ఐసిస్ సభ్యుడి ద్వారా అబ్దుల్లా హతమైన విషయం తెలిసింది. ‘టెలిగ్రామ్’ చాట్ ద్వారా ఓ పోలీసు అధికారి అడిగిన పలు ప్రశ్నలకు అతడు సమాధానాలిచ్చాడు. రషీద్ అబ్దుల్లాకు ఏమైందో వివరిస్తూ.. ‘అతడు ఇక లేడు’ అని చెప్పాడు. ఎలా చనిపోయాడని ప్రశ్నించగా.. అమెరికన్లు బాంబు దాడులు చేశారని, రెండు కుటుంబాలు చనిపోయాయని చెప్పాడు. అందులో ముగ్గురు పురుషులు, ఇద్దరు మహిళలు, నలుగురు పిల్లలు ఉన్నారని, వీరంతా ఇండియన్లేనని తెలిపాడు. బాంబు దాడులు టెర్రిరస్టులు టార్గెట్‌గా చేసినవి కాదని, యాదృచ్ఛికంగా వదిలారని చెప్పాడు.
2016లో 21 మందిని..
ఇండియాకు చెందిన వారిని ఐసిస్‌లో చేర్పించేవాడు అబ్దుల్లా. అలా 2016 మే నెలలో కేరళకు చెందిన 21 మందిని ఆఫ్గానిస్థాన్‌కు పంపాడు. అందులో అతడి భార్య ఆయేషా కూడా ఉంది. అంతకుముందు కోజికోడ్‌లోని పీస్ ఇంటర్నేషనల్ స్కూల్లో టీచర్‌గా పని చేసిన అబ్దుల్లా, ఐసిస్ పట్ల ఆకర్షితుయ్యాడు. తర్వాత తన టీమ్‌లోని సభ్యులను మోటివేట్ చేశాడు. ఇండియాను వదిలి వెళ్లి ఐసిస్ లో చేరుదామని ప్రేరేపించాడు.
ఇతర మతాల నుంచి కూడా..
తన ప్రసంగాలతో రాడికలైజ్డ్ ముస్లింలతోపాటు ఇతర మతాల ప్రజలను కూడా ఇస్లామిక్ ఉగ్రవాదం వైపు నడిపించడంలో అబ్దుల్లా సమర్థుడని పేరు. తన భార్య ఆయేషాను కూడా అలానే ప్రేరేపించాడు. పెళ్లికి ముందు వరకు ఆయేషా క్రిస్టియన్. ఎర్నాకుళంలో ఇంజనీరింగ్, బెంగళూరులో ఎంబీఏ పూర్తి చేసింది. ఇక కాసర్గోడ్ జిల్లాకు చెందిన 15 మందిని ఐసిస్ కోసం రిక్రూట్ చేసుకుందన్న అభియోగాలతో 2018లో అబ్దుల్లా రెండో భార్య యాస్మిన్ నుఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. బీహార్‌కు చెందిన 30 ఏళ్ల యాస్మిన్ కు కేరళ కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది.
ఆడియో క్లిప్పుల ద్వారా..
ఆఫ్గానిస్థాన్‌లో ఉంటున్న అబ్దుల్లా.. టెలిగ్రామ్ యాప్ ద్వారా ఆడియో క్లిప్పులను పంపేవాడు. ఐసిస్‌లో చేరాలంటూ ప్రేరేపించేవాడు. కేరళలో టెర్రర్ అటాక్స్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారన్న సమాచారంతో గత ఏప్రిల్‌లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) 29 ఏళ్ల రియాజ్ అబూ బకర్‌ను అరెస్టు చేసింది. రషీద్ అబ్దుల్లాతో తను చాలాకాలంగా ఆన్లైన్లో టచ్‌లో ఉన్నట్లు అతడు ఎన్ఐఏ విచారణలో ఒప్పుకున్నాడు. రషీద్ ఆడియోలను ఫాలో అవుతున్నట్లు చెప్పాడు