ఐదేండ్ల పిల్లలకూ రేషన్​ కార్డులు

ఐదేండ్ల పిల్లలకూ రేషన్​ కార్డులు
  • నిజామాబాద్​ జిల్లాలో ఆఫీసర్ల నిర్వాకం
  • ఫీల్డ్ ఎంక్వైరీ లేకుండా ఎడాపెడా కార్డులు
  • విషయం బయటకు రావడంతో దిద్దుబాటు ప్రయత్నాలు 
  • తప్పులు జరిగితే కార్డులు రద్దు చేస్తామన్న ఆఫీసర్లు

నిజామాబాద్, వెలుగు: చిన్నోళ్ల శృతిక... నందిపేట మండలం తల్వేద గ్రామానికి చెందిన ఐదేళ్ల చిన్నారి. ఆమె నలుగురు సభ్యులున్న  కుటుంబానికి పెద్ద. ఆమె పేరిట రేషన్​ కోసం అప్లై చేసుకుంటే ఇటీవల సాంక్షన్​ చేశారు.  ఇదే గ్రామంలో మరో ఐదుగురు చిన్నారులను ‘ హెడ్​ ఆఫ్​ ఫ్యామిలీ’గా పేర్కొంటూ మండల అధికారులు రేషన్​ కార్డులు ఇచ్చేశారు. చిన్నారుల పేర్లమీదే కాకుండా ఊళ్లో  బిల్డింగులు, కార్లు, భారీగా ఆస్తులు ఉన్న సంపన్నులకు కూడా జంకూ గొంకూ లేకుండా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఇచ్చే రేషన్​ కార్డులను జారీ చేసేశారు.  

నిజామాబాద్​, కామారెడ్డి జిల్లాల్లో రేషన్​కార్డుల జారీలో చాలా అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు వస్తున్నాయి. చిన్న పిల్లల పేరిట కార్డులిచ్చిన అంశం బయటకు రావడంతో అధికారులు దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. తహశీల్దారు ఆఫీసులోని రికార్డుల్లో సవరణలు చేస్తున్నారు.  ఒక్క తల్వెద గ్రామంలోనే ఆరుగురు చిన్నారులతో సహా 28 మంది అనర్హులకు కార్డులు జారీ అయ్యాయని తెలుస్తోంది. ఇంకా ఇలాంటి అక్రమాలు చాలా జరిగి ఉంటాయన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.   ఫీల్డ్​లెవల్​లో సరిగా ఎంక్వైరీ  చేయకపోవడంవల్ల చాలావరకు పొరపాట్లు జరిగాయి.  సర్వే చేసిన సిబ్బంది ‘నాట్​ ఎలిజిబుల్​’ అని పేర్కొన్న వారికి కూడా  లోకల్​ లీడర్ల ఒత్తిళ్లతో మండలస్థాయి అధికారులు కార్డులు జారీ చేశారు. దీంతో ఇటీవల జరిగిన రేషన్​ కార్డుల పంపిణీమీద దుమారం చెలరేగుతోంది.   కొంతమంది కావాలనే మైనర్లను కుటుంబపెద్దగా పేర్కొంటూ కార్డుల కోసం అప్లై చేసుకున్నట్టు చెప్తున్నారు. తల్లిదండ్రుల పేరు మీద ఆస్తులుండడవల్ల తమ అప్లికేషన్లు రిజెక్టవుతాయికాబట్టి.. ముందు జాగ్రత్తగా పిల్లల పేర దరఖాస్తు చేసినట్టు భావిస్తున్నారు. 

నిజామాబాద్​, కామారెడ్డి జిల్లాల్లో కుటుంబాల కన్నా కార్డుల సంఖ్య ఎక్కువగా ఉండడం ఇప్పటికే వివాదంగా మారింది. ఉమ్మడి కుటుంబాలనుంచి విడిపోయిన వారికి, పనులకోసం  ఇతర ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడిన వారికి కార్డులు ఇచ్చామని, దీనివల్ల కుటుంబాల కన్నా కార్డులు ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తోందని అధికారులు సమర్ధించుకుంటున్నారు. అయితే తేడా ఎక్కువగా ఉండడంవల్ల బోగస్​ కార్డులున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.  నిజామాబాద్ జిల్లాలో   3 లక్షల 40 వేల  కుటుంబాలు నివసిస్తుండగా ఇప్పటికే 3 ,90,393   కార్డులున్నాయి. కొత్తగా ఇటీవల 16,527 కార్డులు శాంక్షన్​ చేశారు. దీంతో జిల్లాలో కార్డుల సంఖ్య 4,06,920కు చేరింది. కామారెడ్డి జిల్లాలో దాదాపు రెండు లక్షల కుటుంబాలుండగా.. ఇప్పటికే 2,30,737  కార్డులు  ఉన్నాయి. కొత్తగా మరో 6,740 కార్డులు ఇచ్చారు.  అనర్హులకు రేషన్ కార్డులను తొలగించాలని, అర్హులకు మాత్రమే కార్డులు ఇవ్వాలని పబ్లిక్​ కోరుతున్నారు.

తప్పులు జరిగితే కార్డులు రద్దు చేస్తాం
మైనర్ల పేరుతో మంజూరైన వాటితో పాటు అనర్హుల కార్డులను రద్దు చేస్తాం. బీపీఎల్​ ఫ్యామిలీలకు మాత్రమే రేషన్​కార్డులు మంజూరు చేశాం. అనర్హులకు కార్డులు మంజూరయ్యాయన్న ఆరోపణలపై పూర్తిస్థాయి విచారణ జరిపిస్తాం. 
-అనిల్ కుమార్, తహశీల్దార్, నందిపేట్