మరో.. 15,249 మందికి రేషన్ నెల నెలా పెరుగుతున్న కార్డులు

మరో.. 15,249 మందికి రేషన్ నెల నెలా పెరుగుతున్న కార్డులు
  • అక్టోబర్​లో పెరిగిన కార్డులు ​5,186
  • పెరిగిన రేషన్​ కోటా 93 టన్నులు
  • ఉమ్మడి జిల్లాలో  11,47,560 కార్డులు
  • నవంబర్ బియ్యం కోటా.. 22,007 టన్నులు

యాదాద్రి, వెలుగు:  అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్​ కార్డులు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం తన మాట నిలుపుకుంటోంది. ఇచ్చిన మాట ప్రకారం వేగంగా కార్డులు జారీ చేస్తోంది. కార్డు కావాలని అప్లికేషన్​ వచ్చిందంటే.. ఆఫీసర్లు పరిశీలించి అర్హులైతే చాలు ఓకే చేసేస్తున్నారు. దీంతో ప్రతి నెల బియ్యం కోటా పెరుగుతోంది. కొత్తగా లక్షల మందికి రేషన్​ అందిస్తున్నారు. 

ప్రతి నెల కొత్త రేషన్​ కార్డుల జారీ 

పదేండ్లు అంటే 2023 వరకూ పవర్​లో ఉన్న బీఆర్​ఎస్​ సర్కారు.. కొత్త రేషన్​ కార్డుల జారీ, మెంబర్స్​ను యాడ్​ చేయడాన్ని పట్టించుకోలేదు. అన్ని స్కీమ్స్​కు రేషన్​కార్డు కచ్చితం కావడంతో అనేకమంది ఇబ్బందులకు గురయ్యారు. కాంగ్రెస్ సర్కారు పవర్​లోకి రాగానే ముందుగా వీటిపైనే దృష్టి సారించి, అప్లికేషన్లను స్వీకరించింది. ఫిబ్రవరి నుంచి ప్రతి నెల కొత్త కార్డులను జారీ చేయడం ప్రారంభించింది. 

ఒక్కో నెలలో వేలల్లో కార్డులు

ప్రతీ నెలలో వేల సంఖ్యలో కొత్త రేషన్​ కార్డులను జారీ చేస్తున్నారు. జనవరి 2025లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో 10,06,994 కుటుంబాలకు రేషన్​ కార్డులు ఉన్నాయి. 29,82,579 మంది మెంబర్లున్నారు. ఈ విధంగా అక్టోబర్​ 23 నాటికి అంటే 9 నెలల్లో 1,40,566  కుటుంబాలకు కొత్త రేషన్​ కార్టులను జారీ చేసింది. దీంతో మొత్తం కార్డుల సంఖ్య 11,47,560 చేరగా, ఈ కార్డుల్లో 34,66,221    మెంబర్లుగా ఉన్నారు. 

 ప్రతి నెల కార్డులు పెంచినట్టుగానే అక్టోబర్ నెలలో ​5,186 కొత్త కార్డులు జారీ అయినట్టు సివిల్​ సప్లయ్​ డిపార్ట్​మెంట్ 'డైనమిక్​ కీ రిజిస్ట్రర్'​ (డీకేఆర్​) లెక్కలు చెబుతున్నాయి. ఈ కార్డుల్లో 15,249 మంది మెంబర్లు చేర్చడంతో ఈ నెల నుంచి వారందరికీ రేషన్ అందనుంది.  దీంతో నవంబర్​ రేషన్​ కోటా కింద 22,007 టన్నుల బియ్యాన్ని కేటాయించారు. ఈ లెక్కన అక్టోబర్​ కోటా కంటే నవంబర్​లో 93 టన్నుల బియ్యాన్ని అదనంగా కేటాయించినట్టయింది. కాగా రాష్ట్ర వ్యాప్తంగా 1,02,95,193 కార్డులు ఉన్నాయి. 

ఉమ్మడి జిల్లాలో గడిచిన మూడు నెలలుగా కార్డులు, మెంబర్ల సంఖ్య, బియ్యం కోటా

నెల    కార్డులు    యూనిట్లు    బియ్యం కోటా

సెప్టెంబర్​    11,28,359    34,16,159    21,698
అక్టోబర్​       11,42,374    34,50,972    21,914
నవంబర్​    11,47,560    34,66,221    22,007