
- ఉమ్మడి జిల్లాలో 11,28,359 కార్డులు..
- 34,16,159 మంది మెంబర్లు
- సెప్టెంబర్‌లో 21,699 టన్నుల బియ్యం
యాదాద్రి, నల్గొండ, వెలుగు : మూడు నెలల తర్వాత నేటి నుంచి మళ్లీ బియ్యం పంపిణీ ప్రారంభమవుతోంది. జూన్20 తర్వాత నుంచి మంజూరు చేసిన రేషన్ కార్డులకు ఈ నెలలో బియ్యం ఇస్తారు. జూన్‌లోనే ఒకేసారి మూడు నెలల బియ్యం పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. ఈసారి కొత్త రేషన్ కార్డులతోపాటు కొత్తగా మెంబర్లుగా ఆడ్ అయిన వారికి కూడా బియ్యం పంపిణీ చేయనున్నారు. కొత్తగా మెంబర్లు పెరగడంతో గతంలో కంటే ఈసారి ఎక్కువగా బియ్యాన్ని ప్రభుత్వం అలాట్మెంట్ చేసింది.
99,129 కొత్త కార్డులకు బియ్యం..
ప్రతినెలా డైనమిక్ కీ రిజిస్ట్రర్ (డీకేఆర్) జనరేట్ చేసే సమయానికి పెరిగిన, తరిగిన కార్డులు, మెంబర్ల ప్రకారమే బియ్యం కోటా అలాట్చేస్తారు. జనవరి 2025 వరకు ఉమ్మడి జిల్లాలో 10,06,994 కార్డులు, 29,82,579 మంది మెంబర్లు ఉన్నారు. వీరికోసం 19,070 టన్నుల బియ్యం పంపిణీ జరిగేది. ఫిబ్రవరి 2025 నుంచి రేషన్ కార్డుల లబ్ధిదారుల ఎంపిక నడుస్తోంది. మే 25 నాటికి 10,29,230 రేషన్ కార్డులకు చేరగా, జూన్‌లో వారందరికీ మూడు నెలల కోటా బియ్యం అందించారు. ఆ తర్వాత మే 25 నుంచి ఆగస్టు 20 వరకు కొత్తగా 99,129 కుటుంబాలకు కొత్త కార్డులు మంజూరు చేశారు. దీంతో ఉమ్మడి జిల్లాలో రేషన్ కార్డుల సంఖ్య 11,28,359కు చేరింది. రేషన్కార్డుల్లోమొత్తంగా 34,16,159 మంది మెంబర్లుగా ఉన్నారు.
వీరందరికీ పంపిణీ చేయడానికి 21,699 టన్నుల బియ్యం అలాట్ చేశారు. సోమవారం నుంచి లబ్ధిదారులకు రేషన్‌బియ్యం పంపిణీ చేయనున్నారు. కాగా ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు 1,21,365 కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు జారీ చేశారు. కొత్త కార్డులతోపాటు పాత కార్డుల్లో కొత్తగా 4,33,580 మెంబర్లను ఆడ్ చేశారు.