పులికి దగ్గరగా వెళ్లిన రవీనా టాండన్.. విచారణ చేపట్టిన అధికారులు

పులికి దగ్గరగా వెళ్లిన రవీనా టాండన్.. విచారణ చేపట్టిన అధికారులు

నటి రవీనా టాండన్ సఫారీ సమయంలో పులికి దగ్గరగా వెళ్లినట్టు వస్తున్న ఆరోపణలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. నవంబర్ 22న మధ్యప్రదేశ్‌లోని నర్మదాపురం జిల్లాలో ఉన్న సత్పురా టైగర్ రిజర్వ్ ను సందర్శించిన రవీనా టాండన్.. తన ఎక్స్ పీరియన్స్ ను షేర్ చేస్తూ, పర్యటనకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. అందులో రవీనా టాండన్ కు చేరువలోనే పులి ఉన్న ఓ వీడియో ఉండడంతో అధికారులు స్పందించారు. ఈ వీడియోలో ఆమె పులి కదలికలను కెమెరాలో షూట్ చేయడాన్ని గమనించవచ్చు.

ఈ ఘటనపై వాహన డ్రైవర్‌కు, విధుల్లో ఉన్న అధికారులకు నోటీసులు అందజేసి విచారిస్తామని సత్పురా టైగర్ రిజర్వ్ అధికారులు తెలిపారు. సీనియర్ అధికారుల ఆదేశాల మేరకు ఈ ఘటనపై విచారణ ప్రారంభించినట్లు ఫారెస్ట్ సబ్ డివిజనల్ ఆఫీసర్ (SDO) ధీరజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. తదుపరి చర్యల కోసం విచారణ నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామన్నారు.