Ravichandran Ashwin: అందుకే అశ్విన్‌ది మాస్టర్ మైండ్.. ఐపీఎల్ రిటైర్మెంట్‌కు కారణం అదే!

Ravichandran Ashwin: అందుకే అశ్విన్‌ది మాస్టర్ మైండ్.. ఐపీఎల్ రిటైర్మెంట్‌కు కారణం అదే!

టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బుధవారం (ఆగస్ట్ 27) ఐపీఎల్‎కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ మెగా టోర్నీలో వన్ ఆఫ్ ది సక్సెస్ ఫుల్ బౌలర్ గా నిలిచిన అశ్విన్ మొత్తం ఐదు జట్ల తరపున 187 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. గత ఏడాది చివర్లో అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన ఈ ఆఫ్ స్పిన్నర్.. ఈ రోజు ఐపీఎల్ కు గుడ్ బై చెప్పాడు. అశ్విన్ తన రిటైర్మెంట్ ప్రకటించడంలో కూడా తన మాస్టర్ మైండ్ ఉపయోగించాడు. 

38 ఏళ్ల అశ్విన్ పదేళ్ల విరామం తర్వాత 2025లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో చేరాడు. ఎన్నో అంచనాలతో మెగా ఆక్షన్ లోకి అడుగుపెట్టిన అశ్విన్ ను చెన్నై రూ. 9.75 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. లోకల్ ప్లేయర్ కావడంతో ఈ వెటరన్ స్పిన్నర్ పై సీఎస్కె యాజమాన్యం ఎన్నో అంచనాలు పెట్టుకుంది. అయితే ఐపీఎల్ 2025లో అశ్విన్ ఘోరంగా విఫలమయ్యాడు. తొమ్మిది మ్యాచ్‌ల్లో మాత్రమే ఆడి 9.13 ఎకానమీ రేటుతో ఏడు వికెట్లు మాత్రమే తీసుకున్నాడు. బ్యాటింగ్‌లోనూ రాణించింది లేదు. ఐపీఎల్ 2026 సీజన్ లో అశ్విన్ ను రిలీజ్ చేయడం ఖాయమనే హింట్స్ చెన్నై జట్టు నుంచి అందాయి. 

ఒకవేళ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నుంచి విడిపోయి 2026 మినీ ఆక్షన్ లోకి వచ్చినా ఏ ఫ్రాంచైజీ అశ్విన్ పై ఆసక్తి చూపించకపోవచ్చు. వేలంలో ఒకసారి కొనుగోలు చేయకపోతే 38 ఏళ్ళ అశ్విన్ ఐపీఎల్ కెరీర్ ముగిసినట్టే. ఈ పరిస్థితిని ముందుగానే ఊహించిన అశ్విన్.. తనకు తానుగా గౌరవంగా తప్పుకున్నాడు. అశ్విన్ ఐపీఎల్ ప్రయాణం చెన్నై సూపర్ కింగ్స్‌తో ప్రారంభమైంది. తన కెరీర్ కూడా చెన్నైతో ముగించాలని భావించాడు. మొత్తానికి తప్పిస్తారని ముందుగానే ఊహించిన అశ్విన్.. తన మాస్టర్ మైండ్ తో ముందుగానే ఐపీఎల్ కు గుడ్ బై చెప్పాడు. 

►ALSO READ | Women’s ODI World Cup 2025: వన్డే వరల్డ్ కప్ 2025.. ఫైనల్‌కు చేరే జట్లేవో చెప్పిన మిథాలీ

2009 నుండి 2015 వరకు ఆరు సీజన్లు  సీఎస్కె జట్టు తరపున  ఆడాడు. 2016 నుంచి 2024 మధ్య ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్‌ ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించాడు. 2025లో చెన్నై జట్టులోకి వచ్చాడు. అశ్విన్ ఐపీఎల్ కెరీర్ విషయానికి వస్తే 220 మ్యాచ్‌ల్లో 7.29 ఎకానమీ రేటుతో 187 వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్ లోనూ సత్తా చాటి 118 స్ట్రైక్ రేట్‌తో 833 పరుగులు చేశాడు. 2025 ఐపీఎల్ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్ కు సాధించడంలో విఫలమైంది.