చెన్నై టీమ్ నుంచి జడేజా తప్పుకోనున్నాడా..?

చెన్నై టీమ్ నుంచి జడేజా తప్పుకోనున్నాడా..?

చెన్నై సూపర్ కింగ్స్..ఐపీఎల్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్. ఈ విజయాల్లో కెప్టెన్ ధోని పాత్ర ఎంత ఉందో..ఆల్ రౌండర్ జడేజా పాత్ర కూడా అంతే ఉందని చెప్పాలి. ముఖ్యంగా జడేజా అయితే ఎన్నో సార్లు ఒంటి చేత్తో మ్యాచులను గెలిపించిన సందర్భాలున్నాయి. నిజానికి జడేజా సొంత రాష్ట్రం గుజరాత్ అయినా..ఐపీఎల్ లో చెన్నై తరపున ఆడుతూ..చెన్నైనే తన సొంతూరుగా మార్చేసుకున్నాడు. అందుకే జడేజా అంటే చెన్నై అభిమానులకు విపరీతమైన ప్రేమ. కానీ ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ కు జడేజా దూరమవుతున్నట్లు తెలుస్తోంది. 

2021 సీజన్ వరకు చెన్నై జట్టుకు ఆల్ రౌండర్ గా సేవలు అందించిన జడేజా..2022 సీజన్ లో ప్రమోషన్ పొంద కెప్టెన్ అయ్యాడు. ధోని నుంచి సారథ్య బాధ్యతలను అందుకున్నాడు. అయితే కెప్టెన్నీలో అనుభవం లేక..తీవ్ర ఒత్తిడితో కెప్టెన్ గా, ఆటగాడిగా విఫలమయ్యాడు. దీంతో కెప్టెన్సీ నుంచి తప్పుకుని తిరిగి ధోనికే పగ్గాలు అందించాడు. ఆ తర్వాత గాయంతో సీజన్ మొత్తానికే దూరమయ్యాడు. అటు ఈ సీజన్ లో చెన్నై దారుణ ఓటములను చవిచూసింది. ఎన్నడూ లేని విధంగా 9వ స్థానంలో నిలిచింది. 


  
జడేజా కెప్టెన్సీ చేపట్టాక చెన్నై జట్టు దారుణ ఓటములు చవిచూసింది. దీంతో జడేజాపై విమర్శలు పెరిగిపోయాయి. కెప్టెన్ గా జడేజా పనికిరాడంటూ విమర్శించడం మొదలు పెట్టారు. కెప్టెన్సీ వల్ల ఆటగాడిగా కూడా జడేజా విఫలమయ్యాడని అతనిపై ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. ఫ్యాన్స్ విమర్శలు, జట్టు వైఫల్యాల వల్ల ధోని, టీమ్ మేనేజ్ మెంట్ తో విభేదాలు వచ్చినట్లు అప్పట్లు వార్తలు వచ్చాయి. అందుకే జడేజాను కెప్టెన్సీ నుంచి తప్పించారని గుసగుసలాడుకున్నారు. జడేజా కూడా టీమ్ వాట్సాప్ గ్రూప్ నుంచి ఎగ్జిట్ అవడంతో ఈ వార్తలకు బలం చేకూరింది. ఈ వార్తలను టీమ్ మేనేజ్ మెంట్ ఖండించింది. 

తాజాగా జడేజా చెన్నై సూపర్ కింగ్స్ కు సంబంధించిన పోస్టులు డిలీట్ చేయడం చర్చనీయాంశమైంది. ఇన్ స్టాలో సీఎస్కే పోస్టులను జడేజా తీసేశాడు. దీంతో మరోసారి చెన్నై జట్టుకు, జడేజాకు మధ్య విభేదాలు వచ్చాయన్న వార్తలు గుప్పుమంటున్నాయి. చెన్నై జట్టుతో జడేజా తెగదెంపులు చేసుకున్నాడు కాబట్టే..ఆ టీమ్ పోస్టులను డిలీట్ చేశాడని అభిమానులు చర్చించుకుంటున్నారు. వచ్చే ఏడాది జడేజా చెన్నై తరపున బరిలోకి దిగడం కష్టమే అని చెప్పుకుంటున్నారు. అయితే నిజంగా జడేజా చెన్నైకు గుడ్ బై చెప్పాడా..అనేది అధికారికంగా ప్రకటించే వరకు వేచి చూడాల్సిందే.