
చెన్నై: ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్‌తో ఉన్న పదేళ్ల బంధాన్ని ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అధికారికంగా తెంచుకున్నాడా? అంటే అవుననే సమాధానమే వస్తున్నది. ఈ ఏడాది మేలో ఐపీఎల్ ముగిసిన తర్వాత జడ్డూ, ఫ్రాంచైజీ మేనేజ్‌మెంట్‌తో కనీసం ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో కూడా టచ్‌లో లేడని సమాచారం. ఐపీఎల్ ఉన్నా లేకపోయినా.. ఏడాది మొత్తం తమ ప్లేయర్లతో టచ్‌లో ఉండటం సీఎస్‌కే సాంప్రదాయంగా పాటిస్తున్నది. కానీ జడ్డూ విషయంలో దీనికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు.
ఇక జడేజా కూడా ఫ్రాంచైజీతో అంటీముట్టనట్లుగానే వ్యవహరిస్తున్నాడు. పక్కటెముకల గాయంతో టీమిండియాకు దూరమైన జడ్డూ.. ఎన్‌సీఏలో రిహాబిలిటేషన్ తీసుకున్నాడు. ఈ గాయం గురించిన సమాచారాన్ని ఫ్రాంచైజీతో పంచుకోలేదు. అలాగే ఐపీఎల్ ట్రేడింగ్ విండో, మిగతా టీమ్స్ ఆఫర్స్ గురించి ఆరా తీస్తున్నట్లు క్రికెటర్ వర్గాలు వెల్లడించాయి. కెప్టెన్సీ నుంచి తొలగించిన తర్వాత మనస్తాపానికి గురైన జడేజా.. సీఎస్‌కేతో ఉన్న బంధాన్ని తెంచుకోవాలని భావించాడు. ఇందులో భాగంగా సోషల్ మీడియాలో ఫ్రాంచైజీకి సంబంధించిన సమాచారాన్ని తీసేశాడు.