జడ్డూను ఐదో ప్లేస్‌‌లో బ్యాటింగ్‌‌కు దించాలి

జడ్డూను ఐదో ప్లేస్‌‌లో బ్యాటింగ్‌‌కు దించాలి

ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌‌ను టీమిండియా ఘనంగా ఆరంభించింది. తొలి మ్యాచ్‌‌లో 11 రన్స్ తేడాతో జయభేరి మోగించింది. తొలుత కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా బ్యాటింగ్‌‌లో రాణించగా.. బౌలింగ్‌‌లో కంకషన్ సబ్‌‌స్టిట్యూట్‌‌గా వచ్చిన చాహల్, నటరాజన్ చెరో మూడు వికెట్లతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా జడేజా ఆడిన తుఫాన్ ఇన్నింగ్స్‌‌తో భారత్ మంచి స్కోరు చేయగలిగింది. ఈ నేపథ్యంలో జడేజా బ్యాటింగ్‌‌పై వెటరన్ ఓపెనర్ గౌతం గంభీర్ స్పందించాడు. జడ్డూను నంబర్.5లో పంపాల్సిన తరుణం ఆసన్నమైందన్నాడు.

‘జడేజా ఐదో పొజిషన్‌‌లో బ్యాటింగ్ చేయాలి. ఎందుకంటే నంబర్.4లో రాహుల్ బ్యాటింగ్ చేస్తాడు. విరాట్ మూడో స్థానంలో, జడ్డూ ఐదో ప్లేస్‌‌లో, పాండ్యా ఆరో డౌన్‌‌లో బ్యాటింగ్‌‌కు దిగాలి. మరో ఆల్‌‌రౌండర్‌‌ ఉంటే ఏడో పొజిషన్‌‌లో ఆడించొచ్చు. జడేజా ఫామ్‌‌ను వాడుకోవాలి. నా పాయింట్ చాలా సింపుల్.. ఎవర్నయినా ఏడో స్థానంలో బ్యాటింగ్ చేయిస్తే వాళ్లు ఆ పొజిషన్‌‌కు తగ్గట్లే ఆడతారు. అదే అతడ్ని నంబర్ 4లోనో లేదా 5లోనో బ్యాటింగ్‌‌కు దింపితే అందుకు తగ్గట్లే ఆడతారు. చాలా మంది విషయంలో ఇలాగే జరిగింది. ఏ బ్యాట్స్‌‌మన్‌‌తో అయినా ఓపెనింగ్ చేయించండి. వాళ్లు తాను ఓపెనర్ అనే దృక్పథంతోనే బ్యాటింగ్ చేస్తాడు. జడేజాకు ఐదో ప్లేస్‌‌లో ఆడే సత్తా ఉంది. అతడు టెస్టుల్లో ఓ సెంచరీ కూడా కొట్టాడు. వైట్ బాల్ క్రికెట్‌‌లో అన్ని పరిస్థితుల్లోనూ రన్స్ చేశాడు. అలాంటి జడ్డూను ఐదో పొజిషన్‌‌లో ఎందుకు ఆడించరు. దీని వల్ల ఆరో బౌలర్‌‌ను ఆడించొచ్చు. లెఫ్టార్మ్ స్పిన్నర్లు క్రునాల్ పాండ్యా, అక్షర్ పటేల్ లాంటి వారినీ ఆరో బౌలర్‌‌గా తీసుకునే వెసులుబాటు ఉంటుంది’ అని గంభీర్ పేర్కొన్నాడు.