క్రిప్టోపై మనమే రైట్‌.. 3 శాతం మంది దగ్గరే క్రిప్టో అసెట్స్‌‌‌‌

క్రిప్టోపై మనమే రైట్‌.. 3 శాతం మంది దగ్గరే క్రిప్టో అసెట్స్‌‌‌‌

న్యూఢిల్లీ: గ్లోబల్‌గా క్రిప్టో ఇన్వెస్టర్లు భారీగా నష్టపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇండియాలో చాలా తక్కువ మంది మాత్రమే క్రిప్టో సంక్షోభంలో చిక్కుకున్నారు. ఇండస్ట్రీ వర్గాల అంచనాల ప్రకారం కేవలం 3 శాతం మంది ఇన్వెస్టర్లు మాత్రమే క్రిప్టోల్లో ఇన్వెస్ట్ చేసి భారీ నష్టాన్ని చూశారు. క్రిప్టో కరెన్సీ దేశ ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదని ముందు నుంచి ఆర్‌‌బీఐ చెబుతోంది. ప్రభుత్వం స్టార్టింగ్‌లో  క్రిప్టో ఇండస్ట్రీని రెగ్యులేట్ చేయాలనుకున్నా,  గ్లోబల్‌గా అందరూ అమోదించే ఒక వ్యవస్థ ఉండాలని భావించింది. ఫలితంగా క్రిప్టో కరెన్సీల కోసం చట్టం తీసుకురాలేదు. బదులుగా వీటిపై 30 శాతం ట్యాక్స్‌ వేసింది. దీంతో దేశంలో క్రిప్టోలపై భారీగా డిమాండ్ తగ్గిందని చెప్పొచ్చు.

ఒకవేళ ప్రభుత్వమే క్రిప్టోలపై సానుకూలంగా ఉండి ఉంటే.. అంటే స్టాక్ మార్కెట్ బ్రోకర్‌‌ వంటి సంస్థలు  కూడా  క్రిప్టో ఇండస్ట్రీలోకి వచ్చి ఉంటే చాలా మంది ఇన్వెస్టర్లు ఈ డిజిటల్ కరెన్సీలలో  చిక్కుకుపోయేవారు.  పెరుగుతున్న వడ్డీ రేట్లు, మార్కెట్‌లో తగ్గుతున్న లిక్విడిటీ, క్రిప్టో ఇండస్ట్రీలో నెలకొన్న సమస్యల కారణంగా కిందటేడాది 3 ట్రిలియన్ డాలర్లు ఉన్న క్రిప్టో మార్కెట్ క్యాప్ ఈ ఏడాది ఒక ట్రిలియన్ డాలర్ల కిందకు పడిపోయింది.

క్రిప్టో ఎక్స్చేంజి ఎఫ్‌టీఎక్స్ ఫౌండర్ శామ్‌ బ్యాంకమన్‌–ఫ్రైడ్ సంపద మొత్తం (16 బిలియన్ డాలర్లు) తుడిచి పెట్టుకుపోయింది. ఎఫ్‌టీఎక్స్ డీల్ తర్వాత క్రిప్టో కరెన్సీలు మరింత పడుతున్నాయి. బిట్‌కాయిన్‌, ఎథీరియం వంటి పాపులర్ కరెన్సీలు కూడా తమ ఆల్‌టైమ్ హై నుంచి 75 శాతానికి పైగా పడ్డాయి. గ్లోబల్‌ క్రిప్టో ఎక్స్చేంజిలు  ఇబ్బంది పడుతున్నా లోకల్ క్రిప్టో ఎక్స్చేంజిలు అయిన వజీర్ ఎక్స్‌, జెబ్‌పే వంటి కంపెనీలు తమ కార్యకలాపాలను  ఎప్పటిలానే  కొనసాగిస్తున్నాయి.