మహేశ్‌‌ బ్యాంక్‌‌కు ఆర్బీఐ రూ.65 లక్షలు ఫైన్​

మహేశ్‌‌ బ్యాంక్‌‌కు ఆర్బీఐ రూ.65 లక్షలు ఫైన్​
  • దేశంలోనే తొలిసారి భారీ పెనాల్టీ​ వేసిన రిజర్వ్​ బ్యాంక్​

హైదరాబాద్‌‌, వెలుగు: సైబర్ సెక్యూరిటీ నిబంధనలు పాటించనందుకు దేశంలోనే తొలిసారి ఏపీ మహేశ్​ కో ఆపరేటివ్‌‌ బ్యాంక్‌‌కు ఆర్బీఐ రూ.65 లక్షలు జరిమానా విధించింది. ఇందుకు సంబంధించిన వివరాలను హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ శనివారం మీడియాకు వెల్లడించారు. గతేడాది జనవరి 24న ఏపీ మహేశ్​ కో -ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ సైబర్ హ్యాకింగ్‌‌ అయిన విషయం తెలిసిందే. బ్యాంక్‌‌లో పటిష్టమైన సెక్యూరిటీ సిస్టమ్‌‌ లేకపోవడంతో నైజీరియన్ హ్యాకర్లు రూ.12.48 కోట్లు కొల్లగొట్టారు. ఈ కేసును సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు ఎంక్వైరీ చేశారు. 14 రాష్ట్రాల్లో 100 మంది పోలీసులు సెర్చ్‌‌ ఆపరేషన్ చేశారు. క్యాష్​ను దేశవ్యాప్తంగా 398 అకౌంట్స్‌‌కి ట్రాన్స్‌‌ఫర్ చేసి.. 938 ఏటీఎంల ద్వారా విత్‌‌డ్రా చేసినట్లు ఆధారాలు సేకరించారు. నలుగురు నైజీరియన్స్‌‌తో పాటు హ్యాకింగ్​ గ్యాంగ్, కమీషన్​తో డబ్బులు విత్‌‌డ్రా చేసిన మరో 23 మందిని అరెస్టు చేశారు. కేసు ఎంక్వైరీకి మొత్తం రూ.58 లక్షలు ఖర్చు చేశారు. 

ఇన్వెస్టిగేషన్‌‌లో బయటపడిన బ్యాంక్ నిర్లక్ష్యం

మహేశ్ ​బ్యాంక్‌‌లో ఆర్బీఐ నిర్దేశించిన యాంటీ- ఫిషింగ్ అప్లికేషన్, హ్యాకింగ్‌‌ను నివారించే రియల్-టైమ్ థ్రెట్ డిఫెన్స్, మేనేజ్‌‌మెంట్ సిస్టమ్‌‌ వంటి సైబర్ సెక్యూరిటీ లేనందునే హ్యాకింగ్ జరిగినట్లు పోలీసులు గుర్తుంచారు.  ఇన్వెస్టిగేషన్‌‌లో బ్యాంక్ యాజమాన్యం నిర్లక్ష్యం బయటపడింది. సైబర్ ల్యాండ్‌‌ స్కేప్‌‌ను కాపాడేందుకు అవసరమైన బ్యాంక్ సైబర్ సెక్యూరిటీ ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌లో లోపాలు ఉన్నట్లు గుర్తించారు. దీనిపై సీపీ సీవీ ఆనంద్‌‌ ఆర్బీఐకి లెటర్ రాశారు. ఖాతాదారుల డబ్బుకు ముప్పు వాటిల్లే విధంగా బ్యాంక్ వ్యహరించిందని, బ్యాంక్ లావాదేవీలు నిలిపివేయాలని ఆర్బీఐ గవర్నర్‌‌‌‌ కు కంప్లైంట్​ చేశారు. దీంతో మహేశ్​బ్యాంక్‌‌కు ఆర్బీఐ రూ.65 లక్షలు జరిమానా విధించింది. సైబర్ సెక్యూరిటీ పాటించని బ్యాంకులకు ఫైన్​ విధించడం దేశంలోనే ఇది మొదటిసారి అని సీపీ తెలిపారు. అన్ని బ్యాంకులు సైబర్ సెక్యూరిటీని పాటించాలని సూచించారు.