ఫిన్​టెక్​ కంపెనీలకు స్వీయ నియంత్రణ తప్పనిసరి : ఆర్​బీఐ గవర్నర్​ దాస్​

ఫిన్​టెక్​ కంపెనీలకు స్వీయ నియంత్రణ తప్పనిసరి : ఆర్​బీఐ గవర్నర్​ దాస్​

ముంబై : తాము ఎదుర్కొంటున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు ఫిన్​టెక్​ కంపెనీలు స్వీయ నియంత్రణ సంస్థ (సెల్ఫ్​ రెగ్యులేటరీ ఆర్గనైజేషన్​) ఏర్పాటు చేసుకోవాలని రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా (ఆర్​బీఐ) గవర్నర్​ శక్తికాంత దాస్​ సూచించారు. ఫిన్​టెక్​ ఇండస్ట్రీ శరవేగంతో ఎదుగుతున్న నేపథ్యంలో ఇది తప్పనిసరని చెప్పారు. డిజిటల్​ పేమెంట్లు, డిజిటల్​గా తీసుకునే అప్పులు దేశంలో భారీగా పెరుగుతున్నాయని పేర్కొన్నారు.  ఫిన్​టెక్​ రంగంతో కలిసి పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని శక్తికాంత దాస్​ వెల్లడించారు.

బుధవారం జరిగిన  గ్లోబల్​ ఫిన్​టెక్​ఫెస్ట్​2023 కాన్ఫరెన్స్​లో ఆర్​బీఐ గవర్నర్​ మాట్లాడారు. ఫిన్​టెక్​ ఇండస్ట్రీలో ఉండే సమస్యలను సమర్ధంగా తెలియచెప్పడానికి ఈ సెల్ఫ్​ రెగ్యులేటరీ ఆర్గనైజేషన్​ వీలు కల్పిస్తుందని అన్నారు. అంతేకాకుండా, మొత్తం నియంత్రణభారమంతా రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా మీద పడకుండా ఉంటుందని పేర్కొన్నారు.

2024 లో జరిగే గ్లోబల్​ ఫిన్​టెక్​ ఫెస్ట్​ లోపు ఎస్​ఆర్​ఓ ఏర్పాటుకు చొరవ తీసుకుంటారనే ఆశాభావాన్ని శక్తికాంత దాస్​ వ్యక్తం చేశారు. 2030 నాటికి దేశంలోని ఫిన్​టెక్​ ఇండస్ట్రీ 200 బిలియన్​ డాలర్ల రెవెన్యూ మార్కును అందుకుంటుందని,  గ్లోబల్​ ఫిన్​టెక్ ​రెవెన్యూలో ఇది 13 శాతానికి సమానమవుతుందని ఆర్​బీఐ గవర్నర్​ చెప్పారు. 

2030 నాటికి ఫిన్​టెక్​ రెవెన్యూ 
1.5 ట్రిలియన్​ డాలర్లకు...

ఇండియాలో ఫిన్​టెక్​ ఇండస్ట్రీ పాత్ర రాబోయే రోజులలో మరింత ఎక్కువవుతుందని పేర్కొన్నారు. గ్లోబల్ ​ఫైనాన్షియల్​ సర్వీసెస్​ రెవెన్యూలో ప్రస్తుతం ఫిన్​టెక్​ వాటా 245 బిలియన్​ డాలర్లని, అంటే 2 శాతమేనని చెప్పారు. 2030 నాటికి ఫిన్​టెక్​ రెవెన్యూ 1.5 ట్రిలియన్​ డాలర్లకు చేరుతుందని అంచనా వేస్తున్నట్లు దాస్​ వెల్లడించారు. ఇండియా ఫిన్​టెక్​ ఇండస్ట్రీ ఇదే కాలంలో 200 బిలియన్​ డాలర్ల రెవెన్యూను అందుకుంటుందని పేర్కొన్నారు.

2014 నాటికి దేశంలో 1.2 బిలియన్ల డిజిటల్​ ట్రాన్సాక్షన్లు జరిగితే, 2022 నాటికి ఆ సంఖ్య 90 బిలియన్లు మించిందని అన్నారు. మై గవ్​ ఇండియా ఈ డేటాను రిలీజ్​ చేసిందని చెప్పారు. గ్లోబల్​ రియల్​టైమ్​ ట్రాన్సాక్షన్లలో ఇండియా వాటా  2022లో 46 శాతానికి పెరిగినట్లు పేర్కొన్నారు. ప్రపంచంలోని నాలుగు లీడింగ్​ దేశాలలోని డిజిటల్​ పేమెంట్​ ట్రాన్సాక్షన్ల కంటే ఇండియాలో ట్రాన్సాక్షన్లు ఎక్కువని వివరించారు.

మన దేశంలో డిజిటల్​ ట్రాన్సాక్షన్లు వాల్యూ, వాల్యూమ్​ పరంగా కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయని దాస్​ చెప్పారు. ఇండియాలోని పేమెంట్​ ఎకోసిస్టమ్​ ఎంత రోబస్ట్​గా ఉందో దీనిని బట్టి అర్ధం చేసుకోవచ్చన్నారు. సెంట్రల్​బ్యాంక్​ డిజిటల్​ కరెన్సీ (సీబీడీసీ) హోల్​సేల్​పైలట్​ కోసం మరికొన్ని టెస్ట్​కేసులు చేపట్టనున్నట్లు వెల్లడించారు.